మండలిలో మళ్లీ దుమారం.. మతాల ప్రస్తావనతో ఉద్రిక్తత

శాసనమండలి సమావేశాల ప్రశ్నోత్తరాల అనంతరం తిరుమల లడ్డూ అంశంపై ప్రభుత్వ ప్రకటనకు ముందు వైసీపీ సభ్యులు బుధవారం సభలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు.;

Update: 2026-03-05 09:50 GMT

ఏపీ శాసన మండలి సమావేశాలు తీవ్ర ఉద్రిక్తంగా సాగుతున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిపై ప్రభుత్వ ప్రకటన చేయకుండా విపక్షం అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా, ప్రభుత్వం తరఫున మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. దీంతో రెండు పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంటోంది. రెండు వైపులా సభ్యులు తమ వాదనకు కట్టుబడి ఉండటం, నినాదాలతో హోరెత్తిస్తుండటంతో సభలో గందరగోళం నెలకొంటుంది. బుధవారం సభలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మండలి చైర్మన్ మోషేన్ రాజు, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఓ మతం వారంటూ చేసిన ప్రకటన తీవ్ర దుమారం రేపింది. దీనిపై గురువారం కూడా సభలో నినాదాలు హోరెత్తాయి.

శాసనమండలి సమావేశాల ప్రశ్నోత్తరాల అనంతరం తిరుమల లడ్డూ అంశంపై ప్రభుత్వ ప్రకటనకు ముందు వైసీపీ సభ్యులు బుధవారం సభలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు. అయితే బుధవారం నాటి ఘటనకు మంత్రి అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారని, తాను కూడా మంత్రి ప్రకటనతో సంతృప్తి చెందానని చైర్మన్ మోషేన్ రాజు స్పష్టం చేశారు. అయినప్పటికీ వైసీపీ సభ్యుడు లేళ్ల అప్పిరెడ్డి కల్పించుకుని బుధవారం సభలో మంత్రి అచ్చెన్నాయుడు చైర్ ను, తమ పార్టీ అధ్యక్షుడిని అవమానించారని ఆరోపించారు. చైర్మన్ క్రిస్టియన్ కాదని చెప్పినా, టీడీపీ సోషల్ మీడియా కొన్ని ఫొటోలు, వీడియోలను వైరల్ చేస్తోందని, చైర్మన్ ను అవమానిస్తోందని విమర్శించారు.

దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ తాను ఏ మతాన్ని అవమానించలేదని, జగన్ మతంపై తాను ప్రకటన చేసి 24 గంటలు అవుతున్నా ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. రాష్ట్రాన్ని అనేక ప్రభుత్వాలు పాలించాయని, కానీ ఎప్పుడూ తిరుమల పవిత్రతకు భంగం కలిగించలేదన్నారు. గత ప్రభుత్వంలో మాత్రం తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా నడుచుకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి మాట్లాడుతున్న సమయంలో వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది.

విపక్షం నిరసనలు కొనసాగుతుండగానే తిరుమల లడ్డూ విషయంపై ప్రకటన చేసేందుకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి చైర్మన్ అవకాశమిచ్చారు. అయినప్పటికీ వైసీపీ సభ్యులు తమ నినాదాలతో సభను హోరెత్తిస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై జరిగిన చర్చ మండలిలో తీవ్ర దుమారం రేపింది. అసెంబ్లీలో వైసీపీ గైర్హాజరుతో ఏకపక్షంగా చర్చ ముగియగా, మండలిలో మాత్రం మంటలు రాజేసింది. వైసీపీ అధినేత ఓ మతానికి చెందిన వారు కనుకే తిరుమల క్షేత్రం పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీకి చెందిన మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడం తీవ్ర దుమారానికి కారణమైందని అంటున్నారు.

Tags:    

Similar News