ప్రధాని మోదీపై దుర్భాషలు మాట్లాడిన యువతకు గట్టి సందేశం..
మన ప్రధాని మోదీ మాత్రం ఆగ్రహంతో ఊగిపోకుండా ఆ అపర మేధావులైన యువతకు "దయచేసి దారి తప్పకండి బాబోయ్" అంటూ అత్యంత సాధువు తరహాలో ఒక ఉచిత కౌన్సెలింగ్ సెషన్ ఇచ్చేశారు.
సోషల్ మీడియాలో లభించే ఆ రెండు నిమిషాల "ఫేమ్" కోసం ప్రధాని నరేంద్ర మోదీని, ఆఖరికి ఆయన దివంగత తల్లిగారిని కూడా లాగి నానా బూతులు తిట్టేసిన మన దేశపు "భావి భారత పౌరులు" కొందరు వార్తల్లోకెక్కారు. దేశాన్ని ఎటు తీసుకెళ్లాలో తెలీకపోయినా మైక్ ముందు బూతులు ఎలా మాట్లాడాలో బాగా వంటపట్టించుకున్న ఈ మహానుభావుల లీలలు చూసి జనాలు రగిలిపోయారు. అయితే సాధారణంగా ఇలాంటి వాటికి 'బుల్డోజర్' వైద్యం లేదా రాత్రికి రాత్రే 'ఖాతా క్లోజ్' చేసే ట్రీట్‌మెంట్ ఆశిస్తారు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. మన ప్రధాని మోదీ మాత్రం ఆగ్రహంతో ఊగిపోకుండా ఆ అపర మేధావులైన యువతకు "దయచేసి దారి తప్పకండి బాబోయ్" అంటూ అత్యంత సాధువు తరహాలో ఒక ఉచిత కౌన్సెలింగ్ సెషన్ ఇచ్చేశారు.
క్షమించడమే మోదీ నయా ట్రెండ్!
"ద్వేషం వద్దు.. దారి చూపండి. ఒక్క తప్పుతో వారి భవిష్యత్తును నాశనం చేయకూడదు. వారు కేవలం దారి తప్పిన అమాయక పక్షులు మాత్రమే’’ అంటూ మోదీ గారు ఇచ్చిన స్టేట్‌మెంట్‌కి సోషల్ మీడియా ఒక్కసారిగా షాక్ అయింది. 'ఎవరైనా నన్ను కొడితే నేను మరో చెంప చూపిస్తా' అన్న గాంధీజీ మార్గాన్ని మోదీ గారు కూడా కాస్త అప్‌డేటెడ్ వెర్షన్‌లో వాడేస్తున్నట్లున్నారు.
సాధారణంగా చిన్న కామెంట్ చేస్తేనే ఐపీసీ సెక్షన్లన్నీ గుమ్మరించే ఈ రోజుల్లో ఏకంగా ప్రధానినే ఏకిపారేసిన కుర్రాళ్లకు శిక్ష పడకపోగా... "అయ్యో పాపం పిల్లలకి అవగాహన లేక కూశారు.. కాస్త మంచి బుద్ధి చెప్పి వదిలేయండి" అని ప్రధానే స్వయంగా రికమండ్ చేయడం విశేషం. బహుశా "తిట్టిన నోటికే దండం పెట్టే" ఈ కొత్త పొలిటికల్ డిజైన్ చూసి విమర్శకులు కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక గుడ్లు తేలేస్తున్నారు.
సమాజానికి ఉచిత ఉచిత సలహా
ఇక ప్రజలకు ప్రధాని ఇచ్చిన పిలుపు మరీ విచిత్రంగా ఉంది. కుర్రాళ్ళు బూతులు తిట్టినా మీరు మాత్రం మీ బిపి పెంచుకోవద్దు. ప్రతీకారం అసలే వద్దు.. మీరూ తిడితే సమాజం విడిపోతుంది. ప్రేమ పంచండి.. తిట్టిన వారికి సైతం ప్రేమ, సహనం తినిపించి సమాజ ధర్మాన్ని కాపాడండి అంటూ పిలుపునివ్వడం విశేషం.
ఏది ఏమైనా క్షమాగుణాన్ని ఒక లీడర్‌షిప్ క్వాలిటీగా మార్చేసి, ఆ బూతుల రాయుళ్లకు "గుణపాఠం" బదులు "గుడ్ మార్నింగ్ మెసేజ్" ఇచ్చి పంపడం మోదీ మార్క్ రాజనీతికి నిదర్శనం. ఆ మాటకొస్తే... తిట్టిన వాడిని తిట్టకుండా వాడికి "మార్గాంతరం" సుగమం చేయడం అంటే ఇదేనేమో.. ఇకపైనైనా ఈ 'దారి తప్పిన ముత్యాలు' సోషల్ మీడియాలో వ్యూస్ కోసం నోటికి పనిచెప్పకుండా... కాస్త బుర్రకి పనిచెప్తే దేశానికి కాస్త ప్రశాంతత మిగులుతుంది.