కర్ణాటకలో 7 వేల మంది కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ? దారుణం వెనుక నిజమిదీ

కర్ణాటకలోని కళాశాల విద్యార్థుల్లో పెద్ద ఎత్తున హెచ్‌ఐవి వ్యాపిస్తోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా.. కొన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో వస్తున్న వార్తలు తీవ్ర కలకలం సృష్టించాయి.

Update: 2026-08-01 07:34 GMT

కర్ణాటకలోని కళాశాల విద్యార్థుల్లో పెద్ద ఎత్తున హెచ్‌ఐవి వ్యాపిస్తోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా.. కొన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో వస్తున్న వార్తలు తీవ్ర కలకలం సృష్టించాయి. దాదాపు 7 వేల మంది విద్యార్థులకు హెచ్‌ఐవి సోకిందని.. రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల్లో విద్యార్థులకు హెచ్‌ఐవి పరీక్షలను ప్రభుత్వం తప్పనిసరి చేసిందని ప్రచారం జరగడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ వార్తలపై కర్ణాటక స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ స్పందించి పూర్తి స్పష్టతనిచ్చింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పింది.

కర్ణాటక స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ ఇచ్చిన స్పష్టత.. వాస్తవాలు ఇవే

సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ కర్ణాటక స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. 7 వేల మంది కాలేజీ విద్యార్థులకు హెచ్‌ఐవి వచ్చిందనేది పూర్తిగా అవాస్తవం. 2004 సంవత్సరం నుంచి ఇప్పటివరకు 18 నుండి 35 ఏళ్ల వయస్సు గల దాదాపు 39,000 మంది బాధితులు యాంటీ రెట్రోవైరల్ థెరపీ చికిత్స పొందుతున్నారు. ఈ మొత్తం చికిత్స పొందుతున్న వారి సంఖ్యను కొందరు కావాలని కాలేజీ విద్యార్థులకు ముడిపెట్టి తప్పుదారి పట్టిస్తున్నారని కర్ణాటక స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ వివరించింది. కాలేజీ విద్యార్థులకు హెచ్‌ఐవి పరీక్షలు తప్పనిసరి చేశారనే వార్తలను కూడా అధికారులు తీవ్రంగా ఖండించారు. ఎవరికీ వారి సమ్మతి లేకుండా బలవంతంగా హెచ్‌ఐవి పరీక్షలు నిర్వహించడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు.

తప్పుడు ప్రచారాల వల్ల కలిగే నష్టం

వైద్య నిపుణులు, కర్ణాటక స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటువంటి నిరాధారమైన వార్తలు సమాజంలో ఎంతో ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తాయి.. హెచ్‌ఐవితో జీవిస్తున్న వ్యక్తులపై సమాజంలో వివక్ష పెరిగే అవకాశం ఉంది. ప్రజల్లో అనవసర భయం, గందరగోళం నెలకొంటాయి. అవగాహన కల్పించే ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. హెచ్‌ఐవిపై అవగాహన పెంచడం, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించడం.. బాధితులకు సరైన చికిత్స అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.

ఆరోగ్య సంబంధిత విషయాలలో సోషల్ మీడియాలో వచ్చే వైరల్ మెసేజ్‌లను సరిచూసుకోకుండా షేర్ చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కేవలం అధికారిక ప్రభుత్వ వర్గాలు లేదా గుర్తింపు పొందిన ఆరోగ్య సంస్థలు విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలి.

హెచ్‌ఐవి అనేది సరైన అవగాహన, సురక్షితమైన జీవనశైలి, అవసరమైనప్పుడు స్వచ్ఛంద పరీక్షలు, సమయానికి తీసుకునే ఏఆర్‌టీ చికిత్స ద్వారా సమర్థవంతంగా నియంత్రించగల సమస్య. కాబట్టి ఇలాంటి పుకార్లను నమ్మకుండా.. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.

Tags:    

Similar News