మోడీని అన్ని తిట్టు తిట్టి.. ఇప్పుడు సారీ చెబితే.. అయిపోతుందా? వైరల్ వీడియో
ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో ఆమె తాజాగా బహిరంగ క్షమాపణలు చెబుతూ ఒక వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రుచికా సింగ్ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో ఆమె తాజాగా బహిరంగ క్షమాపణలు చెబుతూ ఒక వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"అది నా మొదటి, చివరి తప్పు".. వీడియోలో రుచికా భావోద్వేగం
వైరల్ అవుతున్న వీడియోలో రుచికా సింగ్ చేతులు జోడించి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. తాను కేవలం 15 ఏళ్ల విద్యార్థినినని, స్నేహితులతో కలిసి కనాట్ ప్లేస్ వెళ్లిన సమయంలో అక్కడ జరుగుతున్న నిరసనలో పాల్గొన్న వారి ప్రభావానికి లోనై ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపింది. "నేను చేసిన వ్యాఖ్యలు క్షమించరానివి. నా జీవితంలో చేసిన మొదటి, చివరి తప్పు ఇది. ఇకపై ఎప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు చేయను. దేశ ప్రజలందరికీ హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను, నన్ను క్షమించండి" అంటూ ఆమె విజ్ఞప్తి చేసింది.
వెలుగులోకి పోలీసుల దర్యాప్తు వివరాలు: రుచికా వాదనలో నిజమెంత?
రుచికా సింగ్ తాను 15 ఏళ్ల మైనర్ విద్యార్థినినని పేర్కొన్నప్పటికీ పోలీసుల ప్రాథమిక విచారణలో భిన్నమైన విషయాలు బయటపడ్డాయి. ఆమె కుటుంబంతో కలిసి ఫరీదాబాద్‌లో నివసిస్తున్నప్పటికీ నోయిడా సెక్టార్-150లోని లోటస్ జింగ్ సొసైటీలో ఆమెకు స్వంత ఫ్లాట్ ఉందని తేలింది. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఇచ్చిన సమాచారం ప్రకారం.. రుచికా కొన్నేళ్లుగా అక్కడే ఉంటూ ఒక ఉద్యోగం చేస్తోందని పోలీసులు తెలిపారు.
కేసు నమోదు.. ఢిల్లీ స్పెషల్ సెల్‌కు బదిలీ
ఈ ఘటనపై నమోదైన జీరో ఎఫ్‌ఐఆర్‌ను నోయిడా నుంచి ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్‌కు బదిలీ చేశారు. భారతీయ న్యాయ సంహిత లోని ఉద్దేశపూర్వక అవమానం, ప్రజలను అల్లర్లకు ప్రేరేపించడం, పరువునష్టం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న అభ్యంతరకర కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఎక్స్ సంస్థకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ప్రధాని మోదీ స్పందన.. రాజకీయ రచ్చ
ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ తనను, తన దివంగత తల్లిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మన సంస్కృతికే తీవ్ర దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే యువతపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని పెద్ద మనసుతో వ్యాఖ్యానించారు. "వారిని శిక్షించడం కంటే ప్రేమతో దగ్గర చేసుకోవడమే ముఖ్యం. కేసులు, కఠిన శిక్షలు సమాజంలో ఉన్న అసలు సమస్యలకు పరిష్కారం చూపలేవు" అని ప్రధాని పేర్కొన్నారు.
మరోవైపు సీజేపీ ప్రతినిధులు పోలీసుల తీరుపై మండిపడ్డారు. రాజకీయ వ్యాఖ్యలకు క్రిమినల్ కేసులు కాకుండా సివిల్ పరువునష్టం దావాలు వేసుకోవాలని, ఇతర రాజకీయ నాయకులు చేసే అనుచిత వ్యాఖ్యలపై కూడా ఇదే స్థాయిలో చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.