లేళ్ల అప్పిరెడ్డి Vs వరుదు కల్యాణి.. కౌన్సిల్ లో వైసీపీ ఎమ్మెల్సీల గొడవ?
బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలి చర్చలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రధానంగా విక్షపంగా వైసీపీ మండలి వేదికగా బలంగా పోరాడుతోంది.;
శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కల్యాణి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నాదనే ప్రచారం హీట్ పుట్టిస్తోంది. గురువారం మండలిలో వాయిదా తీర్మానాలు ఇచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుందని అంటున్నారు. విపక్షంలో అంతా ఐక్యంగా పనిచేయాల్సిన సమయంలో ఇద్దరు ఎమ్మెల్సీలు వాదులాడుకున్నారని జరుగుతున్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారిందని అంటున్నారు. వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ గైర్హాజరుతో సభలో వైసీపీకి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నాయతక్వం వహిస్తున్నారు. అయితే ఆయనతో వరుదు కల్యాణి విభేదించినట్లుగా జరుగుతున్న ప్రచారం శాసనసభ లాబీల్లో హాట్ టాపిక్ అవుతోంది.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలి చర్చలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రధానంగా విక్షపంగా వైసీపీ మండలి వేదికగా బలంగా పోరాడుతోంది. రోజూ మండలిలో జరుగుతున్న చర్చలపై రాజకీయం నడుస్తోంది. అసెంబ్లీలో కనీస బలం లేకపోవడం, ఆ సమావేశాలను వైసీపీ బహిష్కరించడంతో ఏకపక్షంగా సాగుతున్నాయి. కానీ, మండలిలో పూర్తి భిన్నమైన వాతావరణం నెలకొంది. అధికార, ప్రతిపక్షాలకు సమాన బలం ఉండటంతో ఢీ అంటే ఢీ అంటున్నాయి. ప్రభుత్వం బలమైన స్థితిలో ఉన్నా వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గడం లేదు. దీంతో తెలుగు ప్రజలు అంతా శాసనమండలిలో జరుగుతున్న చర్చలను ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
శాసనమండలిలో వైసీపీ తరపున పలువురు సభ్యులు చురుకుగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా మహిళా సభ్యురాలు వరుదు కల్యాణి క్రియాశీలంగా ఉంటూ ప్రభుత్వంపై మాటలు దాడి చేస్తున్నారు. అయితే ఆమెపై మండలిలో వైసీపీ పక్ష ఉప నేత లేళ్ల అప్పిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారని ప్రచారం జరుగుతోంది. గురువారం సభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలకు వైసీపీ నోటీసులు ఇచ్చింది. ఇందులో వరుదు కల్యాణి పేరుతో ఒక నోటీసు ఇవ్వగా సభలో ఆ సమయంలో కల్యాణి లేరని చెబుతున్నారు. దీంతో ఆ తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.
ఈ పరిణామంతో అసంతృప్తి చెందిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి.. సభకు గైర్హాజరుపై వరుదు కల్యాణిని ప్రశ్నించినట్లు ప్రచారం జరుగుతోంది. తనకు తెలియకుండా నోటీసు ఎలా ఇస్తారని, నోటీసు ఇచ్చిన విషయం తెలియనందునే తాను రాలేదని వరుదు కల్యాణి చెప్పారని అంటున్నారు. దీంతో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగిందని, సహచర సభ్యులు ఇద్దరినీ నచ్చజెప్పి సర్దుమణిగించారని అంటున్నారు. ఈ విషయంపై శాసనసభ లాబీల్లో పెద్ద చర్చకు దారి తీసింది. వైసీపీ పక్ష నాయకుడు గైర్హాజరుతో ఇలాంటి సమస్య ఉత్పన్నమైందని ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే ఈ సంఘటనతో వైసీపీ ఎమ్మెల్సీల మధ్య సమన్వయం లేని విషయం బయటపడిందని వ్యాఖ్యానిస్తున్నారు.