‘‘ఏమీ పీకలేకపోయారు..’’ వైసీపీపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఫైర్

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి సరఫరా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైష్ణవి డెయిరీతో సంగం డెయిరీకి ముడిపెట్టడంపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల తీవ్రంగా స్పందించారు.;

Update: 2026-03-05 10:50 GMT

సంగం డెయిరీ చైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర వైసీపీ తీరుపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వ హయాంలో తనను 33 రోజులు జైల్లో పెట్టి, అణువణువూ గాలించినా ఒక్క తప్పు కూడా పట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో వైసీపీ చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవడానికే ఇతరులపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. "ఫేక్ బ్రతుకులు, మార్పింగ్ వీడియోలు వైసీపీ పేటెంట్ హక్కులు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపణలపై స్పందిస్తూ ఎమ్మెల్యే ధూళిపాళ్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి సరఫరా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైష్ణవి డెయిరీతో సంగం డెయిరీకి ముడిపెట్టడంపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల తీవ్రంగా స్పందించారు. సంఘం డెయిరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ధూళిపాళ్ల అనేక విషయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘స్వామి ద్రోహులు మట్టిలో కలసిపోవడం ఖాయం’’ అంటూ శాపనార్థాలు పెట్టడమే కాకుండా, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స ఆస్పత్రిలో చేరడానికి తిరుమల లడ్డూపై తప్పుగా మాట్లాడటమే కారణమంటూ వ్యాఖ్యానించారు. ‘బందరు బియ్యం దొంగ’ అంటూ వైసీపీ నేత పేర్ని నానిపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. కుటుంబ సమేతంగా దొరికిపోయిన పేర్ని నాని నీతులు, చలోక్తులు చెప్పటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

బందరు ఊసరవెల్లి చెప్పగానే తాను రాత్రికి రాత్రి వైష్ణవి డెయిరీ గేట్లకు రంగులు వేశానని చెప్పడం సిగ్గుచేటుగా వ్యాఖ్యానించారు. ‘‘వెబ్‌సైట్లు డౌన్ చేయటం, మార్ఫింగ్ చేయటం వైసీపీ పేటెంట్ హక్కు, ఫేక్ బతుకులు మీవి.. మావి కావు’’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎమ్మెల్యే ధూళిపాళ్ల. రాజధాని అమరావతి అంశంలో తనపై ఆరోపణలు చేసినపుడే ఏమీ పీకలేరని చెప్పానని, ఈ రోజు అదే చెప్తున్నానని అన్నారు. 33 రోజులు జైల్లో పెట్టి సంగం డెయిరీ సర్వర్లు హ్యాక్ చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. అణువణువూ జల్లిడపట్టినా ఏ తప్పూ దొరకలేదని గుర్తు చేశారు.

కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాల హయంలోనే తాను భయపడలేదన్నారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు సాక్షి పేపర్‌, సాక్షి ఛానల్‌కి 307 కోట్ల రూపాయల అడ్వర్టైజ్‌మెంట్స్ ఇచ్చారని ఆరోపించారు. భారతీ సిమెంట్స్ నుంచి 3 లక్షల టన్నులకు పైగా సిమెంట్‌ను కాంట్రాక్టర్లతో కొనిపించారని ధ్వజమెత్తారు. తనపై వైసీపీ పెట్టిన 22 కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, ప్రభుత్వం తనకు సహకరిస్తే ఆ తప్పుడు కేసులు ఎత్తేయాలి కదా? అంటూ ప్రశ్నించారు. ‘‘వైష్ణవి పక్కన సంగం డెయిరీ సింబల్ ఎందుకు వచ్చిందో? మీతో చేతులు కలిపి నా మీద కుట్ర చేసి కేసులు పెట్టించిన మాజీ చైర్మన్‌ను అడగండి’’ అంటూ సంగం చైర్మన్ ధూళిపాళ్ల మండిపడ్డారు.

‘‘ఫేక్ బతుకులకు పేటెంట్ హక్కులు వైసిపివి, ఫాల్త్ గాళ్ళు వైసీపీ వాళ్ళు’’ అంటూ పరుష వ్యాఖ్యలు ప్రయోగించారు. తిరుపతి లడ్డు కల్తీ అయిందనేది నిజం, వెజిటబుల్ ఆయిల్, జంతువుల కొవ్వు ఉందని ఎన్డీడీబీ చెప్పిందని ధూళిపాళ్ల స్పష్టం చేశారు. ఇప్పటికైనా స్వామి దగ్గరకు వెళ్ళి తప్పు ఒప్పుకోవాలని హితవుపలికారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము విజయవాడకి 12.5 కోట్లు, చెన్నైకి 7.5 కోట్లు వచ్చాయని సిట్ చెప్పిందని ఆరోపించారు. బహిరంగ మార్కెట్ లో బటర్ ధర రూ.360 ఉంటే రూ.316కి నెయ్యి ఎలా సరఫరా చేశారని ప్రశ్నించారు. పాలు, వెన్న లేకుండా నెయ్యి తయారు చేసిన మహా ఘనులు వైసీపీ నాయకులు అంటూ ఎద్దేవా చేశారు.

తిరుమలకు నెయ్యి సరఫరా చేయాలని సంగం డెయిరీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోందని తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2020, 2021లో కూడా టీటీడీ నెయ్యి టెండర్ వేసిందని వెల్లడించారు. అయినా తమకు అవకాశం దక్కలేదని, స్వామి ఇప్పుడు అవకాశం ఇచ్చారని తెలిపారు. సీఎం చంద్రబాబు చెపితే టెండర్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. సాంకేతిక, శాస్త్రీయ పరీక్షలు అనంతరం నిబంధనల ప్రకారం టెండర్‌లో పాల్గొని సంగం డెయిరీ నెయ్యి సరఫరా చేస్తుందని తెలిపారు. అదేసమయంలో హెరిటేజ్ ఒక్క నెయ్యి పూస కూడా టీటీడీకి సరఫరా చేయలేదని వివరించారు. సంగం డెయిరీ గుంటూరు రైతులది, శ్రీజ డెయిరీ చిత్తూరు మహిళలదని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర స్పష్టంచేశారు.

వైసిపి చేసిన పాపాన్ని మోసిన, సమర్థించిన పాపం వల్లే మండలిలో విపక్ష నేత బొత్స ఆసుపత్రిలో ఉన్నారని తీవ్రవ్యాఖ్యలు చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని దగ్గర తప్పు చేస్తే మట్టిలో కలిపోవడం ఖాయమంటూ శాపనార్థాలు పెట్టారు. పవిత్రమైన తిరుమల లడ్డుని అపవిత్రం చేసిన వైసిపి.. ఆ తప్పు నుండి బయట పడేందుకు ఇతరుల మీద బురద జల్లుతుందని ధ్వజమెత్తారు. వైసిపి నాయకులకు సవాల్ విసురుతున్నా అమూల్ తరువాత దక్షిణ భారత దేశంలో నాణ్యమైన ఉత్పత్తులు అందించేది సంగం డెయిరీ ఒక్కటేనని ఎమ్మెల్యే ధూళిపాళ్ల స్పష్టం చేశారు.

Tags:    

Similar News