కష్టకాలంలో బీజేపీని ఆదుకుంది మిత్రుడు కానీ మిత్రుడేనా ?

ఈ పెద్ద ఇష్యూ అన్నది దేశంలో చెలరేగి బీజేపీని ప్రత్యేకించి మోడీ అమిత్ షాలను లక్ష్యంగా చేసుకున్న వేళ బీజేపీ మంత్రులు నేతలే స్పందించడం కనిపించింది అని అంటున్నారు.

Update: 2026-07-26 03:36 GMT

బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే కూటమి ఏర్పాటు అయింది. ప్రభుత్వాన్ని కూడా నడుపుతోంది. అందులో చిన్నా పెద్దా పార్టీలు అన్నీ కలిపి ఏకంగా పాతిక పై చిలుకు ఉన్నాయి. ఎంతో మంది ఉద్దండులు బీజేపీకి మిత్ర పక్ష నేతలుగా ఉన్నారు. ఇక మిత్రులకు ప్రభుత్వంలో తగిన అధికార వాటాను బీజేపీ కేటాయిస్తూ వస్తోంది. ఆఖరుకు గవర్నర్ పదవులు కూడా వారికి వారి బలాబలాల ఆధారంగా కేటాయిస్తోంది. అయితే బీజేపీ ఎపుడూ పెద్దన్నగా పైచేయి తనదే అంటూ వస్తోంది. ఇంతకాలం ఆ హవా సాగిపోయింది. కానీ ఎన్డీయేలో ఏనుగంత బలం కలిగిన బీజేపీకి అనూహ్యంగా అతి పెద్ద కష్టమే వచ్చిపడింది. అది మామూలుగా కాదు రాజకీయ పార్టీలతో నేరుగా పోరాటం చేయమంటే బీజేపీకి ఎవరి సాయం అవసరం లేదు కానీ ఈ దేశ జనాభాలో అరవై శాతంగా ఉన్న యువతతోనే పెద్ద పేచీ వచ్చింది. రెండున్నర నెలలుగా బీజేపీ గుక్కతిప్పుకోలేని విధంగా యువత నుంచి సవాళ్ళు వచ్చిపడ్డాయి. ఉవ్వెత్తుల లేచిన విద్యార్ధి ఉద్యమాలతో బీజేపీకి దిక్కు తోచని నేపథ్యం ఏర్పడింది.

ఏం చేయాలో తెలియక :

ఎన్డీయే ప్రభుత్వాన్ని బీజేపీ నాయకత్వంలో నడుపుతోంది. కానీ సమస్య మాత్రం బీజేపీనే తగులుకుంది. విపక్షాలు సహా విద్యార్ధి లోకం అంతా బీజేపీనే టార్గెట్ చేసింది. దాంతో ఏమి చేయాలో తెలియక బీజేపీ పూర్తిగా ఇబ్బందిలో పడిపోయింది. ఒక దశలో బీజేపీ ఈ సమస్యను ఎలా అధిగమిస్తుంది అన్నది అందరికీ పెద్ద ప్రశ్నగా మారింది. ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి చందంగా బీజేపీ తీరు అయింది. విద్యార్ధి లోకంతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసు. అలాగని తల ఒగ్గితే ప్రభుత్వం పరువు కూడా ఏమవుతుందో అన్నది కంగారు ఇలా నిలువునా నీరైన బీజేపీకి మిత్రుల నుంచి ఏ మేరకు సలహాలు సూచనలతో సహకారం లభించింది అన్నది ఒక చర్చగా ఉంది.

బీజేపీ ఒంటరిగానే :

ఈ పెద్ద ఇష్యూ అన్నది దేశంలో చెలరేగి బీజేపీని ప్రత్యేకించి మోడీ అమిత్ షాలను లక్ష్యంగా చేసుకున్న వేళ బీజేపీ మంత్రులు నేతలే స్పందించడం కనిపించింది అని అంటున్నారు. మిత్ర పక్షాల నుంచి మద్దతు ప్రకటనలు కూడా కనీసంగా ఎక్కడ నుంచి రాలేదని గుర్తు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ సారధి కాబట్టి వారే ఈ సమస్యను పరిష్కారం చూసుకుంటారని మిత్రులు భావించారా లేక విద్యార్ధులతో వ్యవహారం కాబట్టి ఏమంటే ఏమి వస్తుందో పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియక మౌన ముద్ర దాల్చారో కానీ ఎన్డీఏ మిత్రపక్షం అయితే మౌనం దాల్చింది అని అంటున్నారు.

ఆయన సలహా మేరకే :

అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో బీజేపీ తన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించి మొత్తానికి బయటపడింది. కానీ ఆ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం వెనక చాలానే కసరత్తు చేశారు అని అంటున్నారు. ఇక పార్లమెంట్ జరుగుతున్న సందర్భంగా మహారాష్ట్ర దిగ్గజ నేత ఎన్సీపీకి చెందిన నాయకుడు శరద్ పవార్ తో ఈ విషయం మీద మోడీ చర్చించారని అంటున్నారు. దాంతో విద్యార్థుల సమస్యల మీద సాగదీత వైఖరి కాకుండా ప్రభుత్వం తగ్గి నిర్ణయం తీసుకోవడమే బెటర్ అని ఆయన సూచించారు అని అంటున్నారు. అందుకే కేంద్ర మంత్రి రాజీనామా అని చెబుతున్నారు. ఇక ఇదే విషయం మీద శరద్ పవార్ కూడా తాను ప్రధానికి సలహా ఇచ్చాను అని బాహాటంగానే చెప్పుకున్నారు. విషయం చూస్తే శరద్ పవార్ మోడీకి వ్యక్తిగతంగా మిత్రుడు కావచ్చు. కానీ ఆయన ఎన్డీయే మిత్రుడు అయితే కాదు, ఇండియా కూటమిలో ఉన్నారు. ఎన్డీయేలోకి ఆయన వస్తారు అని ప్రచారం అయితే ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఆయన మిత్రుడు కానీ మిత్రుడు. మరి పెద్దాయనగా ఆయన సలహాను మోడీ తీసుకుని ఈ గండం గట్టెక్కారు అని అంటున్నారు. మరి ఎన్డీయే దిగ్గజ మిత్రులు మౌనం దాల్చడం వెనక కారణాలు ఏమిటి అన్న చర్చ సైతం సాగుతోంది.

Tags:    

Similar News