ధర్మేంద్ర ప్రధాన్ ఔట్.. నెక్ట్స్ టార్గెట్ నితిన్ గడ్కరీనా?

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం దేశ రాజకీయాల్లో మరో కొత్త చర్చ మొదలైంది.

Update: 2026-07-26 01:30 GMT

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం దేశ రాజకీయాల్లో మరో కొత్త చర్చ మొదలైంది. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఆయన పదవి వీడిన తర్వాత ఇప్పుడు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేరు సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తోంది. ముఖ్యంగా పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం (ఈ20) అంశంపై గత కొంతకాలంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వ విధానానికి ఇచ్చిన మద్దతు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి.

ఇటీవలి కాలంలో పెట్రోల్‌లో 20 శాతం వరకు ఇథనాల్ కలపడం వల్ల వాహనాల పనితీరు, ఇంజిన్ సామర్థ్యం, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని పలువురు వాహనదారులు, క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విధానం దేశ ప్రయోజనాల కోసమేనని..దిగుమతి ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించడమే లక్ష్యమని నితిన్ గడ్కరీ పలుమార్లు పేర్కొన్నారు. కానీ ఇటీవల 20 శాతం కంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమం గురించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.

ఈ నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్ల సంఘాలు ఆగస్టు 4న పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నిరసనలో ప్రధానంగా పెట్రోలియం శాఖ విధానాలపై వ్యతిరేకత వ్యక్తం చేయనున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి కూడా విమర్శల కేంద్రంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అదే సమయంలో ఇథనాల్ విధానానికి బహిరంగంగా మద్దతు తెలిపిన నితిన్ గడ్కరీ కూడా ఈ వివాదంలో ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విద్యా రంగానికి సంబంధించిన ఆందోళనలు రాజకీయంగా పెద్ద మలుపు తిరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఇంధన విధానాలపై కూడా ప్రజా ఉద్యమం ఊపందుకుంటుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటివరకు ఇథనాల్ మిశ్రమంపై వచ్చిన విమర్శలను పెద్దగా పట్టించుకోకపోయినా రాబోయే రోజుల్లో నిరసనలు మరింత ఉధృతమైతే పరిస్థితులు మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ప్రస్తుతం నితిన్ గడ్కరీ రాజీనామా చేయనున్నారనే అధికారిక సమాచారం లేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, ప్రతిపక్ష విమర్శలు, నిరసనలకు సంబంధించిన ప్రచారం మాత్రమే ప్రస్తుతం ప్రధానంగా కనిపిస్తోంది. ఆగస్టు 4న ప్రతిపాదిత నిరసనల తర్వాత ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ అంశం రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News