ఈ టెర్మ్ లో ఆయనకు కేంద్ర మంత్రి చాన్స్ లేనట్లే ?

ధర్మేంద్ర ప్రధాన్. 57 ఏళ్ళ ఈ రాజకీయ నాయకుడు ఒడిషా నుంచి కేంద్ర రాజకీయాల్లో కీలకంగా మారే దిశగా పాతికేళ్ళ రాజకీయ ప్రస్థానం నడిచింది.

Update: 2026-07-25 23:30 GMT

ధర్మేంద్ర ప్రధాన్. 57 ఏళ్ళ ఈ రాజకీయ నాయకుడు ఒడిషా నుంచి కేంద్ర రాజకీయాల్లో కీలకంగా మారే దిశగా పాతికేళ్ళ రాజకీయ ప్రస్థానం నడిచింది. 2000లో తొలిసారి ఎమ్మెల్యేగా చట్టసభలో ప్రవేశించిన ధర్మేంద్ర ప్రధాన్ లోక్ సభకే కాదు, రాజ్యసభకు కూడా నెగ్గిన వారుగా ఉన్నారు. మొత్తం మీద ఎమ్మెల్సీ తప్ప మూడు సభలలో ప్రాతినిధ్యం వహించిన అరుదైన నాయకుడు. దానికంటే ఎక్కువగా సంఘీయుడు. ఒడిషా రాజకీయాల్లో బలమైన ప్రజాకర్షణ కలిగిన నాయకుడు. విద్యాశాఖ మంత్రిగా ఆయన 2021 నుంచి అంటే అయిదేళ్ళుగా నిరాటంకంగా కొనసాగుతున్నారు. ఆయన రాజకీయ జీవితంలో ఈ విధంగా రాజీనామా చేసి తొలగిపోవడం అతి పెద్ద మచ్చగానే చూడాల్సి ఉంది.

ఉన్నత విద్యావంతుడిగా :

ఇదిలా ఉంటే రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం ధర్మేంద్ర ప్రధాన్ ది. ఆయన తండ్రి దేబేంద్ర ప్రధాన్ 1999లో ఏర్పాటు అయిన అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో 1999 నుండి 2004 వరకూ కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇక ధర్మేంద్ర ప్రధాన్ విషయం తీసుకుంటే ఆయన ఒడిషా రాష్ట్రంలోని తల్చర్ పట్టణంలో జన్మించారు. ఇక ఆయన ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సమయంలో కళాశాలలోని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో సభ్యునిగా ఉండేవాడు, 1983లో ఏబీవీపీ సెక్రెటరీగా ఎన్నికయ్యాడు. ప్రధాన్ భువనేశ్వర్ లోని ఉత్కల్ విశ్వవిద్యాలయం నుండి ఆంత్రోపాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందాడు. ఆయన మేధావిగానూ గుర్తింపు అందుకున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఏరి కోరి ఆయనకు విద్యా శాఖను కట్టబెట్టింది అని అంటారు.

బీజేపీ విజయం వెనక :

మరో వైపు చూస్తే ఓడిషాలో బీజేపీ విషయం వెనక ధర్మేంద్ర ప్రధాని కీలక పాత్ర పోషించారు. 2024లో జరిగిన ఈ ఎన్నికల్లో అప్పటికి పాతికేళ్ళుగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతాదళ్ ని ఓడించి మరీ బీజేపీకి అధికారం దక్కించడంతో ధర్మేంద్ర ప్రధాన్ పోషించిన పాత్ర చాలా ముఖ్యమైనది అని అంటారు. నిజానికి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన నాయకుడు. కానీ బీజేపీ పెద్దలు ఆయనను కేంద్ర రాజకీయాల్లో కొనసాగే విధంగా నిర్ణయం తీసుకోవడంతో అక్కడ ఒడిషా ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత మోహన్ చరణ్ మాఝీ 2024 జూన్ 12న బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి అయ్యారు. నిజానికి ఆయన ముఖ్యమంత్రి రేసులో ఉన్నారని ప్రచారం సాగింది.

పార్టీ పదవులకేనా :

ఇంకా రాజకీయంగా ఎంతో వయసు ఉంది. సామర్థ్యం ఉంది. విశేష అనుభవం ఉంది. కేంద్ర బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. ప్రజల అభిమానం ఉంది. ఎన్ని ఉన్నా కూడా ధర్మేంద్ర ప్రధాన్ అధికార రాజకీయ జీవితానికి అనూహ్యంగా బ్రేక్ పడిపోయింది. మరో మూడేళ్ళ పాటు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంటుంది. నిజానికి నీట్ పేపర్ లీకేజ్ కనుక లేకపోయి ఉంటే అయిదేళ్ళ పాటు ఆయన కేంద్ర మంత్రిగా తిరుగులేని అధికారం చలాయించేవారు. అయితే ఇపుడు ఆయనకు ఆ అవకాశం లేదు. ఈ మూడేళ్ళ పాటు కూడా ఆయన కేవలం లోక్ సభ సభ్యుడిగానే ఉండాలి. అయితే ఆయన బీజేపీ తరఫున పార్టీలో కీలకమైన భూమిక పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి ఒక డైనమిక్ పొలిటికల్ లీడర్ రాజకీయం ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడం మాత్రం రాజకీయ వర్గాలలో ఆలోచింపచేసేదిగా ఉంది.

Tags:    

Similar News