'జై ఆంధ్ర' నినాదం.. కేక పుట్టించిన కవిత
తెలంగాణ జాగృతి నాయకురాలు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారిణి కవిత ‘జై ఆంధ్ర’ నినాదం చేశారు.;
తెలంగాణ జాగృతి నాయకురాలు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారిణి కవిత ‘జై ఆంధ్ర’ నినాదం చేశారు. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చిన కవిత రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడే ముందు ‘జై ఆంధ్ర’ అంటూ నినదించారు. దీంతో అక్కడ ఉన్నవారంతా షాక్ తిన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో తెలంగాణ వాదిగా ముద్రపడిన కవిత ‘జై ఆంధ్ర’ అనడమేంటి? అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలో కొత్త పార్టీని ప్రారంభించనున్న కవిత తెలంగాణలోని సెటిలర్లను ఆకర్షించేందుకే ‘జై ఆంధ్ర’ నినాదం చేశారా? అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
కవిత జై ఆంధ్ర నినాదం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఢిల్లీ మద్యం స్కాంలో క్లీన్ చిట్ లభించిన తర్వాత కవిత దూకుడు పెంచారు. ముందుగా శ్రీవారి దర్శించుకోవాలనే ఉద్దేశంతో తిరుపతి వచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో అడుగు పెట్టిన వెంటనే విభిన్నంగా స్పందించి అందరి దృష్టిని ఆకర్షించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ తో విభేదించి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కవిత కొత్త పార్టీ ప్రారంభించే సన్నాహాలు వేగవంతం చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కవిత గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. తెలంగాణ జాగృతి పేరుతో ఏర్పాటు చేసిన సంస్థతో మహిళల్లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తట్టిలేపారు కవిత. అలా తెలంగాణ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అయితే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అధినాయకత్వంతో విభేదించి సొంత కుంపటి పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో వరుస ఓటములతో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ తెలంగాణ భావోద్వేగాన్ని తట్టిలేపేలా కార్యకలాపాలు నిర్వహించాలని అడుగులు వేస్తుంటే, అందుకు భిన్నంగా కవిత ‘జై ఆంధ్ర’ అంటూ నినదించడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కవిత ‘జై ఆంధ్ర’ నినాదం వెనుక పక్కా వ్యూహం ఉందని అంటున్నారు. తెలంగాణలో తాను కొత్తగా ప్రారంభించే పార్టీకి అందరి మద్దతు ఉండాలనే ఆలోచనతోనే ఆమె ఈ నినాదం చేశారంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణ నినాదాలు చేసి ప్రయోజనం లేదని ఆమె భావిస్తున్నారని అంటున్నారు. ప్రజల ఆకాంక్షలు తీరినందున ఇప్పుడు అందరూ సమానమనే సంకేతాలు ఇవ్వాలని, రాష్ట్రంలోని సెటిలర్లకు దగ్గరవ్వాలని కవిత ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా బలం తగ్గినా సెటిలర్లలో ఇప్పటికీ ఆదరణ ఉందని అంటున్నారు. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల మున్సిపాలిటీలు, నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయానికి సెటిలర్ల ఓట్లే కీలకమని అంటున్నారు. ఈ నేపథ్యంలో సెటిలర్లను ఆకర్షించేందుకు కవిత ‘జై ఆంధ్ర’ నినాదం చేసినట్లు భావిస్తున్నారు.