రాజ్యసభ సీటు.. వైఎస్సార్-కేవీపీ... రేవంత్-వేం నరేందర్!
పెద్దల సభ.. రాజ్యసభను ఎంతో గౌరవంగా పిలుచుకునే పేరు ఇది. ఇలాంటి సభకు వెళ్లేవారిని చాలా ప్రత్యేకంగా చూస్తారు.;
పెద్దల సభ.. రాజ్యసభను ఎంతో గౌరవంగా పిలుచుకునే పేరు ఇది. ఇలాంటి సభకు వెళ్లేవారిని చాలా ప్రత్యేకంగా చూస్తారు. రాష్ట్రాల్లో అయితే వీరి ఎంపిక చాలా ఆసక్తి రేపుతుంటుంది. ఒక సీటుకు పది మంది పోటీ పడే సందర్భం కూడా ఉంటుంది. అయితే, తెలంగాణ నుంచి అధికార కాంగ్రెస్ తరఫున రాజ్య సభ సభ్యులుగా వెళ్లేది ఎవరో తేలిపోయింది. ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, సీనియర్ నాయకుడు వేం నరేందర్ రెడ్డిలకు అభ్యర్థిత్వం దక్కింది. వీరిద్దరూ నామినేషన్లు కూడా దాఖలు చేశారు. అధికార బలం ప్రకారం చూస్తే ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖాయం. ఇక అందరినీ ఆశ్చర్యపరిచిన ఎంపిక... వేం నరేందర్ రెడ్డిదే. సీనియర్ నాయకులు వీహెచ్ సహా ఎంతోమంది పోటీపడిన ఈ సీటును వేంను వరించింది. దీనివెనుక సీఎం రేవంత్ తో సాన్నిహత్యమే కారణం.
అప్పట్లో వారు.. ఇప్పుడు వీరు
వైఎస్సార్-కేవీపీ... తెలుగు రాష్ట్రాల్లో స్నేహానికి చిరునామాగా నిలిచిన పేరు. మెడికల్ కాలేజీ దశ నుంచి మొదలైన వీరి స్నేహం 40 ఏళ్లు కొనసాగింది. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో ఆయన కుటుంబ సభ్యుల కంటే తీవ్రంగా నష్టపోయింది ఎవరూ అంటే కేవీపీనే అని చెప్పాలి. వైఎస్ కు అంతటి ఆత్మబంధువు కేవీపీ. అలానే తాను సీఎం అయ్యాక కేవీపీని పట్టుబట్టి మరీ రాజ్యసభకు పంపారు వైఎస్. అసలు పబ్లిక్ స్పీకర్ కాని కేవీపీని పెద్దల సభకు ఎంపిక చేసి తన స్నేహశీలతను చాటుకున్నారు. ఇదంతా జరిగింది 2008లో. ఆ తర్వాత కేవీపీ రాజ్యసభ సభ్యత్వం వైఎస్ లేకున్నా మరోసారి పొడిగించింది కాంగ్రెస్ పార్టీ. అలా 2020 వరకు ఆయన ఎంపీగా ఉన్నారు.
ఇప్పటి విషయానికి వస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహిత మిత్రుడు ఎవరూ అంటే, నేరుగా చెప్పే పేరు వేం నరేందర్ రెడ్డి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వేం.. 2004లో తొలిసారి మహబూబాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినా.. అసెంబ్లీలో వేం తన వాగ్ధాటితో ఆకట్టుకున్నారు. వైఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన సుదీర్ఘ చర్చలో తనదైన శైలిలో మెప్పించారు. టీడీపీలో ఉండగా రేవంత్ తో ఏర్పడిన స్నేహసంబంధాలను కొనసాగించారు. ఇక 2009 తర్వాత ఆయన నియోజకవర్గం రిజర్వ్ అయిది. 2010 ఉప ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2017లో రేవంత్ రెడ్డితో పాటే కాంగ్రెస్ లో చేరారు. 2023 చివరలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. 2024 జనవరిలోనే సీఎం సలహాదారుగా పదవీ బాధ్యతలు చేపట్టారు వేం నరేందర్ రెడ్డి. ఇప్పుడు తీవ్ర పోటీ మధ్య కూడా రాజ్య సభ సభ్యత్వం పొందారు. ఈ నేపథ్యంలోనే అప్పటి వైఎస్-కేవీపీ ద్వయంతో నేటి రేవంత్ -వేంలను పోలుస్తున్నారు.
కాంగ్రెస్ పై పోరాడి ఆ పార్టీ నుంచే
టీడీపీలో రాజకీయం ప్రారంభించిన వేం నరేందర్ రెడ్డి... గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడి, ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీగా రాజ్యసభకు వెళ్తుండడం గమనార్హం. అటువైపు ఆయన స్నేహితుడు రేవంత్ రెడ్డి కూడా మొదట స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ అయి, తర్వాత టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయి, కాంగ్రెస్ లోకి వచ్చి ఎంపీ అయి తర్వాత సీఎం కావడం విశేషం. అయితే, వైఎస్-కేవీపీ మాత్రం అలాకాదు.. పుట్టుక నుంచి కాంగ్రెస్ నే నమ్మి అందులో కొనసాగినవారు. అదొక్క విషయం తప్ప స్నేహంలో రేవంత్-వేం నరేందర్ రెడ్డిలది గాఢమైన బంధమే.