విశాఖ మకుటంలో మరో మెట్రో లెవెల్ కిరీటం..!

విశాఖపట్నం అభివృద్ధి ప్రస్తుతం ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల తరహాలో వేగంగా రూపాంతరం చెందుతోందని లింక్డ్ ఇన్ విశ్లేషించింది.

Update: 2026-07-22 16:30 GMT

మెట్రో నగరాల ట్రాఫిక్ నరకం.. విపరీతమైన జీవన వ్యయానికి చెక్ పెడుతూ గ్లోబల్ దిగ్గజాల చూపు ఇప్పుడు వైజాగ్ పైనే పడింది. సముద్ర అలల హోరుకు సాంకేతిక నైపుణ్యం తోడై.. ఉద్యోగాల సృష్టి, టాలెంట్ పూల్‌లో ముంబై, బెంగళూరు రేంజ్‌లో దూసుకెళ్తున్న విశాఖపట్నం తాజాగా దేశంలోనే ‘ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నాన్-మెట్రో సిటీ’గా ‘లింక్డ్‌ఇన్’ నివేదికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని ఏపీ పారిశ్రామిక భవిష్యత్తుకు సరికొత్త దిశానిర్దేశం చేసింది.

దేశంలో ఉపాధి అవకాశాలు, ప్రతిభావంతులైన మానవ వనరుల పెరుగుదల పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశాఖపట్నం అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్ ఇన్ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దేశంలోని మెట్రో నగరాలను మినహాయించి వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్-10 నాన్-మెట్రో నగరాల జాబితాలో విశాఖ మొదటి స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

లింక్డ్ ఇన్ నివేదిక ప్రకారం విశాఖతో పాటు రాంచీ, విజయవాడ, నాసిక్, రాయ్‌పూర్, రాజ్‌కోట్, గ్వాలియర్, ఆగ్రా, జమ్మూ, వారణాసి నగరాలు కూడా వేగంగా ఎదుగుతున్న పట్టణాలుగా గుర్తింపు పొందాయి. ముఖ్యంగా ఉద్యోగాల సృష్టి, నైపుణ్యం కలిగిన ఉద్యోగుల లభ్యత, కొత్త పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాల్లో ఈ నగరాలు గణనీయమైన పురోగతి సాధిస్తున్నాయని పేర్కొంది.

విశాఖపట్నం అభివృద్ధి ప్రస్తుతం ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల తరహాలో వేగంగా రూపాంతరం చెందుతోందని లింక్డ్ ఇన్ విశ్లేషించింది. ఐటీ, ఐటీఈఎస్, తయారీ పరిశ్రమలు, పోర్టు ఆధారిత వ్యాపారాలు, స్టార్టప్ ఎకోసిస్టమ్ విస్తరణతో విశాఖ దేశవ్యాప్తంగా ఉద్యోగార్థులు, కంపెనీల దృష్టిని ఆకర్షిస్తోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగైన రవాణా వ్యవస్థ, విద్యా సంస్థల విస్తరణ కూడా నగర అభివృద్ధికి బలాన్నిస్తున్న అంశాలుగా పేర్కొంది.

అదే సమయంలో విజయవాడలో కూడా ఇంజినీరింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది. పరిశ్రమల విస్తరణతో పాటు సాంకేతిక నైపుణ్యాలు కలిగిన యువతకు అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపింది. మరోవైపు మిగతా నాన్-మెట్రో నగరాల్లో వ్యాపార, సేవల రంగాల్లో ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తున్నాయని పేర్కొంది.

ఇటీవలి కాలంలో పెద్ద నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయం, ట్రాఫిక్ సమస్యలు, కార్యాలయాల వికేంద్రీకరణ వంటి కారణాలతో సంస్థలు రెండో శ్రేణి నగరాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ పరిణామం విశాఖ వంటి నగరాలకు భారీ అవకాశాలను తీసుకొస్తోంది. ఐటీ సంస్థలు, గ్లోబల్ కంపెనీలు, స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఆసక్తి చూపడం వల్ల స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విశాఖలో కొనసాగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ పెట్టుబడులు, విద్యా రంగం విస్తరణ, మెరుగైన జీవన ప్రమాణాలు వంటి అంశాలు భవిష్యత్తులో ఈ నగరాన్ని దేశంలోని ప్రముఖ ఉద్యోగ కేంద్రాల్లో ఒకటిగా నిలబెట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం లింక్డ్ ఇన్ నివేదికలో విశాఖ అగ్రస్థానంలో నిలవడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సామర్థ్యానికి మరో గుర్తింపుగా భావిస్తున్నారు.

Tags:    

Similar News