అప్ప‌ల‌రాజు అరెస్టు.. వైసీపీకి భారీ షాక్‌!

సీదిరిపై కాశీబుగ్గ పోలీసులు కుట్ర, చీటింగ్‌, హ‌త్యాయ‌త్నాన్ని ప్రోత్స‌హించ‌డం వంటి ప‌లు కీల‌క సెక్ష‌న్ల‌ను పెట్టిన‌ట్టు అధికారులు తెలిపారు.

Update: 2026-07-22 14:50 GMT

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీకి భారీ షాక్ త‌గిలింది. ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే..ఇది రాజ‌కీయ ప‌ర‌మైన అంశం కాక‌పోయినా..కీల‌క నేత‌ను అరెస్టు చేయ‌డంతో వైసీపీ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. బుధ‌వారం సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యంలో సీదిరి అప్ప‌ల‌రాజును కాశీబుగ్గ పోలీసులు ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు. అనంత‌రం.. స్టేష‌న్‌కు త‌ర‌లించారు. కాగా.. సీదిరి అప్ప‌ల‌రాజు అరెస్టు విష‌యం తెలుసుకున్న వైసీపీ నాయ‌కులు పోలీసుల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా.. వారిపై స్వ‌ల్ప లాఠీ చార్జీ జ‌రిగింది.

కుట్ర కేసు!

సీదిరిపై కాశీబుగ్గ పోలీసులు కుట్ర, చీటింగ్‌, హ‌త్యాయ‌త్నాన్ని ప్రోత్స‌హించ‌డం వంటి ప‌లు కీల‌క సెక్ష‌న్ల‌ను పెట్టిన‌ట్టు అధికారులు తెలిపారు. ముఖ్యంగా కుట్ర కోణంలోనే సీదిరిని అరెస్టు చేశామ‌ని తెలిపారు. అదేవిధంగా జ‌రిగిన ఘ‌ట‌న నుంచి త‌ప్పించు కునే ప్ర‌య‌త్నం చేయ‌డంలో ఆయ‌న మాస్ట‌ర్‌మైండ్‌గా వ్య‌వ‌హ‌రించార‌ని పేర్కొన్నారు. కాగా.. సీదిరి కుమారుడు ఆర‌వ్ వ‌ర్మ ఇప్ప‌టికే జైల్లో ఉండ‌గా.. ఇప్పుడు సీదిరిని కూడా అరెస్టు చేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు.. ఈ అరెస్టును వైసీపీ నాయ‌కులు ఖండించారు. రాజ‌కీయ కుట్ర‌లో భాగంగానే పోలీసులు అరెస్టు చేశార‌ని, పోలీసులుఅధికార పార్టీకి అనుకూలంగా ప‌నిచేస్తున్నార‌ని ఆరోపించారు.

అస‌లు ఏం జ‌రిగింది?

సీదిరి అప్ప‌ల‌రాజు కుమారుడు ఆర‌వ్ వ‌ర్మ‌(19) గ‌త వారం బుల్లెట్‌ను న‌డుపుతూ.. ఓ గొర్రెల కాప‌రి దాన‌య్య‌ను బ‌లంగా ఢీ కొట్టారు. ఈ ఘ‌ట‌న‌లో దాన‌య్య అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. అయితే.. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే ఎంట్రీ ఇచ్చిన అప్ప‌ల‌రాజు.. త‌న కుమారుడిని ర‌క్షించుకునే క్ర‌మంలో బుల్లెట్ ఓన‌ర్‌, ఆర‌వ్‌వ‌ర్మ స్నేహితుడు సిద్ధార్థ‌ను కేసులో ఇరికించారు. సిద్ధార్థే.. బుల్లెట్ న‌డుపుతూ.. దాన‌య్య‌ను ఢీకొట్టి.. చంపేశార‌ని పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. ఈ విష‌యం రాజ‌కీయంగా దుమారం రేపింది. దీంతో పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌లు ప‌రిశీలించారు.

బుల్లెట్‌కు పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించ‌డం నుంచి దానిని న‌డ‌ప‌డం వ‌ర‌కు న‌మోదైన అన్ని సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని ప‌రిశీలించి.. ఆర‌వ్ వ‌ర్మ‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అత‌ను కూడా ఈ కేసును అంగీక‌రించాడు.. బుల్లెట్‌ను తానే న‌డిపాన‌ని చెప్పాడు. అయితే.. ఈ కేసును మాయ చేసి సంబంధం లేద‌ని వ్య‌క్తిపై కేసు న‌మోద‌య్యేలా చేశార‌న్న అభియోగం పై మాజీ మంత్రి సీదిరి చుట్టూ.. రాజకీయ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ ప‌రిణామాల క్ర‌మంలో ఉన్న‌తాధికారుల ఆదేశాల మేర‌కు.. కుట్ర కేసును సృష్టించిన సీదిరిని బుధ‌వారం కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు.

Tags:    

Similar News