స్థానిక సమరం...వైసీపీకి పోయేది ఏమీ లేదా ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల తతంగానికి రంగం సిద్ధం అవుతోంది. మొత్తం 45 రోజులలోగా ఈ మొత్తం ఎన్నికల క్రతువుని జరిపించాలని కూటమి ప్రభుత్వం పట్టుదలగా ఉంది.

Update: 2026-09-22 02:39 GMT

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల తతంగానికి రంగం సిద్ధం అవుతోంది. మొత్తం 45 రోజులలోగా ఈ మొత్తం ఎన్నికల క్రతువుని జరిపించాలని కూటమి ప్రభుత్వం పట్టుదలగా ఉంది. అంటే అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ మధ్యలోగా మొత్తం పంచాయతీ ఎన్నికలు కూడా జరిగిపోతాయన్న మాట. ఇదిలా ఉంటే స్థానిక ఎన్నికల మీద ఎవరి ఆశలు ఎలా ఉన్నాయి, అంచనాలు ఏమిటి అన్న దాని మీద చర్చ వాడిగా వేడిగా సాగుతోంది. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది కాబట్టి మొగ్గు అటు వైపే అన్నది అందరికీ తెలిసిన విషయమే. కచ్చితంగా మరో రెండున్నరేళ్ల పాటు ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి స్థానిక ప్రభుత్వం కూడా కూటమిదే అయితే మేలు అన్నది సగటు జనం భావనగా ఉంటుంది. అలా చూస్తే కూటమికి ఈ ఎన్నికల్లో పెద్దగా ఆయాసం పడాల్సింది లేదని చెప్పవచ్చు.

సర్దుబాట్లు తేలితేనే :

అయితే కూటమికి ఒక ఇబ్బంది ఉంది. అదే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి కూర్చుని సీట్లను సాఫీగా సర్దుబాటు చేసుకోవడం. అలా చేస్తేనే ఎన్నికల రంగంలో ఐక్యత కనిపిస్తుంది. ఇందులో ఏ ఒక్క పార్టీ అసంతృప్తిగా వ్యవహరించినా కూడా అది గ్రౌండ్ లెవెల్ లో తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సార్వత్రిక ఎన్నికలకూ స్థానిక ఎన్నికలకు భారీ తేడా ఉంది. వేలాదిగా అభ్యర్థులు అక్కడ ఉంటారు. అందరినీ కో ఆర్డినేట్ చేసి ముందుకు తేవడం అన్నది కష్టసాధ్యమైన విషయం. అంతే కాదు స్థానికం అంటే పక్కా లోకల్ అన్న మాట. దాంతో ఎవరి ఆశలు వారికి ఉంటాయి. ఆ మాత్రం పలుకుబడి ఉన్న వారు పార్టీ జెండా లేకపోయినా పోటీకి దిగిపోవచ్చు. అలా కాకుండా చూసుకోవాలంటే పకడ్బందీగా పొత్తులు వ్యవహారం ఉండాలని అంటున్నారు.

రెబెల్స్ బెల్స్ :

ఇక చూస్తే కచ్చితంగా రెబెల్స్ బెడద ఉంటుంది. ఒక పార్టీగా పోటీ చేసినా ఇద్దరు ముగ్గురు ఒకే సీటు ఆశించినపుడు కచ్చితంగా బరిలోకి రెబెల్ గా నిలబడతారు. అలాంటిది మూడు పార్టీలు కలసి ఒకే చోట ఒక అభ్యర్థి అంటే కనీసంగా పది మందిలో ఒకడికి చాన్స్ అన్న మాట. అలా చూసుకుంటే ఆ మిగిలిన తొమ్మిది మంది ఆశావహులు ఒక్కలా ఉంటారని చెప్పలేరు. దాంతో ఎవరో ఒకరైనా రెబెల్ గా బరిలోకి దిగితే అది కూటమి ఫలితానికే ఇబ్బందిగా మారుతుంది అని అంటున్నారు. ఇలాంటి రెబెల్స్ ని కట్టడి చేయడం కష్టతరం అవుతుంది. అది సాధ్యపడని విషయం అని కూడా అంటున్నారు. సరిగ్గా ఇక్కడే వైసీపీలో ఆశలు పెరుగుతున్నాయని అంటున్నారు.

వచ్చేదంతా లాభమే :

ఇక వైసీపీ విషయం తీసుకుంటే 2024 ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలు అయింది. ఆ తరువాత చూస్తే మొత్తం స్థానిక సంస్థలలో చాలా వరకూ కూటమి వైపు చేరిపోయాయి. అంతా అలా ఫిరాయించేశారు. దాంతో వైసీపీ వైపు చూస్తే ఎవరూ లేనట్లే అనుకోవాలి. వైసీపీ ఇపుడు తన బలాన్ని పెంచుకోవడానికి చూస్తోంది. అందులో ఒకటి వచ్చినా ప్లస్ అవుతుంది. మొత్తానికి మొత్తంగా కూటమి గెలవాలనుకున్నా వైసీపీకి బలం ఉన్న చోట పెర్ఫార్మెన్స్ చేసి కొంత అయినా ఉనికి చాటుకోవాలని చూస్తోంది. అలాగే కూటమిలో లుకలుకలు అసంతృప్తులు బాహాటం అయి రెబెల్స్ బరిలో దిగిన చోట తమకు అడ్వాంటేజ్ అవుతుందని కూడా భావిస్తోంది. ఇలా ఏపీలో స్థానిక సంస్థల పోరు ఏకపక్షం కాకుండా చూసుకోవడం వైసీపీ మొదటి విజయం అయితే ఎన్నో కొన్ని సీట్లు సాధించడం రెండో విజయం. ఇక 2024లో తమకు వచ్చిన 40 శాతం ఓటు షేర్ ని కాపాడుకుంటూనే మరింతగా పెంచుకోవడం మూడవ విజయం. ఆ విధంగా చూస్తే వైసీపీకి పోయేది ఏమీ లేదని వచ్చేదంతా లాభమే అన్న భావన ఉంది అంటున్నారు.

Tags:    

Similar News