రాజీనామాకు రెడీ అన్న మండలి చైర్మన్
దాంతో అసెంబ్లీకి ఎటూ గైర్ హాజరు అవుతున్న నేపథ్యంలో మండలిలోనే తమ వాయిస్ ని బలంగా వినిపించాలని నిర్ణయించింది.;
ఏపీ శాసనసభ కంటే శాసనమండలిలోనే రాజకీయ చర్చలు అయినా రచ్చ అయినా సాగుతోంది. దాంతో కూటమి ప్రభుత్వంలో అసెంబ్లీ కంటే మండలి పైనే అందరికీ ఆసక్తి కనిపిస్తోంది. మంత్రులు కూడా పెద్ద సంఖ్యలో మండలికి వస్తున్నారు. లడ్డూ కల్తీ వివాదం మీద జరిగిన చర్చకు ఏకంగా పది మంది మంత్రులు వచ్చారు అంటేనే మండలిలో డిబేట్ ఎంత వాడిగా వేడిగా సాగుతుంది అన్నది తెలుస్తోంది అని అంటున్నారు. ఇక చూస్తే శాసనమండలిలో వైసీపీకి బలం ఎక్కువ. దాంతో అసెంబ్లీకి ఎటూ గైర్ హాజరు అవుతున్న నేపథ్యంలో మండలిలోనే తమ వాయిస్ ని బలంగా వినిపించాలని నిర్ణయించింది.
మండలిలో హీట్ :
దీంతో ఢీ అంటే ఢీగా శాసనమండలిలో సమావేశాలు సాగుతున్నాయి. ఇక మంత్రులు కూడా కూటమి తరఫున గట్టిగానే స్పందిస్తున్నారు. అలాగే విపక్షంలో ఉన్న ఏకైన పార్టీ వైసీపీ అయితే కూటమిని ఇక్కడే బాగా ఇరుకున పెట్టగలమని భావిస్తోంది. దాంతో ప్రతీ రోజూ వాయిదా తీర్మానాలను వివిధ అంశాల మీద ఇస్తోంది. అలా వాటిలో చర్చకు వచ్చిన వాటి మీద అటూ ఇటూ డైలాగ్ వార్ సాగుతోంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైసీపీ సభ్యులు యత్నిస్తూంటే ప్రభుత్వం వైసీపీని మండలిలో ఆధిపత్యం ఉన్నా కూడా వీలైనంత మేరకు తగ్గించాలనే చూస్తోంది. దాంతో రాజకీయంగా కూడా మండలి సమావేశాలు హీటెక్కిస్తున్నాయి అని అంటున్నారు
చైర్మన్ సీటు :
ఇదిలా ఉంటే మండలి చైర్మన్ గా కొయ్యే మోషెన్ రాజు వ్యవహరిస్తున్నారు. ఆయన వైసీపీ నుంచి గవర్నర్ కోటా కింద నామినేట్ అయిన వారు. అయితే సభకు నడిపించే సర్వాధికారం చైర్మన్ కి ఉంటుంది. ప్రభుత్వం మండలిలో సంఖ్యాబలంగా చూస్తే తక్కువగా ఉంది. అదే సమయంలో విపక్షం బలంగా ఉంది. దీంతో అందరి చూపూ చైర్మన్ సీటు మీదనే ఉంది. చైర్మన్ అయితే ప్రభుత్వం వైపు నుంచి విపక్షం వైపు నుంచి కూడా వచ్చే ఒత్తిళ్ళు తట్టుకుంటూ సభను నడిపిస్తున్నారు. కొన్ని సార్లు ఆయన సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య వాయిదాను వేయాల్సి వస్తోంది.
రాజీనామా చేస్తారా :
ఇదిలా ఉంటే గురువారం మండలిలో చోటు చేసుకున్న సంఘటనకు దానికి ముందు బుధవారం చైర్మన్ మతం గురించి కూటమి మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యల పట్ల మోషెన్ రాజు అయితే మనస్థాపానికి గురి అయ్యారు అని అంటున్నారు. తాను ఫలానా మతం అని ఎలా అంటారని ఆయన ఆగ్రహించారు. తాను హిందువునే అని కూడా చెప్పారు. దీని మీద బుధవారం హీటెడ్ డిస్కషన్ సాగింది. దానిని కొనసాగించే విధంగా గురువారం
మండలిలో వేడి కనిపించింది. దాంతో మండలి చైర్మన్ తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ నుంచి గట్టిగా వినిపించింది. దీనికి బదులిచ్చిన మండలి చైర్మన్ శాసన మండలి అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధం అని ప్రకటించారు .
ఆ ఆలోచన ఉందా :
అయితే మండలిలో అంతా కలసి ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని ఆయన కోరారు. మండలిలో సంఖ్యాబలం చూస్తే వైసీపీకే ఉంది కాబట్టి ఆ తీర్మానం ఎటూ వచ్చేది ఉండదని అంటున్నారు. అయితే చైర్మన్ నోటి వెంట రాజీనామా ప్రస్తావన రావడం అంటే ఆయన ఆవేదంతో ఈ మాట అన్నారా నిజంగా ఆయన మనసులో ఆ ఆలోచన ఉందా అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా అధికార విపక్షాలు రెండూ ఢీ కొడుతున్న వేళ సభను నడిపించడం చైర్మన్ సీటులో ఉన్న వారికి కష్టమే అంటున్నారు. సాధారణంగా ఇలాంటి ఒత్తిళ్ళు ఇబ్బందులు అసెంబ్లీలో ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఏపీ అసెంబ్లీ అంతా ఏకపక్షంగా సాగుతోంది. అందుకు భిన్నమైన పరిస్థితి మండలి లో కనిపిస్తోంది అని అంటున్నారు.