2030 నాటికి చందమామపై అణు విద్యుత్ ప్లాంట్..! పనులు ప్రారంభమయ్యాయా..?

చంద్రుడిపై మానవ నివాసాలు ఏర్పడే సమయం దగ్గర పడుతున్న వేళ, నిరంతర విద్యుత్ సరఫరా కీలక సవాలుగా మారింది.;

Update: 2025-08-14 11:30 GMT

చంద్రుడిపై మానవ నివాసాలు ఏర్పడే సమయం దగ్గర పడుతున్న వేళ, నిరంతర విద్యుత్ సరఫరా కీలక సవాలుగా మారింది. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో ఐదేళ్లలో చంద్రుడిపై అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. సౌర విద్యుత్ ద్వారా నిరంతర అవసరాలను తీర్చడం చంద్రునిపై సాధ్యం కాదు. కారణం – అక్కడ 14 రోజులు సూర్యకాంతి ఉన్నా, తరువాతి 14 రోజులు చీకటిలోనే గడవాల్సి వస్తుంది. ఈ దీర్ఘ చీకటి రోజుల్లో విద్యుత్ అవసరాలను భర్తీ చేయగల ఏకైక ప్రత్యామ్నాయం అణు విద్యుత్ మాత్రమే. అందుకే నాసా, కేంద్రక విచ్ఛిత్తి (Nuclear Fission) సూత్రంతో పనిచేసే ప్లాంట్ ప్రణాళికను రూపొందించింది.

చైనా, రష్యా కూడా రంగంలోకి

చంద్రుడిపై మానవ మిషన్లకు ఆధారంగా ఉండే ఈ ప్రాజెక్టులో నాసాకు పోటీగా చైనా, రష్యాలు కూడా తమ సొంత అణు విద్యుత్ కేంద్రాలను వచ్చే దశాబ్దంలో నిర్మించాలన్న లక్ష్యాన్ని ప్రకటించాయి. నాసా తొలుత 100 కిలోవాట్ల సామర్థ్యంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. భూమిపై ఈ స్థాయి విద్యుత్‌తో సుమారు 80 ఇళ్ల అవసరాలు తీరుతాయి. తర్వాత దశలవారీగా సామర్థ్యాన్ని పెంచే యోచన ఉంది.

సాంకేతిక సవాళ్లు

*ప్లాంట్ పరికరాలన్నీ రాకెట్లలో మోయగలంత తేలికగా ఉండాలి.

*భారీ బరువులు మోయగల అంతరిక్ష నౌకలను డిజైన్ చేసి, సురక్షితంగా ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది.

*చంద్రుడిపై శ్రామికులు లేనందున, వ్యోమగాములే ఇంజినీర్లుగా మారి ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలి.

*అధిక వేడిని తగ్గించేందుకు ప్రత్యేక కూలింగ్ సిస్టమ్ అవసరం, అది భూమి నుంచే నియంత్రించాలి.

*రేడియోధార్మిక వ్యర్థాల నిర్వహణ, ఆకస్మిక రిపేర్లు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

విజయం సాధిస్తే..

ఈ అణు విద్యుత్ ప్లాంట్ విజయవంతమైతే, చంద్రుడిపై మానవ నివాసాలు నిరంతర విద్యుత్‌తో హాయిగా కొనసాగవచ్చు. వ్యయప్రయాసలతో కూడిన ఈ ప్రాజెక్ట్ అంతరిక్ష పరిశోధనలో కొత్త మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

Tags:    

Similar News