'లలిత్ మోదీ'కి ఆ దేశ పౌరసత్వం.. ఇక అక్కడే సెటిల్.. దానికి ప్రత్యేకత ఏంటంటే?

ఈ ఘటన ప్రపంచ వ్యాపార వర్గాలు, రాజకీయ వర్గాలు వనువాటు ప్రత్యేకతలపై దృష్టి సారించేలా చేసింది.;

Update: 2025-03-08 16:30 GMT
లలిత్ మోదీకి ఆ దేశ పౌరసత్వం.. ఇక అక్కడే సెటిల్.. దానికి ప్రత్యేకత ఏంటంటే?

సముద్రపు ఒడిదుడుకుల మధ్య సుమారు 80 ద్వీపాల సమూహంగా ఉన్న పసిఫిక్ సముద్రంలోని వనువాటు దేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి ముఖ్యమైన కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఈ దేశ పౌరసత్వాన్ని స్వీకరించడం. ఈ ఘటన ప్రపంచ వ్యాపార వర్గాలు, రాజకీయ వర్గాలు వనువాటు ప్రత్యేకతలపై దృష్టి సారించేలా చేసింది.

- వనువాటు పౌరసత్వ ప్రత్యేకతలు

వనువాటు ప్రభుత్వం సంపన్న వ్యాపారవేత్తలకు గోల్డెన్ పాస్‌పోర్ట్ పథకం కింద పౌరసత్వాన్ని అందిస్తోంది. ఈ పథకం కింద భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టినవారికి పౌరసత్వం లభిస్తోంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను లేనందున ప్రపంచ వ్యాపారస్తులకు ఇది ప్రధాన ఆకర్షణగా మారింది.

- లలిత్ మోదీ వెనుక ఉద్దేశం?

లలిత్ మోదీ గతంలో ఐపీఎల్ సమయంలో కోట్లాది రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. అతనిపై దర్యాప్తు కొనసాగుతుండగా లండన్‌లో భారత హై కమిషన్ కార్యాలయంలో తన పాస్‌పోర్టును అప్పగించేందుకు లలిత్ దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అప్పటికే వనువాటు పౌరసత్వం పొందడం చర్చనీయాంశంగా మారింది. దీనివల్ల అతను తన స్వదేశం నుంచి చట్టపరమైన సమస్యలను తప్పించుకోవచ్చనే ఇలా చేశాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

-వనువాటు పన్ను విధానం & వ్యాపార సౌకర్యాలు

వనువాటు పౌరసత్వం పొందడం వల్ల వ్యాపారస్తులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

*ఆదాయపన్ను లేకపోవడం

*దీర్ఘకాలిక లాభాలపై పన్ను రద్దు

*స్టాక్స్, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలకు అనుకూలమైన నిబంధనలు

*వారసత్వ పన్ను లేకపోవడం

*కార్పొరేట్ పన్ను లేకపోవడం

*అంతర్జాతీయంగా ఆదాయాన్ని పొందినా ఎలాంటి అదనపు పన్నులు లేకపోవడం

*వనువాటు త్వరితగతిన క్రిప్టోకరెన్సీ హబ్‌గా ఎదుగుతున్నది

- హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్‌లో వనువాటు ప్రథమ స్థానం

2024లో విడుదలైన హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్ లో వనువాటు ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ సూచిక జీవన ప్రమాణాలు, పర్యావరణ అనుకూలత, జీవన శైలి వంటి అంశాల ఆధారంగా దేశాలను ర్యాంక్ చేస్తుంది. వనువాటు వాతావరణ అనుకూల జీవనశైలి, తక్కువ భూకంప ప్రభావం , సరళ జీవన విధానాల వల్ల ఈ స్థాయిని సాధించగలిగింది.

వనువాటు తన ప్రత్యేకమైన పన్ను విధానం, బిజినెస్ ఫ్రెండ్లీ నిబంధనలతో ప్రపంచ వ్యాపారస్తులకు నిలయంగా మారుతోంది. లలిత్ మోదీ వంటి ప్రముఖులు ఇక్కడ పౌరసత్వాన్ని పొందడం దీని ప్రాముఖ్యతను మరింత పెంచుతోంది. గ్లోబల్ వ్యాపారాలు, క్రిప్టో ట్రేడర్లు, పెట్టుబడిదారులందరికీ ఇది ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారింది. అందుకే అందరూ అక్కడికి క్యూ కడుతున్నారు.

Tags:    

Similar News