రాహుల్ మాట నిలబెట్టుకోవాలి.. సుప్రీం తీర్పుపై కేటీఆర్ రియాక్షన్
రాహుల్ గాంధీకి నిజాయితీ ఉంటే తాను చెప్పిన నీతులకు కట్టుబడి ఉండాలని సవాల్ విసిరారు. చట్ట విరుద్ధంగా 10 మంది పార్టీ మారారని చెప్పేందుకు దర్యాప్తు అవసరం లేదన్నారు.;
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలలు లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని ఆయన అభివర్ణించారు. ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలలు లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం నిర్ణయాన్ని తమ పార్టీ స్వాగతిస్తున్నట్లు చెప్పిన కేటీఆర్.. రాష్ట్రంలో పది నియోజకవర్గాల్లో మరో మూడు నెలల్లో ఉప ఎన్నికలు వస్తున్నాయని సిద్ధంగా ఉండాలని కేడర్ కు పిలుపునిచ్చారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం తీర్పు పట్ల బీఆర్ఎస్ పార్టీ ఖుషీగా ఉంది. తమ పోరాటం ఫలించిందని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలని భావిస్తున్న బీఆర్ఎస్.. అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా ప్రయత్నాలు వేగవంతం చేసింది. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పిన బీఆర్ఎస్ నేత కేటీఆర్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల్లో చెప్పిన మాటపై నిలబడాలని సవాల్ విసిరారు. గత ఎన్నికల సందర్భంగా పాంచ్ న్యాయం పేరుతో పార్టీ మారితే ఆటోమేటిక్ గా అనర్హత వర్తించాలని రాహుల్ గాంధీ చెప్పిన మాటలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రాహుల్ గాంధీకి నిజాయితీ ఉంటే తాను చెప్పిన నీతులకు కట్టుబడి ఉండాలని సవాల్ విసిరారు. చట్ట విరుద్ధంగా 10 మంది పార్టీ మారారని చెప్పేందుకు దర్యాప్తు అవసరం లేదన్నారు. పది నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రానున్నాయని, బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేల అనర్హతపై తీర్పునిచ్చిన సుప్రీం సీజేఐకి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కాగా, సుప్రీం తీర్పు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంది. ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన దానం నాగేందర్ ను ఏకంగా సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టింది.
సుప్రీం తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతోందని అంటున్నారు. అయితే స్పీకర్ కు గడువు విధించడం, మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో స్పీకర్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. సుప్రీం తీర్పు అమలుకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాల్సిందిగా ఆయన న్యాయ నిపుణులను సంప్రదించినట్లు చెబుతున్నారు.