కేటీఆర్ ఆరోపణలపై ఐసీఐసీఐ బ్యాంక్ కౌంటర్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల అటవీ భూమి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.;
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల అటవీ భూమి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ భూమిని తనఖా పెట్టి ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ. 10,000 కోట్ల రుణం పొందిందని ఆయన ఆరోపించారు. ఇది ఒక పెద్ద కుంభకోణమని అనుమానం వ్యక్తం చేస్తూ, ఈ విషయంపై విచారణ జరపాలని కోరుతూ ఆర్బీఐ గవర్నర్‌కు లేఖ కూడా రాశారు.
అయితే, కేటీఆర్ చేసిన ఈ ఆరోపణలను ఐసీఐసీఐ బ్యాంక్ వెంటనే ఖండించింది. తాము తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ)కి ఎలాంటి తనఖా రుణం ఇవ్వలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, బాండ్ల జారీకి సంబంధించి టీఎస్‌ఐఐసీ ఎలాంటి భూమిని తమ వద్ద తనఖా పెట్టలేదని కూడా తేల్చి చెప్పింది.
ఈ వ్యవహారంలో తమ పాత్ర కేవలం బాండ్ల జారీ ద్వారా వచ్చిన డబ్బు , వడ్డీ చెల్లింపుల కోసం టీఎస్‌ఐఐసీకి అకౌంట్ బ్యాంకుగా వ్యవహరించడం మాత్రమేనని ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
కేటీఆర్ చేసిన ఆరోపణలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం , ఐసీఐసీఐ బ్యాంకు ప్రతిష్టను దెబ్బతీసేలా ఉండటంతో, బ్యాంక్ వెంటనే స్పందించింది. కేటీఆర్ బహిరంగంగా ఆరోపణలు చేసిన కొద్ది గంటల్లోనే ఐసీఐసీఐ బ్యాంక్ తమ స్పష్టమైన ప్రకటనతో ఆయన వాదనలను తిప్పికొట్టింది. దీంతో కేటీఆర్ మీడియా ముందు ఉంచిన సిద్ధాంతం నిలబడలేకపోయింది. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.