కిమ్ 'భారీ' షాకింగ్ నిర్ణయం... పని జరుగుతున్న ఫోటోలు వైరల్!
ప్రపంచంలోని చాలా దేశాల్లోని నేతలంతా ఒకెత్తు అయితే.. ఉత్తరకొరియా చీఫ్ కిమ్ వ్యవహారశైలి మరొకెత్తనే సంగతి తెలిసిందే.;
ప్రపంచంలోని చాలా దేశాల్లోని నేతలంతా ఒకెత్తు అయితే.. ఉత్తరకొరియా చీఫ్ కిమ్ వ్యవహారశైలి మరొకెత్తనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ దేశాన్ని తనదైన శైలిలో పాలిస్తూ.. బయట ప్రపంచంలో ఆ దేశ ప్రజలకు పెద్దగా సంబంధం లేకుండా జాగ్రత్తపడుతున్నారు. మరోపక్క శత్రు దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేసే సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంటారు.
ప్రధానంగా.. నిత్యం క్షిపణి పరీక్షలతో ప్రపంచ వ్యాప్తంగా తన శత్రు దేశాలను కవ్విస్తుంటారు కిమ్. పైగా.. ఇటీవల ఉక్రెయిన్ తో యుద్ధం వ్యవహారంలో రష్యాకు అండగా నిలిచి.. అమెరికాకు వ్యతిరేకంగా పుతిన్ తో స్నేహాన్ని మరింత పెంచుకున్నారని అంటున్నారు. ఈ సమయంలో మాస్కో సౌజన్యంతో అత్యాధునిక యుద్ధనౌకను తయారుచేసే పనిలో స్పీడ్ పెంచారు!
అవును... ఇప్పటికే నిత్యం క్షిపణి పరీక్షలతో తన శత్రు దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చెస్తున్న కిమ్.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుని, దాని అమలుకు వేగంగా ముందుకు కదులుతున్నారు. ఇందులో భాగంగా... అత్యాధునిక భారీ యుద్ధనౌకను తయారుచేసే పనిలో వేగం పెంచారు. దీనికి సంబంధించిన ఫోటోలు తాజాగా తెరపైకి వచ్చాయి.
ఈ మేరకు మాక్సర్ టెక్నాలజీస్, ప్లానెట్ ఉపగ్రహాలు తీసిన చిత్రాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయని అంటున్నారు. వీటి ప్రకారం.. ఉత్తర కొరియా నౌకాదళంలో ఉన్న యుద్ధనౌకల కంటే ఇది సుమారు రెండింతలు పెద్దదిగా ఉన్నట్లు చెబుతున్నారు. దీని పొడవు సుమారు 140 మీటర్లుగా ఉంటుందని అంచనా వేశారు.
వాస్తవానికి అమెరికాకు చేరే స్థాయి ఖండాంతర క్షిపణులను ఉత్తర కొరియా ఇప్పటికే సమకూర్చుకొందని చెబుతారు. అయితే.. ఈ తరహా ఆయుధాల తయారీకి అవసరమైన సాంకేతిక సహకారాన్ని, పరికరాలను ఎవరూ ఆ ఉ.కొరియాకు సమకూర్చకూడదని, విక్రయించకూడదని ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించింది.
అయినప్పటికీ.. ఈ స్థాయిలో భారీ నౌక నిర్మాణం చేపట్టడం ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. దీని ద్వారా కిమ్ సైనిక శక్తిని మరింత మెరుగుపడే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు. ఈ విషయంలో.. పుతిన్ తో కిమ్ కు ఉన్న మంచి సంబంధాలు అన్ని విధాలా సహకరించి ఉంటాయని భావిస్తున్నారు.