కేసీఆర్ పేరు చెప్పుకోవాలని లేదు.. కవిత సంచలన కామెంట్స్..

బీఆర్ఎస్ నాయకురాలు, జాగృతి రూపకర్త కల్వకుంట్ల కవిత రాజకీయంగా చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు.;

Update: 2025-10-15 11:19 GMT

బీఆర్ఎస్ నాయకురాలు, జాగృతి రూపకర్త కల్వకుంట్ల కవిత రాజకీయంగా చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు తర్వాత ఆమె రాజకీయ పీఠం ఒక్కసారిగా కదిలిపోయింది. పార్టీ నుంచి వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు ఇతర నాయకులను సాకుగా చూపి పార్టీ నుంచి బయటకు వచ్చారు. సొంతంగా పార్టీ పెడతానని, అప్పటి వరకు బీఆర్ఎస్ సభ్యత్వానికి, తన ఎమ్మెల్సీ పదవికి త్వజిస్తున్నట్లు ప్రకటించారు.

కవిత పొలిటికల్ కార్యాచరణ

చాలా రోజుల తర్వాత ఆమె తన కార్యచరణను ప్రకటించారు. ‘జాగృతి జనం బాట’ పేరుతో ప్రజల్లోకి వెళ్తానని ఆమె ప్రకటించారు. అయితే దీనిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుమానాలు చేశారు. కేసీఆర్ ఫొటో పెట్టుకొని జగృతి జనం బాట’ నిర్వహిస్తారా అని. తమ అనుచరులకు కూడా క్లారిటీ ఇచ్చేందుకు ఆమె బుధవారం మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీని వీడినప్పుడే తాను రాజకీయంగా కేసీఆర్ కు దూరమయ్యానని ఇప్పుడు ఆయన ఫొటో పెట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం అర్థరహితం అన్నారు. ఇది నైతికంగా కూడా కరెక్ట్ కాదని ఆమె అన్నారు.

కవిత కొత్త ప్రయత్నం..

కేవలం ఇది వ్యక్తిగత ప్రకటన కాదని, రాజకీయ పునరుజ్జీవనపు నినాదాలు అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తండ్రి పేరు మీద నిలిచిన బలమైన ఉద్యమ పునాది మీద కూతురు ఇప్పుడు స్వతంత్ర చైతన్యాన్ని నిర్మించాలనే ప్రయత్నం చేస్తోంది. కవిత రాజకీయ పయనంలో ఇది ఒక పెద్ద మలుపు అని స్పష్టంగా చెప్పవచ్చు. అదే సమయంలో ఆయన వారసత్వానికి కొత్త అర్థం ఇవ్వాలనే ప్రయత్నం చేసింది.

జాగృతి నుంచి జాగరణ కొత్త ప్రస్థానం..

కవిత తన ‘జాగృతి జనం బాట’ యాత్రను ప్రకటించినప్పుడు ఆమె ఆత్మవిశ్వాసం, తన మాటల బరువు, ఆమె ధైర్యం ఇవన్నీ ఒక కొత్త ఆరంభానికి సంకేతాలు. ‘జాగృతి’ అనే పదం మొదటిసారిగా తెలంగాణ ఉద్యమ దశలో పుట్టింది. ఆ సమయంలో అది తెలంగాణ యువత చైతన్యానికి ప్రతీకగా నిలిచింది. ఇప్పుడు అదే పదం మళ్లీ కవిత చేతిలో కొత్త అర్థాన్ని సంతరించుకోబోతోంది.

జాగృతి సమయంలో జయ శంకర్ ఫొటో..

తాను జాగృతి పెట్టిన సమయంలో జయశంకర్ గారి ఆలోచన, ఆయన చిత్రాలతోనే ప్రచారం చేశానని, ఆయనతోనే తాను ప్రేరణ పొందినట్లు చెప్పుకచ్చారు. ఇది ఒక గంభీరమైన వ్యాఖ్య. ఆమె తన సంస్థను తండ్రి పేరుతో సంబంధం లేకుండా ఉంచాలనుకోవడం ఒక స్పష్టమైన స్వతంత్రతను సూచిస్తోంది. ఇది కేసీఆర్ గౌరవాన్ని తగ్గించడం కాదు. ఆలోచనల పునరుత్థానానికి తలుపు తట్టడం.

అభిమానమే అయినా.. ఫొటోను పేరును వినియోగించను..

‘కేసీఆర్ కడుపున పుట్టడం నా అదృష్టం’, అని చెప్తూనే ఆయన పేరును ఎప్పటికీ వాడుకోనని స్పష్టంచేశారు. ఇది అనైతికం అని కూడా ఆమె అన్నారు. ఆమె తండ్రిని రాజకీయంగా అధిగమించాలనే ప్రయత్నం చేయడం లేదు. ‘తండ్రి ప్రారంభించిన ఉద్యమం మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలి. కానీ కొత్త తరహాలో అని ఆమె అభిప్రాయపడింది. అందుకే ఆమె ‘ఇద్దరి దారులు వేరు’ అన్న వాక్య చేసింది.

కవిత వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వ్యవస్థలో స్వతంత్ర మహిళా నాయకత్వానికి ఒక మైలురాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కవితను చాలా మంది కేవలం కేసీఆర్ కుమార్తెగానే చూశారు. కానీ ఇప్పుడు ఆమెనే స్వయంగా ‘నేను తండ్రి నీడ కాదు, నేనే ఒక ఆలోచన.’ అని చెప్తోంది.

మూస ధోరణిని ఛేదించేలా రాజకీయాలు..

తెలంగాణ రాష్ట్రం పుట్టిన తర్వాత ఇక్కడి రాజకీయాలు ఎక్కువగా కుటుంబ ఆధారితంగా మారిపోయాయి. కవిత ఇప్పుడు ఆ మూసను ఛేదించే ప్రయత్నంలో ఉంది. ఆమె ‘జాగృతి’ వేదికను రాజకీయంగా మార్చకపోయినా, ఆ వేదిక ద్వారా ప్రజల మనసులను గెలవాలని చూస్తోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి నేతల మధ్య పార్టీ అంతర్గత సమీకరణాలు బలంగా మారిన తరుణంలో కవిత తాను వేరే దారి తీసుకోవడం వ్యూహాత్మకమని చెప్పవచ్చు. కానీ ఇది పార్టీ వ్యతిరేకత కాదు.

‘జాగృతి జనం బాట’ యాత్ర భవిష్యత్తు తెలంగాణ రాజకీయాల్లో బలమైనదిగా నిలవచ్చు. ఇది పార్టీ నిర్మాణం కాదు.. ప్రజా ఆలోచన నిర్మాణం. ‘నాయకుడు ఎవరు అనేది కాదు, ప్రజల ఆలోచన ఏ దిశగా వెళ్తుంది అనేదే ముఖ్యం.’ అని కవిత అన్నారు.

Tags:    

Similar News