రాజకీయాల్లో ఖర్చులపై కంగనా రనౌత్ కామెంట్స్ వైరల్!

అవును... ప్రస్తుతం రాజకీయాలు సక్సెస్ ఫుల్ వ్యాపారంగా మరిపోయిందని ఒకరంటే.. యథా రాజా తథా ప్రజా అని మరొకరు అంటున్నారు.;

Update: 2025-07-12 10:30 GMT

ఒకప్పటి రాజకీయాలకు, ఇప్పటి రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని అంటారు. దానికి కారణం ఖర్చులు ఎక్కువైపోవడం అని ఒకరంటే... నేతల కోరికలు పెరిగిపోవడం మరో కారణమని చెబుతారు. ఒకప్పుడు నేతలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక సీట్లు కేటాయించేవారని ఒకరంటే... బిజినెస్ పాలిటిక్స్ లో అది సాధ్యం కాదని ఇంకొకరు అంటున్నారు! ఈ సమయంలో కొత్తగా ఎంపీ అయిన హీరోయిన్ కంగనా తన అభిప్రాయాలను పంచుకున్నారు.

అవును... ప్రస్తుతం రాజకీయాలు సక్సెస్ ఫుల్ వ్యాపారంగా మరిపోయిందని ఒకరంటే.. యథా రాజా తథా ప్రజా అని మరొకరు అంటున్నారు. ఇలా ఎవరి వెర్షన్ వారు చెబుతోన్న వేళ తన అనుభవంతో ముందుకు వచ్చారు ఎంపీ కంగనా. తాజాగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన ఆమె... రాజకీయాల్లో నిజాయితీగా పనిచేసే ఎంపీలకు జీతం సరిపోదని.. సిబ్బందికి జీతాలు ఇచ్చిన తర్వాత తమకు మిగిలేది అంతంతమాత్రమేనని తెలిపారు.

ఈ సందర్భంగా స్పందించిన కంగనా రనౌత్... స్థానిక ప్రజాప్రతినిధులు, పీఏలతో కలిసి తమ నియోజకవర్గాలకు వాహనాల్లో వెళ్లేందుకు రూ.లక్షల్లో ఖర్చవుతుందని కంగనా పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఒక్కో ప్రదేశం సుమారు 300-400 కి.మీ.ల దూరంలో ఉండటమే అందుకు కారణమని అన్నారు. అందువల్ల రాజకీయాలు ఖర్చుతో కూడుకున్నవని ఆమె అభిప్రాయపడ్డారు. స్టాఫ్ కు జీతాలివ్వగా ఎంపీకి మిగిలేది రూ.50000 నుంచి రూ.60000 మాత్రమేనని అన్నారు.

ఇదే సమయంలో.. ఎంపీలకు వచ్చే జీతం సరిపోవట్లేదని.. అందువల్ల మరో ఉద్యోగం చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే చాలామంది ఎంపీలకు వ్యాపారాలు ఉన్నాయని, మరికొందరు న్యాయవాదులుగా ఉన్నారని గుర్తుచేశారు! ఎంపీగా ఉంటే మరో ఉద్యోగం అవసరం అవుతుంది కాబట్టి ఆ పదవిని వృత్తిగా తీసుకోలేమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా... తాను రాజకీయ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నానని ఇటీవల కంగనా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... ప్రజలు తన వద్దకు పంచాయతీ స్థాయి సమస్యలను కూడా తీసుకొస్తున్నారని.. తమను సొంత డబ్బును ఉపయోగించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారని ఆమె అసహనం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ప్రధాని కావాలన్న లక్ష్యంపై స్పందిస్తూ.. తాను సమర్థురాలిని కాదని అన్నారు.

Tags:    

Similar News