ఎమ్మెల్యేలతో పవన్ భేటీ ఎపుడు ?

ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలు జనసేనకు ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం అని చెప్పాల్సి ఉంది.;

Update: 2025-07-04 04:30 GMT

ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలు జనసేనకు ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం అని చెప్పాల్సి ఉంది. అంతే కాదు ఏపీ రాజకీయ చరిత్ర పుటలలో జనసేన ఘన విజయానికి ఒక ప్రత్యేక స్థానం పేజీ కూడా కచ్చితంగా ఉంటాయి. పోటీ చేసిన 21 సీట్లలోనూ జనసేన ఘన విజయం సాధించింది. అంటే సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్న మాట. ఆ విధంగా అత్యద్భుతమైన విజయం సాధించుకున్న తరువాత ఏడాది కాలం ఇట్టే నడచిపోయింది.

జనసేన ఎమ్మెల్యేలలో పవన్ తో కలిపి ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. ఇక జనసేనలో కొందరు కీలక నేతలకు నామినేటెడ్ పదవులు కూడా లభించాయి. కూటమి పాలన ఇటీవలనే సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో అమరావతిలో భారీ బహిరంగ సభను జరుపుకుంది. ఆ సభకు పవన్ కళ్యాణ్ సైతం హాజరై ఫైర్ తో కూడిన స్పీచ్ ని ఇచ్చారు.

అంతా బాగానే ఉంది కానీ జనసేన ఎమ్మెల్యేలతో పవన్ భేటీ ఎపుడు అన్న ప్రశ్న వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇపుడు ప్రతిపక్షంలో లేరు. అధికారంలో ఉన్నారు. జనసేన కూటమిలో కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తరువాత స్థానంలో ఉన్నారు. అయితే జనసేన ఎమ్మెల్యేలు పనితీరు ఎలా ఉంది. నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి ఏమిటి జనాలకు చేరువలో ఎమ్మెల్యేలు ఉంటున్నారా తమకు ఉన్న అధికార పరిధిలో సమస్యలు పరిష్కరిస్తున్నారా ఇత్యాది వాటి మీద ఒక మధింపు చేయాలంటే సమగ్రమైన సమీక్షా సమావేశం ఆరు నెలలకో లేక ఏడాదికో ఒకసారి అయినా పవన్ నిర్వహించాలి కదా అని అంటున్నారు.

తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది అధినేతను కలిసే అవకాశం ఈ ఏడాదిలో దక్కించుకున్నారు అన్నది కూడా ఒక ప్రశ్నగా ఉంది. పవన్ ముఖ్య నాయకులతోనే భేటీ అవుతారు. వారు అందించిన సమాచారంతోనే ముందుకు సాగుతారు అని అంటున్నారు. అయితే తాను కాకుండా 20 మంది ఎమ్మెల్యేలు అంటే ఒక బిగ్ నంబర్. వారు పార్టీకి అసలైన వారధులు సారధులు. వారే పార్టీ రధానికి చక్రాలు. వారితో సమావేశాలు నిర్వహిస్తేనే కదా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుస్తుంది అని అంటున్నారు

అంతే కాదు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని పనులు ఉన్నా ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ లో అయినా లేదా టెలి కాన్ఫరెన్స్ లో అయినా కనెక్ట్ అవుతారు. తాజాగా ఆయన ఎమ్మెల్యేతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇక వారిని ఇంటింటికీ పంపిస్తున్నారు. అటు పార్టీకి ఇటు జనాలకు వారు కనెక్ట్ అయ్యేలా చూసుకుంటున్నారు.

మరి అలాంటి చొరవ జనసేనలో కూడా ఉండాలి కదా అన్న చర్చ వస్తోంది. ఏడాది కూటమి పాలనలో జనసేన కూడా ముఖ్య భాగస్వామిగా ఉంది కదా. అందువల్ల జనం వద్దకు జనసేన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి తాము ఏమి చేశామో ప్రజలకు వివరించి వారి మెప్పు పొందాల్సిన అవసరం ఉంది కదా అని అంటున్నారు. ఆ తరహా కార్యక్రమాలకు జనసేన కూడా శ్రీకారం చుట్టవచ్చు కదా అని అంటున్నారు.

వాటి కంటే ముందు జనసేన ఎమ్మెల్యేలు తమ సమస్యలు నేరుగా అధినేతకు చెప్పుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. వారికి ఆ సదవకాశాన్ని ఇవ్వాల్సి వస్తే కనుక కచ్చితంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సిందే అని అంటున్నారు. ఈ విషయంలో జనసేన అధినాయకత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. రాజకీయం అనేది నిరంతరం పరుగు పందెం లాంటిది. ఇక్కడ నో రిలాక్స్. ఏ మాత్రం ఆగినా వేరొకరు దూసుకుని పోతారు. అందువల్ల జనసేన సైతం ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News