కశ్మీర్‌లో ఉగ్ర-లింకులు.. జమ్మూ కశ్మీర్‌లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.;

Update: 2025-06-03 14:58 GMT

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా మంగళవారం ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తీసేసింది. ఇందులో ఒక పోలీసు కానిస్టేబుల్, ఒక స్కూల్ టీచర్, ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు. ఉగ్రవాదానికి ఎవరైనా మద్దతు ఇస్తే ఎంత పెద్ద పదవిలో ఉన్నా చర్యలు తప్పవని ప్రభుత్వం తీసుకున్న చర్య సూచిస్తుంది.

ఈ ముగ్గురిని జాతీయ భద్రతకు ముప్పు అనే కారణంతో ఎలాంటి విచారణ లేకుండానే ఉద్యోగాల నుంచి తీసేశారు. మన దేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2)(c) ప్రకారం ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ముగ్గురూ జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు. ఇప్పటివరకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న 75 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులను తీసేసినట్లు అధికారులు చెప్పారు.

ఉగ్రవాదులకు రహస్యంగా సహాయం చేసేవారు. ప్రభుత్వ పనుల్లో ఉంటూ వారికి సానుభూతి చూపేవారిపై ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటోందని అధికారులు వివరించారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు.. పోలీస్ కానిస్టేబుల్ మాలిక్ ఇష్ఫాక్ నసీర్, స్కూల్ టీచర్ అజాజ్ అహ్మద్, శ్రీనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే వసీం అహ్మద్ ఖాన్.

తొలగించబడిన ఈ ఉద్యోగులు ఉగ్రవాదులకు చాలా విధాలుగా సహాయం చేశారని అధికారులు చెప్పారు. కానిస్టేబుల్ మాలిక్ ఇష్ఫాక్ నసీర్ 2007లో డిపార్ట్ మెంట్లో చేరాడు. 2021లో ఆయుధాలు అక్రమంగా తరలిస్తుండగా ఇతనిపై అనుమానం వచ్చింది. ఇతని సోదరుడు ఒక ఉగ్రవాది (లష్కరే తొయిబా సంస్థకు చెందినవాడు). తను 2018లో చనిపోయాడు. మాలిక్ ఇష్ఫాక్ నసీర్ పోలీసుగా ఉంటూనే, ఉగ్రవాదులకు ఆయుధాలు, బాంబులు, డ్ర*గ్స్ దాచడానికి సేఫ్ ప్లేసులు చూపించి, పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల నాయకులకు (హ్యాండ్లర్‌లకు) ఆ వివరాలను పంపేవాడు. వాటిని తీసుకుని, జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు అందించేవాడు. తన విధులను మర్చిపోయి దేశానికి ద్రోహం చేశాడని అధికారులు అన్నారు.

2011లో ఉపాధ్యాయుడిగా చేరిన అజాజ్ అహ్మద్, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి అక్రమంగా తరలిస్తుండగా నవంబర్ 2023లో పోలీసులకు పట్టుబడ్డాడు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల నాయకుడు ఇతని ద్వారా కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు ఆయుధాలు పంపించాడని విచారణలో తేలింది. చాలా సంవత్సరాలుగా ఇతను ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నాడని పోలీసులు చెప్పారు.

చివరగా శ్రీనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 2007 నుండి పనిచేస్తున్న వసీం అహ్మద్ ఖాన్, 2018 జూన్‌లో ఒక జర్నలిస్ట్ , అతని భద్రతా సిబ్బంది హత్యకు సంబంధించిన ఉగ్రవాద కుట్రలో భాగమని ఆరోపణలు ఉన్నాయి. ఇతను ఉగ్రవాదులకు సహాయం చేసి, హత్య తర్వాత వారికి తప్పించుకోవడానికి సహాయం చేశాడని అధికారులు తెలిపారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా 2020లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు 75 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులను ఇలాగే తొలగించారు.

Tags:    

Similar News