బెల్ మాత్రమే మిగిలిన సైకిల్... జగన్ ర్యాగింగ్ పీక్స్!

అవును... తాజాగా రాజానగరంలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-07 10:36 GMT

సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరిలోని రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ జంక్షన్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా... "రాజానగరం సిద్ధమా..?" అంటూ మొదలుపెట్టిన జగన్ చంద్రబాబుపై సెటైర్ల వర్షం కురిపించారు.

అవును... తాజాగా రాజానగరంలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... 2014 - 19 కూటమి పాలనకు, 2019 - 24 మీ బిడ్డ పాలనకూ తేడా గమనించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎన్నికల వేళ ఆన్ గోయింగ్ సంక్షేమ పథకాలను చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో కలిసి ఆపేస్తున్నారని జగన్ ఫైర్ అయ్యారు. జూన్ 4 తర్వాత వారం రోజుల్లో అవన్నీ తిరిగి పూర్తి చేస్తామని మాట ఇచ్చారు!

ఈ సందర్భంగా... మాములుగా ఒక ప్రభుత్వం 60 నెలల పాటు పని చేస్తుందని.. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేస్తారరని.. అలాంటి ప్రభుత్వాన్ని దెబ్బ తీయడం కోసం, ఇబ్బందులు పెట్టడం కోసం చంద్రబాబు.. ఢిల్లీ పెద్దలతో కలిసి ఎలాంటి కుట్రలు చేస్తున్నారో అంతా గమనించాలని ఏపీ ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కోరారు. మేనిఫెస్టోలో చెప్పినవి 99 శాతం హామీలు అమలు చేసిన ప్రభుత్వం ఇదని తెలిపారు.

ఈ సందర్భంగా... "తుప్పుపట్టిన సైకిల్" అంటూ జగన్ ఓ చిన్న కథ చెప్పారు. ప్రస్తుతం ఈ కథ నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ కథ ద్వారా చంద్రబాబుపై సెటైర్లు పేల్చారు. తుప్పు పట్టిన సైకిల్ లో ఇక మిగిలింది కేవలం బెల్ మాత్రమేనని.. అబద్ధాల మేనిఫెస్టో అనే ఆ బెల్ ని చంద్రబాబు మోగిస్తున్నారని, ఈ సందర్భంగా ఆ మాయలో పడొద్దని ప్రజలకు జగన్ సూచించారు.

Read more!

ఇందులో భాగంగా... "ఎన్నికల ముందు రకరకాల వాగ్దానాలు ఇచ్చాడు.. అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చలేదు.. ప్రతీకారంగానే 2019లో రైతన్నలు, ఆడపడుచులు, అన్ని సామాజిక వర్గాలు, పల్లె పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్‌ ను ఏ ముక్కకు ఆ ముక్క విరిసి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్‌ ను రిపేర్ చేయించేందుకు చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు" అని మొదలుపెట్టిన జగన్... అనంతరం మిగిలింది బెల్ ఒక్కటే అంటూ కామెంట్ చేశారు.

ఈ సందర్భంగా... "ఆ సైకిల్ రిపేర్‌ కోసం ఎర్రచొక్కాల దగ్గరకు వెళ్తే.. ఫలితం రాలేదు. ఆ తర్వాత దత్త పుత్రుడ్ని పిలుచుకున్నారు. తుప్పు పట్టింది.. నేను క్యారేజ్ మీద మాత్రమే ఎక్కుతాను, టీ గ్లాస్‌ పట్టుకుని తాగుతాను అని ఆ దత్తపుత్రుడు అన్నాడు. ఆ తర్వాత బాబు తన వదినమ్మను ఢిల్లీ పంపించారు. ఆమె ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి సైకిల్‌ రిపేర్‌ కోసం మెకానిక్‌ లను పిలిపించుకున్నారు" అని ఎద్దేవా చేశారు.

ఇక... "తీరా వాళ్లొచ్చి.. తుప్పు పట్టిన ఆ సైకిల్‌ ను చూశారు. ఆ సైకిల్‌ కు సీటు లేదు.. చక్రాలూ లేవు.. పెడల్‌ లేదు.. ట్యూబ్‌ లు ల్లేవ్‌.. మధ్యలో ఫ్రేమ్‌ కూడా లేదు. మరి ఇంతలా తుప్పు పడితే ఎలా బాగు చేస్తామయ్యా అని వాళ్లు అడిగారు. దీంతో... పిచ్చి చూపులు చూసి బెల్‌ కొట్టడం మొదలుపెట్టాడు చంద్రబాబు. ఆ బెల్‌ పేరే అబద్ధాల మేనిఫెస్టో" అంటూ జగన్ వివరించారు. ప్రస్తుతం ఈ సెటైర్లకు సంబందించిన వీడియో వైరల్ అవుతుంది!

4
Tags:    

Similar News