బాబు, పవన్ పేరు చెబితే గుర్తుకొచ్చేవి ఇవే: సీఎం జగన్!
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.;
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ‘వైఎస్సార్ చేయూత’ నాలుగో విడత నిధుల విడుదల సందర్భంగా అనకాపల్లి జిల్లా పిసినికాడలో జగన్ పర్యటించారు. అక్కడ బటన్ నొక్కి చేయూత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచనలే గుర్తొస్తాయని ధ్వజమెత్తారు. అలాగే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుందన్నారు. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడని మండిపడ్డారు. కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడంటూ మరోసారి జగన్... పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు.
పవన్, చంద్రబాబు ఇద్దరూ కలిసి 2014లో వాగ్ధానాలు ఇచ్చి మోసం చేశారని జగన్ గుర్తు చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తామంటూ దగా చేశారని దుయ్యబట్టారు. 2014లో ఇచ్చిన ఒక్క వాగ్ధానం అయినా చంద్రబాబు అమలు చేశాడా? అని నిలదీశారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు.
పండంటి బిడ్డ పథకం పేరుతోనూ చంద్రబాబు మోసం చేశారని జగన్ ఆరోపించారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ ను నడిపించిన ప్రభుత్వం చంద్రబాబుదని తూర్పూరబట్టారు. ఆయనను నమ్మడం అంటే కాటేసే పామును నమ్మడమేనని ఎద్దేవా చేశారు. వీరిని నమ్మడం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చకోవడమేనన్నారు.
చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదని జగన్ తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారని మండిపడ్డారు. బీసీలకు చంద్రబాబు చేసింది సున్నా అని తెలిపారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు మరిన్ని అబద్ధాలు చెబుతారని ప్రజలను హెచ్చరించారు. కేజీ బంగారం, ప్రతీ ఇంటికీ బెంజ్ కారు ఇస్తామంటారన్నారు. చంద్రబాబు, దత్త పుత్రుడు కలిసి మేనిఫెస్టో పేరుతో మోసం చేస్తారన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెబుతారని జగన్ నిప్పులు చెరిగారు.
మహిళా దినోత్సవం ముందు రోజు అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉందని జగన్ వెల్లడించారు. 58 నెలల పరిపాలనలో అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందుడుగు వేశామన్నారు. అక్కచెల్లెమ్మల సాధికారితకు దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా చేయూత అందించామన్నారు. వైఎస్సార్ చేయూత కార్యక్రమంతో ప్రతీ మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరిందని తెలిపారు.
గత టీడీపీ ప్రభుత్వం అక్క చెల్లెమ్మల కోసం ఏరోజు ఆలోచించలేదని జగన్ తెలిపారు. అక్క చెల్లెమ్మలకు చేయూతనిచ్చి చేయి పట్టుకుని నడపిస్తున్నామన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ఆర్థిక సాయం అందించామన్నారు. 1,68,018 మంది అక్క చెల్లెమ్మలు కిరాణా దుకాణాలు నడుపుతున్నారని చెప్పారు. 3,80,466 మంది అక్కచెల్లెమ్మలు ఆవులు, గేదెలు కొన్నారన్నారు. 1,34,514 మంది గొర్రెలు, మేకలు పెంపకం చేస్తున్నారని చెప్పారు. వైఎస్సార్ చేయూత కింద ఇప్పుడు 26,98,931 మందికి రూ.5,060 కోట్లు జమ చేస్తున్నాం అని సీఎం పేర్కొన్నారు.
కాగా ఇటీవల టీడీపీ, జనసేన నిర్వహించిన తాడేపల్లిగూడెం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘జగన్ నువ్వు నా నాలుగో పెళ్లానివి రా’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి పవన్ పెళ్లిళ్లపై సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.