పవన్ నినాదం...ఎర్రన్నలకు మంటెక్కిస్తోందా ?

ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ తన రాజకీయం గురించి జనాలకు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. ఆయన 2014 నుంచి రాజకీయాల్లో ఉన్నారు.;

Update: 2026-01-11 22:30 GMT

ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ తన రాజకీయం గురించి జనాలకు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. ఆయన 2014 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మొదట బీజేపీ టీడీపీకి మద్దతు ఇచ్చారు. 2019 నాటికి వామపక్షాలు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. 2020కి వచ్చేసరికి బీజేపీతో పొత్తు పునరుద్ధరించుకున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీతో కలసి పోటీ చేశారు. ఇక పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉండగా సనాతన వాదాన్ని తెర మీదకు తెచ్చారు. దానిని ఒక నినాదంగా ఆయన తరచూ చెబుతూ వస్తున్నారు. దీని మీద సనాతన వాదులు ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా తీసుకుంటున్నారో తెలియదు కానీ వామపక్షాలకు అయితే మంటగా ఉందని అంటున్నారు. వారి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అని అంటున్నారు.

అదంతా రాజకీయ వ్యూహం :

పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం ప్రకారమే సనాతన వాదాన్ని ఎంచుకున్నారు అని సీపీఐ సీనియర్ నాయకుడు కె నారాయణ అంటున్నారు. ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మెప్పు కోసమే పవన్ ఈ విధంగా మాట్లాడుతున్నారు అని ఆయన విమర్శించారు. నిజానికి వ్యక్తిగతంగా పవన్ కి సనాతన ధర్మం గురించి నమ్మకం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యక్తిగతంగా ఆచరించడం లేదని కూడా నారాయణ చెప్పడం విశేషం.

నైతిక అర్హత లేదంటూ :

పవన్ వ్యక్తిగత జీవితంలో చూస్తే ఆయన సనాతన ధర్మానికి వ్యతిరేకంగానే వ్యవహరించారు అని నారాయణ ఎత్తి పొడుస్తున్నారు. సనాతన ధర్మలో విడాకులు అన్నదే లేదని మరి దానికి పవన్ ఏమి చెబుతారు అని ప్రశ్నించారు. కాషాయ పెద్దల మెప్పు కోసమే పవన్ తన వేషాన్ని భాషను మార్చుకున్నారని నారాయణ సెటైర్లు వేశారు. అయినా సనాతన ధర్మం గురించి చెప్పే నైతిక అర్హత ఆయనకు లేదని కూడా నారాయణ విమర్శించడం విశేషం.

కమ్యూనిస్టు భావజాలమంటూ :

ఇక పవన్ తనది కమ్యూనిస్టుల భావజాలం అని తరచూ చెప్పేవారు అని నారాయణ గుర్తు చేశారు. ఇక తనతో చాలా సార్లు సమావేశమైనపుడు కూడా ఆయన కమ్యూనిస్టు రాజకీయాల గురించే ఎక్కువగా చర్చించేవారు అని ఆయన చెప్పడం గమనార్హం. అంతే కాకుండా వామపక్షాలతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన వారుగా పవన్ ఉన్నారని చెప్పారు. అయితే రాజకీయాల్లో అవకాశవాదంతో పవన్ తన సిద్ధాంతాలను మార్చుకుంటూ వెళ్ళారని ఆయన మండిపడ్డారు. పవన్ ఒకపుడు అభ్యుదయ వాదాన్ని వినిపించి ఇపుడు సనాతన వాదాన్ని వినిపిస్తున్నారని నారాయణ ఫైర్ అయ్యారు. ఇకనైనా పవన్ తన వైఖరి మార్చుకోవాలని లేకపోతే ప్రగతిశీల భావజాలం ఉన్న్ వారు ఆయనకు తగిన గుణపాఠం చెబుతారు అని నారాయణ హెచ్చరించడం విశేషం.

సిద్ధాంత విరోధం :

పవన్ కాంగ్రెస్ కో లేక టీడీపీకి మద్దతు పలికినా వామపక్షాలకు పెద్దగా అభ్యంతరం లేకపోయేది కానీ ఆయన పోయి పోయి కమలం పార్టీకి దన్నుగా నిలబడడం మీదనే వారు మండిపోతున్నారు అని అంటున్నారు. మొదటి నుంచి వామపక్షాలకు కాషాయం పార్టీకి మధ్య చూస్తే సిద్ధాంతాల మధ్య తీవ్రమైన అంతరం ఉందని చరిత్ర చెబుతున్న విషయం. ఇక పవన్ పొత్తులతో ఆగకుండా బీజేపీ నేతలు కూడా ఎన్నడూ పెద్దగా మాట్లాడని విధంగా సనాతన వాదాన్ని జనంలోకి ప్రచారం చేయడం మీద కూడా కామ్రేడ్స్ ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. పవన్ ది రాజకీయ అవకాశవాదం అని ఇపుడు విమర్శిస్తున్న కామ్రేడ్స్ రేపటి రోజున ఆయన మళ్లీ తన వైపు చేరితే ఈ మాట అనగలరా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా పవన్ మీద నారాయణ విమర్శలు అయితే కొంత చర్చనీయాంశంగానే ఉన్నాయి.

Tags:    

Similar News