ట్రంప్ కొత్త ఆయుధం.. సెక్ష‌న్ 301.. భార‌త్ పైనా కొర‌డా!

త‌న‌కు అడ్డే లేద‌న్న‌ట్లు.. ప్ర‌పంచ దేశాల‌పై ఇష్టారాజ్యంగా ఆయ‌న విధించిన టారిఫ్ లు చెల్ల‌వంటూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖాత‌రు చేయ‌కుండా వెళ్తున్నారు.;

Update: 2026-03-12 10:30 GMT

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తెంప‌రిత‌నానికి అంతు లేకుండా పోతోంది. త‌న‌కు అడ్డే లేద‌న్న‌ట్లు.. ప్ర‌పంచ దేశాల‌పై ఇష్టారాజ్యంగా ఆయ‌న విధించిన టారిఫ్ లు చెల్ల‌వంటూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖాత‌రు చేయ‌కుండా వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో కొత్త చ‌ట్టాన్ని ఉప‌యోగించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టివ‌ర‌కు 25 శాతం, 50 శాతం టారిఫ్ లు అంటూ రంకెలేసిన ట్రంప్... ఇప్పుడు సెక్ష‌న్ 301 అంటూ క‌ల‌వ‌రింత మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. గ‌మ‌నార్హం ఏమంటే.. ఈ జాబితాలో భార‌త్ కూడా ఉండ‌డం. దీంతో టారిఫ్ ల‌పై ట్రంప్ పంతం నెగ్గేలా క‌నిపిస్తోంది.

ఆ 16 దేశాల జాబితాలో...

సెక్ష‌న్ 301 ప్ర‌కారం భార‌త్ స‌హా 16 వాణిజ్య భాగ‌స్వామ్య దేశాల‌పై టారిఫ్ లు విధించేందుకు సిద్ధ‌ప‌డుతున్నారు. ఈ మేర‌కు ఆయ‌న ద‌ర్యాప్తు కార్యాచ‌ర‌ణ రంగం సిద్ధం చేస్తున్నారు. 1974 నాటి వాణిజ్య చ‌ట్టంలోని సెక్ష‌న్ 301తో క‌త్తులు నూరుతున్నారు. ఈ జాబితాలో భార‌త్, చైనా, యూరోపియ‌న్ యూనియ‌న్, సింగ‌పూర్, స్విట్జ‌ర్లాండ్, నార్వే, ఇండోనేసియా, మ‌లేసియా, కాంబోడియా, థాయ్ లాండ్, ద‌క్షిణ కొరియా, వియ‌త్నాం, తైవాన్, బంగ్లాదేశ్, మెక్సికో, జ‌పాన్ ఉండ‌గా.. ట్రంప్ ఇటీవ‌లి కాలంలో తీవ్రంగా విమ‌ర్శించిన‌ కెన‌డా లేక‌పోవ‌డం విశేషం.

మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ 301...

అమెరికా అధ్య‌క్షుడి చేతిలోని శ‌క్తిమంత‌మైన ఆయుధం సెక్ష‌న్ 301. ఇత‌ర దేశాల వాణిజ్య విధానాల‌ను స‌వాల్ చేసేందుకు దీనిద్వారా వీలుంటుంది. వాణిజ్య భాగ‌స్వాముల విధానాలను స‌మీక్షించే అధికారం ద‌క్కుతుంది. అమెరికా వ్యాపారాలు, ప్ర‌యోజ‌నాల‌కు న‌ష్టం క‌లిగిస్తున్నాయా? అనేది ప‌రిశీల‌న చేస్తారు. ద‌ర్యాప్తు మొద‌ల‌య్యాక‌.. అన్యాయ‌మైన వాణిజ్య విధానాల‌పై సాక్ష్యాల‌ను సేక‌రిస్తారు. ఇందులో త‌మ‌కు వ్య‌తిరేకం అని తేలితే.. సెక్ష‌న్ 301 కింద చ‌ర్య‌లు తీసుకునే అధికారం ఉంటుంది. అనంత‌రం ఆయా దేశాల‌పై భారీగా సుంకాలు-ప్ర‌తీకార సుంకాలు విధించేందుకు అధికారం ద‌క్కుతుంది.

చైనాతో భార‌త్ స‌మానమా?

చైనా అంటే అమెరికాకు ప్ర‌త్య‌ర్థి. కానీ, భార‌త్ మాత్రం అగ్ర‌రాజ్యంతో స‌త్సంబంధాలే కొన‌సాగిస్తోంది. ట్రంప్ కూడా ఇదే మాట అంటున్నారు. కానీ, ఇప్పుడు సెక్ష‌న్ 301 కింద చైనా స‌ర‌స‌న భార‌త్ ను చేర్చారు. దీనికి కార‌ణం.. భార‌త్ లోని కొన్ని మార్కెట్ల తీరు అమెరికాకు న‌ష్టం క‌లిగిస్తున్న‌ద‌నే అభిప్రాయ‌మే. కొన్ని ఉత్ప‌త్తుల‌పై భార‌త్ అమ‌లు చేస్తున్న అధిక సుంకాలతో పాటు డేటా స్టోరేజీ,టెక్నాల‌జీ నిబంధ‌న‌లపై అమెరికా ఆగ్ర‌హం ఉంది. ఇరు దేశాల వాణిజ్య చ‌ర్చ‌లూ వీటి చుట్టూనే తిరుగుతున్నాయి. సెక్ష‌న్ 301 నేప‌థ్యంలో భార‌త్ పై త‌క్ష‌ణ చ‌ర్య‌లు ఉంటాయా? అన్న‌ది చెప్ప‌లేం కానీ.. ఉండ‌క‌పోవ‌డం అనేది మాత్రం గ్యారెంటీ ఇవ్వ‌లేం.

Tags:    

Similar News