నల్లమల సాగర్ -.ఏపీ స్ట్రాంగ్ పాయింట్స్ ఇవే
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల విషయంలో వివాదాలు రేగుతున్న సంగతి తెలిసిందే. రెండు జీవ నదులు తెలంగాణా మీదుగా ఏపీ వైపు వచ్చి సముద్రంలో కలుస్తాయి.;
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల విషయంలో వివాదాలు రేగుతున్న సంగతి తెలిసిందే. రెండు జీవ నదులు తెలంగాణా మీదుగా ఏపీ వైపు వచ్చి సముద్రంలో కలుస్తాయి. క్రిష్ణా నది గోదావరి నది ఈ రెండూ కూడా తెలుగు నేలను సస్యశ్యామలం చేస్తాయి. ఈ రెండు నదుల మీదనే రెండు రాష్ట్రాల ఆర్ధిక భవిష్యత్తుతో పాటు ఇతర రంగాల ప్రగతి కూడా ఆధారపడి ఉంది. ఈ నేపధ్యంలో పోలవరం-బనకచర్ల/నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు పై రెండు రాష్ట్రాల మధ్య న్యాయపరమైన పోరాటం కూడా సాగుతోంది. ఈ నేపధ్యంలో ఏపీ తనదైన వాదన కోసం బలమైన పాయింట్స్ ని సిద్ధంగా చేసుకుంది. ఈ కేసు తాజా వాయిదా సుప్రీంకోర్టులో సోమవారం రానుంది.
వేస్ట్ గా పోతున్నాయి :
గోదావరి నది ఎగువ రాష్ట్రాల నుంచి పారుతూ ఆఖరుగా ఏపీలోకి ప్రవేశిస్తుంది. ఇక ఏపీలో పెద్ద ఎత్తున నీరు సాగరంలో కలుస్తోంది. మరి అలా ఎంతో వృధాగా పోతున్న గోదావరి నదీ జలాలను ఏపీ వాడుకుంటే తప్పేంటి అన్నదే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న బలమైన వాదన అంటున్నారు. ఇక చూస్తే గోదావరి నీళ్ళు ఏకంగా మూడు వేలకు పైగా టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి. అందులో కేవలం 200 టీఎంసీల నీటిని వాడుకుని ఏపీ తన ప్రగతికి ప్రాజెక్టులుగా మలచుకుంటే తప్పేమిటి అన్నది ఏపీ చేస్తున్న వాదనగా ఉంది.
ఇది న్యాయమే :
ఇక చూస్తే కనుక గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ ప్రకారం చూసినా మిగిలిన నీటిని వినియోగించే హక్కు చివరి రాష్ట్రంగా ఏపీకి ఉందన్న విషయాన్ని నీటి రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. ఈ ట్రిబ్యునల్ గోదావరి నది నీటి వనరుల భాగస్వామ్యం వినియోగానికి సంబంధించి నదీ తీర రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక ఒడిశా మధ్య చాలా కాలంగా ఉన్న వివాదాలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం 1969లో స్థాపించిన ఒక క్వాసీ-జ్యుడీషియల్ సంస్థగా ఉంది. ఇక ఈ ట్రిబ్యునల్ 1979లో తన తుది తీర్పును జారీ చేసింది, ఇది ఈ రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులకు సంబంధించిన అన్ని రకాలైన మార్గదర్శకాలను నిర్దేశించింది. గోదావరి బేసిన్ లో ఆంధ్రప్రదేశ్ దిగువ ప్రవాహ రాష్ట్రం కావడంతో ఇతర రాష్ట్రాల హక్కులకు భంగం కలుగకుండా మిగిలిన వరద నీటిని వాడుకోవచ్చునని చెబుతున్నారు.
రాయలసీమ కోసమే :
ఇలా వేస్ట్ గా సముద్రంలోకి పోతున్న నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం ఈ ప్రాజెక్టు ని ఏపీ ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రాజెక్ట్ ఫీజుబులిటీ రిపోర్ట్ సైతం సమర్పించింది. కేంద్రం సూచనలమేరకే మార్పులు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి డిపిఆర్ కి సంబంధించిన టెండర్లు కేవలం ముందస్తు సన్నాహక చర్య మాత్రమే అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతున్నారు. ఇక చట్టపరమైన అన్ని అనుమతులు వచ్చాకే పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు చేపడతామని ఆయన అంటున్నారు. ఈ నేపధ్యంలో న్యాయం ఏపీ వైపే ఉందని, ఈ కేసు విషయంలో గట్టిగా వాదించాలని ఆయన అధికారులను న్యాయవాదులను కోరుతున్నారు. ఇక ఏపీ తరఫున ఈ కేసులో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తున్నారు.