నారా వారి పల్లెకి నాయుడు గారు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ట్రెడిషన్స్ కి ఎంతో విలువ ఇస్తారు అన్నది తెలిసిందే. ఆయన తెలుగు సంప్రదాయాల గురించి సంస్కృతి గురించి కూడా యువతకు గట్టిగా చెబుతారు.;

Update: 2026-01-12 00:30 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ట్రెడిషన్స్ కి ఎంతో విలువ ఇస్తారు అన్నది తెలిసిందే. ఆయన తెలుగు సంప్రదాయాల గురించి సంస్కృతి గురించి కూడా యువతకు గట్టిగా చెబుతారు. ఎవరెక్కడ ఉన్నా పాటించాలని హితవు పలుకుతారు. అంతే కాదు తెలుగుదనం గొప్పదనం గురించి కూడా చంద్రబాబు చెబుతూనే ఉంటారు. చంద్రబాబు ఎంత బిజీ అన్నది అందరికీ తెలిసిందే. ఆయన ఏపీకి నాలుగవ సారి సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే బాబు తీరిక లేని పనులలో ఉన్నా కూడా సంక్రాంతి వచ్చింది అంటే చాలు తన సొంతూరుకు వెళ్ళడం మాత్రం అసలు మిస్ కారు, తప్పనిసరిగా ఆయన ఆ టైం కి తన గ్రామంలో ఉంటారు. అందరితో మాట్లాడుతూ మూడు రోజుల పాటు సందడి చేస్తారు.

ఈ కాన్సెప్ట్ బలంగా :

చంద్రబాబు 1995లో ఉమ్మడి ఏపీకి సీఎం గా తొలిసారి అయ్యారు. ఆయన ఆ తరువాత ప్రతీ ఏటా సంక్రాంతి వచ్చిందంటే చాలు సొంతూరుకు వెళ్ళాలన్న కాన్సెప్ట్ ని బలంగా చాటారు. అది ఆయన ఆచరణ ద్వారానే. బాబు సీఎం గా ఉంటూ సంక్రాంతి వేళ చిత్తూరు జిల్లా చంద్రరిగి అసెంబ్లీ నియోజకవర్గంలోని నారావారి పల్లెకు వెళ్లడం ద్వారా తెలుగు జనాలకు ఒక సందేశం ఇచ్చారు. దాంతో అప్పటిదాకా కొంతవరకూ మాత్రమే ఉన్న ఈ ట్రెడిషన్ పూర్తిగా నూరు శాతంగా మారింది. దానికి కారణం బాబు వేసిన రూటు అని అంటారు.

ఈసారి కూడా :

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నుంచి నాలుగురోజుల పాటు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఆయన చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లికి రేపు సాయంత్రం అయిదు గంటలకు ముఖ్యమంత్రి చేరుకుంటారు. అలాగే స్థానికంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. ఇక నారా వారి కుటుంబ సభ్యులు బంధువులు ఇతర సన్నిహిత వర్గాల మధ్య చంద్రబాబు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. అంతే కాదు నారావారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సైతం ఆయన శ్రీకారం చుడతారు. ఇక సిఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

సందడే సందడి :

చంద్రబాబు ఇంటి పేరుతోనే నారా వారి పల్లె ఏర్పాటు అయింది. అక్కడ ఉన్న వారు అంతా బాబుకు బంధువులుగానే చెబుతారు. ఇక చంద్రబాబుకు నారా వారి పల్లె జన్మస్థలం అయితే చంద్రగిరి నియోజకవర్గం ఆయన సొంతది. అక్కడ నుంచి ఆయన రెండు సార్లు పోటీ చేశారు. బాబుకు రాజకీయంగా జన్మను ఇచ్చిన ప్రాంతంగా చంద్రగిరిని చెప్పుకుంటారు. 1978లో యువకుడు అయిన బాబు ఇక్కడ నుంచి తొలిసారి ఇందిరా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి మంచి మెజారిటీతో గెలవడమే కాకుండా ఆ తరువాత మంత్రి కూడా అయ్యారు. అలా ఆయనకు చంద్రగిరికీ ఎంతో అనుబంధం ఉంది. సో బాబుకు సంక్రాంతి వచ్చిందంటే సొంత ఊరు సొంత ప్రాంతం జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. విసుగూ విరామం లేకుండా అధికారిక కార్యక్రమాలలో నిత్యం పాల్గొనే బాబుకు ఈ సంక్రాంతి పండుగ వేడుకలు అన్నవి ఒక భారీ ఉపశమనంగా అంతా చెబుతారు.

Tags:    

Similar News