కొత్త జిల్లాల ప్రాతిపదికనే జడ్పీ ఎన్నికలు.. కీలక నిర్ణయం
స్థానిక ఎన్నికలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో నిర్వహించనున్న జడ్పీ ఎన్నికలను కొత్త జిల్లాల ప్రాతిపదికగా చేపట్టాలని భావిస్తోంది.;
స్థానిక ఎన్నికలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో నిర్వహించనున్న జడ్పీ ఎన్నికలను కొత్త జిల్లాల ప్రాతిపదికగా చేపట్టాలని భావిస్తోంది. రాష్ట్రంలో ఐదేళ్ల క్రితం జిల్లాల విభజన జరిగినా, జిల్లా పరిషత్ లను మాత్రం ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. కేవలం రెవెన్యూ వ్యవహారాలకు మాత్రమే జిల్లాలను పరిమితం చేశారు. అయితే ఇప్పుడు జిల్లా పరిషత్ లను విభజించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. స్థానిక ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీలో ప్రకటించారు.
ఏపీలో 2022లో జిల్లాల విభజన చేపట్టారు. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా జిల్లాలను విభజించింది. అరకు పార్లమెంటు స్థానం విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ నియోజకర్గాన్ని రెండుగా విభజించింది. ఈ నిర్ణయంతో 13 జిల్లాలను 26 జిల్లాలు చేశారు. అప్పటి నుంచి ఈ ఏడాది జనవరి 1వ తేదీ వరకు రాష్ట్రంలో 26 జిల్లాలే ఉండేవి. అయితే కూటమి ప్రభుత్వం జిల్లాల విభజనలో లోపాలను సరిదిద్దాలని భావించి మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఇలా రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 28 జిల్లాలు ఉన్నప్పటికీ 13 జిల్లా పరిషత్ ల నుంచే స్థానిక పాలన సాగుతోంది. జిల్లా పాలనలో జిల్లా పరిషత్ ల పాత్ర అత్యంత కీలకం. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి పనులు అన్నీ జిల్లా పరిషత్ పాలకవర్గాల ఆధ్వర్యంలోని సాగుతాయి. గ్రామీణ ప్రాంతాలు మొత్తం జిల్లా పరిషత్ పాలనలో ఉండటం వల్ల ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా, జిల్లా పరిషత్ నుంచే నిధులు విడుదల చేయాల్సివుంటుందని చెబుతున్నారు. అయితే 2022లో జిల్లాలను విభజించినప్పటికీ, జిల్లా పరిషత్ లను విడదీయలేకపోయారు. దీనికి కారణం న్యాయపరమైన చిక్కులే అంటున్నారు.
జిల్లా పరిషత్ లకు ప్రజలు ఎన్నుకునే పాలకవర్గం బాధ్యత వహిస్తుంది. ఈ పాలకవర్గం పదవీ కాలం ఉండగా, విభజన సాధ్యం కాదని చెబుతున్నారు. 2021లో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత కొత్త జిల్లాల విభజన చేపట్టడంతో జిల్లా పరిషత్ లను టచ్ చేయలేకపోయారు. దీంతో ఐదేళ్ల పాటు వాటి పదవీకాలం పూర్తయ్యే వరకు నిరీక్షించాల్సివచ్చిందని అంటున్నారు. మరో మూడు నెలల్లో జడ్పీ పాలకవర్గాల పదవీ కాలం పూర్తికానున్నందున జిల్లా పరిషత్ లను విడదీయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సర్కారు తాజా నిర్ణయం వల్ల ప్రస్తుతం 13 జిల్లా పరిషత్ లు 28 కానున్నాయి. ఈ మేరకు జిల్లా పరిషత్ అధికార యంత్రాంగం పెరగనుంది. ఉద్యోగులు, అధికారులకు పదోన్నతులు కల్పించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అంతేకాకుండా కొత్తగా 15 మందికి జడ్పీ చైర్మన్, 30 మంది డిప్యూటీ చైర్మన్ పదవులు దక్కనున్నాయని అంటున్నారు. దీనివల్ల పదవులకు ఉన్న పోటీ కూడా తగ్గనుందని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల అటు రాజకీయ నాయకులు, ఇటు అధికార వర్గాలకు మేలు జరగనుందని అంటున్నారు.