నితీష్ ఎపిసోడ్ : బీజేపీతో అలెర్ట్ గా ఉండాల్సిందేనా ?
భారతీయ జనతా పార్టీ తేడా గల పార్టీ అని ఆ పార్టీ నేతలే బాహాటంగా చెప్పుకుంటారు. అది వారు చాలా గర్వంగా కూడా చెప్పుకుంటారు.;
భారతీయ జనతా పార్టీ తేడా గల పార్టీ అని ఆ పార్టీ నేతలే బాహాటంగా చెప్పుకుంటారు. అది వారు చాలా గర్వంగా కూడా చెప్పుకుంటారు. తేడా గల పార్టీ ఏంటి అంటే ఇతర పార్టీలు కూడా చేయనంత కృషి కసరత్తు బీజేపీ చేస్తుంది. వెనక ఆర్ఎస్ఎస్ లాంటి అతి పెద్ద సంఘటిత శక్తి ఉంది. దాంతో ఎడారులలో సైతం కమలాలను పూయించడం బీజేపీకే తరం అవుతుంది. బీజేపీ విషయానికి వస్తే ఒకనాడు కేవలం రెండు సీట్లకే పరిమితం అయిన పార్టీ నాలుగు దశాబ్దాలు గిర్రున తిరిగేసరికి దేశంలో 20కి పైగా రాష్ట్రాలలో అధికారంలో ఉంది. అంతే కాదు కేంద్రంలో మూడు సార్లు అధికారం అందుకుంది. నాలుగోసారి కూడా గెలిచేందుకు మాస్టర్ స్కెచ్ తో ప్రిపేర్ గా ఉంది.
లేని చోట మెల్లగా :
బీజేపీ తనది కాని చోట లేని చోట పొత్తులు కలుపుతుంది. మెల్లగా చోటు సంపాదించుకుంటుంది. ఆ మీదట సీట్ల షేర్ ని ఓట్ల షేర్ ని పెంచుకుంటుంది. ఇక ఫిఫ్టీ ఫిఫ్టీ పవర్ షేరింగ్ కి కూడా వస్తుంది. ఆ తరువాత అంతా తానే అవుతుంది. అధికారం దక్కించుకుంటుంది. ఇది అనేక రాష్ట్రాలలో ఆపరేషన్ కమలం విధానంగా ఉంది. ఇందులో తప్పేమీ లేదు, ఏ రాజకీయ పార్టీ అయినా ఎదిగి తీరాల్సిందే. బీజేపీ ఈ విషయంలో అయితే తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతోంది అని చెప్పాలి.
బీహార్ లో బీజేపీ :
ఇక బీహార్ లో చూస్తే మత పరమైన రాజకీయాలు అసలు కుదరవు, అక్కడ కులాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే లాలూ ప్రసాద్ యాదవ్ దాదాపుగా శాసించారు. ఆయన బలమైన సామాజిక వర్గాల అండతో బీహార్ లో సుదీర్ఘ కాలం పాలన చేశారు. ఆయనకు ఒకనాడు మిత్రునిగా ఉంటూ తరువాత కాలంలో ప్రత్యర్థిగా మారిన నితీష్ కుమార్ జనతా దళ్ నుంచి వేరు పడిన తరువాత జేడీయూ పేరుతో తన రాజకీయం మొదలెట్టారు ఆయనకు బీహార్ లో బీసీలు మహిళలలో ఆదరణ ఉంది. నిజాయితీపరుడిగా పేరుంది. దాంతో ఆయనతో బీజేపీ జట్టు కట్టింది. అలా గడచిన రెండు దశాబ్దాల కాలంలో మెల్లగా బీహార్ లో ఎదిరిగింది. ఈ రోజున బీహార్ పీఠాన్ని అందుకోబోతోంది.
బాధాకరమే అంటూ :
ఇక జేడీయూలో ఒక వర్గం అయితే నితీష్ కుమార్ బీహార్ ని వీడిపోవడాన్ని ఏ మాత్రం తట్టుకోలేకపోతోంది. ఆయనే సీఎం గా కొనసాగాలని పట్టుబడుతోంది. కానీ అది కుదిరే వ్యవహారం అయితే కాదు, బీజేపీ జేడీయూల మధ్య కుదిరిన ఒప్పందం మేరకే ఇదంతా సాగుతోంది అనుకోవాలి. బీహార్ లో ఉంటే నితీష్ కుమార్ బలం నీటిలో మొసలి మాదిరి అని అంటారు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వస్తే కనుక జేడీయూ పరిస్థితి ఏంటి అన్నది మరో ప్రశ్న. నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ కుమార్ కి జేడీయూ సభ్యత్వమే లేదు, ఆయన ఇపుడు తీసుకుంటున్నారు. బీహార్ లో ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఆయన రాజకీయంగా రాటు తేలేసరికి బీజేపీ బీహార్ లో పాతుకుని పోతుంది అని అంటున్నారు.
ఇవన్నీ ఉదాహరణలు :
ఇక మహారాష్ట్రలో కూడా శివసేనకు బలం బాగా ఉండేది. ఆ పార్టీతో జట్టు కట్టి ఈ రోజు బీజేపీ మహారాష్ట్ర పీఠం మీద కూర్చుంది. శివసేన ముక్కచెక్కలు ఎలా అయిందో అంతా చూసారు. అంతే కాదు తమకు బలం తక్కువగా ఉన్న చోట్ల ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఒక వ్యూహం ప్రకారం బీజేపీ ఎదుగుతూ వస్తోంది కర్ణాటకలో బీజేపీ పూర్తి మెజారిటీ దక్కించుకోవడానికి జేడీఎస్ తో కలిసింది. అలాగే ఏపీలో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. తెలంగాణాలో వీలుంటే పొత్తు పెట్టుకునే పార్టీలను వెతకవచ్చు. ఏది ఏమైనా ఈ పొత్తుల వల్ల ప్రాంతీయ పార్టీల కంటే జాతీయ పార్టీగా బీజేపీ గరిష్టంగా లాభపడుతోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఒక్కసారి బీజేపీ కనుక బలపడితే ఆ పార్టీని ఓడించడం అన్నది కష్టమని దేశంలో గుజరాత్ లాంటి రాష్ట్రాలు చెబుతున్న వాస్తవం. ఏది ఏమైనా బీజేపీతో పొత్తులో ఉన్న ప్రాంతీయ పార్టీలు అయితే తమ రాజకీయ ప్రయోజనాల కోసం అయినా అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.