వైసీపీ నేతల వరుస అరెస్టులు.. తాజాగా ముస్తఫా వంతు!
గుంటూరు జిల్లాలోని తూర్పు నియోజకవర్గం మాజీ వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాను నూజివీడు పోలీసులు గుజరాత్‌లో అరెస్టు చేశారు.
ఏపీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేల వరుస అరెస్టులు జరుగుతున్నాయి. అయితే.. వీరిలో కొందరు వ్యక్తిగత నేరాల జాబితాలో అరెస్టు అవుతుండగా.. మరికొందరు పొలిటికల్ ప్రదర్శిస్తున్న దూకుడు, ఘర్షణల కారణంగా అరెస్టు అవుతున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి రోడ్డు ప్రమాద ఘటనను వేరేవారికి అంటగట్టే ప్రయత్నంలో అరెస్టయ్యారు. ఇక, మాజీ ఎంపీ మాధవ్.. పోలీసులపై సవాళ్లు రువ్వి అరెస్టు అయ్యారు. అలానే ప్రస్తుత ఎమ్మెల్యే విరూపాక్షి.. ఘర్షణలను రెచ్చగొట్టిన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా..
గుంటూరు జిల్లాలోని తూర్పు నియోజకవర్గం మాజీ వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాను నూజివీడు పోలీసులు గుజరాత్‌లో అరెస్టు చేశారు. ఆయనతోపాటు.. ఆయన కుమారుడు బషీర్‌ను కూడా అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. వ్యాపారా లావాదేవీల నేపథ్యంలో ముస్తఫా కుమారుడు ఓ వ్యాపారి కుమారుడిని కిడ్నాప్ చేసి.. హింసించిన వ్యవహారంలో నూజివీడు పోలీసులు కేసు పెట్టారు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతన్న ముస్తఫాను.. గుజరాత్‌లో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు.
సింపతీ కోసం.. పాట్లు!
మరోవైపు ఈ అరెస్టుల నుంచి సింపతీని పిండుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. విరూపాక్షి అరెస్టును బీసీ నేత అరెస్టుగా చిత్రీకరించి.. ప్రచారం చేసింది. ఇక, తాజాగా ముస్తఫా అరెస్టును మైనారిటీ నేత అరెస్టుగా ప్రొజెక్టు చేయడం గమనార్హం. రాష్ట్రంలో మైనారిటీలకు విలువ లేకుండా పో యిందని.. కూటమి ప్రభుత్వం మైనారిటీ వ్యతిరేక ప్రభుత్వమని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నా రు. ఇక, విరూపాక్షి బోయ సామాజిక వర్గానికి చెందిననేత కావడంతో ఆయన అరెస్టును కూడా బీసీ ఖాతాలో వేసి.. బీసీలకు వ్యతిరేక ప్రభుత్వమని ప్రచారం చేయడం గమనార్హం.
కర్నూలులో ఆరని మంటలు..
ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య రాజకీయ వివాదాలు కొనసాగుతూనే ఉన్నా యి. మాజీ ఎమ్మెల్యేలకు, టీడీపీ నేతలకు మధ్య మాటల మంటలు రగులుతున్నాయి. విరూపాక్షి అరెస్టు.. అనంతరం జరిగిన ఘటనలపై టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అయితే.. దీనికి ప్రతిగా వైసీపీ నాయకులు కూడా నిరసన పర్వం కొనసాగించడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు.