వైసీపీ సానుభూతిపరుల్లో మార్పు.. కేఎస్ ప్రసాద్ నుంచి బోరుగడ్డ వరకు.. ఎందుకిలా?!
రాజకీయాల్లో పార్టీలు మారడం అత్యంత సహజం. నేతలు ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ చేస్తారో ఊహించడం చాలా కష్టం.
రాజకీయాల్లో పార్టీలు మారడం అత్యంత సహజం. నేతలు ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ చేస్తారో ఊహించడం చాలా కష్టం. కొన్నిసార్లు నిమిషాల వ్యవధిలోనే కండువాలు మార్చేసే నేతలు కూడా తారసపడుతుంటారు. కానీ, ఆయా పార్టీలకు అభిమానులుగా చెప్పుకునే వారు మాత్రం తమ వైఖరి మార్చుకోవడం అనేది చాలా అరుదు. పదవుల కోసం వచ్చే నాయకులకు పార్టీ అధినేతలను అభిమానించే శ్రేణులకు ఇదే తేడాగా చెబుతారు. అయితే ఇప్పుడు విపక్షం వైసీపీ మాత్రం ఒక అరుదైన సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని వదిలి ఎందరో నేతలు వెళ్లిపోయారు. కార్యకర్తలు మాత్రం రెండేళ్లుగా అధినేతపై నమ్మకంతో పార్టీపై అభిమానంతోనే కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో కూడా మార్పు వస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి అభిమానిగా చెప్పుకుంటున్న దళిత నేత బోరుగడ్డ అనిల్ కుమార్ తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం ఎదుట ఆందోళన చేయడం చర్చనీయాంశం అవుతోంది. వైసీపీ సానుభూతిపరుడిని అంటూ గతంలో చేసిన రచ్చ కారణంగా ఆయనను పార్టీ దూరం పెట్టిందని భావిస్తున్నా, బోరుగడ్డ సడన్ గా ఎంట్రీ ఇవ్వడం, అధినేత జగన్ ఇంటి ముందు బైఠాయించడమే అనేక అనుమానాలకు తావిస్తోంది. పార్టీ అతడిని దూరం పెట్టినా, అతడు పార్టీకి దూరమైనా జగన్ అభిమాని ఒకరు దూరమయ్యారనే అంశమే ఇక్కడ హాట్ టాపిక్ అవుతోంది. ఒక్క బోరుగడ్డ మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో వైసీపీ తరఫున గట్టిగా వాదనలు వినిపించిన పలువురు సోషల్ మీడియా కార్యకర్తలు ఇటీవల వైసీపీకి దూరమయ్యారని ప్రచారం జరుగుతోంది.
ఇటువంటి వారిలో సోషల్ మీడియా విశ్లేషకులుగా భావిస్తున్న కేఎస్ ప్రసాద్, పాషాతోపాటు ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తదితరుల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కూటమిపై అసంతృప్తితో వైసీపీకి దగ్గరైన న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో వైసీపీతో కూడా ఎడం జరిగినట్లు కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. అదేవిధంగా గత ఎన్నికల ముందు ఆ తర్వాత ఏడాది, ఏడాదిన్నర వరకు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా చానళ్లలో వైసీపీ వాయిస్ గట్టిగా వినిపించిన కేఎస్ ప్రసాద్, పాషాతోపాటు మరికొందరు కూడా ఇప్పుడు వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణాలు ఏంటి అన్నదానిపై వైసీపీలో అంతర్గతంగా పెద్ద చర్చే జరుగుతోందని అంటున్నారు.
సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో ప్రతి పార్టీ పార్టీ గళాన్ని వినిపించేవారిని ఎక్కువగా మోహరిస్తుంటే వైసీపీలో మాత్రం ఒకప్పుడు పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నవారు దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ఇక వైసీపీకి అనుకూలంగా చెబుతున్న కొన్ని వెబ్ సైట్లలో కూడా ఇటీవల పార్టీ అధినేత జగన్ రెడ్డికి వ్యతిరేకంగా కథనాలు వస్తున్న విషయాన్ని పరిశీలకులు ఎత్తిచూపుతున్నారు. ప్రధానంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు విషయంలో జగన్ స్పందించిన తీరుపై వైసీపీ అనుకూల వెబ్ సైట్లు, సోషల్ మీడియా ప్లాట్ ఫాంల్లో అభ్యంతరాలు వ్యక్తమైనట్లు చెబుతున్నారు. అయితే వైసీపీలో పరిస్థితి ఎందుకిలా మారిందనేదే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. దీనిపై వైసీపీ అధిష్టానం కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.