గాల్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం..

పుకెట్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం గాల్లో తీవ్ర కుదుపులకు గురికావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

Update: 2026-08-04 15:25 GMT

పుకెట్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం గాల్లో తీవ్ర కుదుపులకు గురికావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. గమ్యస్థానానికి చేరువలో ఉండగా ఒక్కసారిగా విమానం సుమారు 300 అడుగుల మేర కిందికి పడిపోవడంతో పలువురు సీట్ల నుంచి ఎగిరిపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది గాయపడగా.. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఎయిరిండియాకు చెందిన ఏఐ 2379 విమానం థాయ్‌లాండ్‌లోని పుకెట్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తోంది. ప్రయాణం చివరి దశలో ఉండగా ప్రతికూల వాతావరణం, భారీ గాలుల కారణంగా విమానం ఒక్కసారిగా తీవ్ర కుదుపులకు లోనైంది. ఆ సమయంలో విమానం దాదాపు 300 అడుగుల మేర అకస్మాత్తుగా కిందికి పడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయానికి గురయ్యారు. సీట్ బెల్ట్‌లు ధరించని కొందరు ప్రయాణికులు పైకప్పుకు బలంగా తగిలి తిరిగి సీట్లపై పడినట్లు సమాచారం.

ఒక ప్రయాణికుడు ఈ ఘటనను వివరిస్తూ.. "విమానం ఒక్కసారిగా కిందికి పడిపోవడంతో మేమంతా సీట్ల నుంచి ఎగిరిపోయాం. పైకప్పుకు బలంగా తగిలి మళ్లీ కింద పడిపోయాం. ఒక వ్యక్తి చేతిలో ఉన్న చిన్నారి కూడా గాల్లోకి ఎగిరి మూడు సీట్ల దూరంలో పడింది. ఆ క్షణాల్లో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అందరూ ప్రాణభయంతో కేకలు వేశారు" అని తెలిపాడు.

విమానం ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే వైద్య బృందాలు సిద్ధంగా ఉండి గాయపడిన వారికి తక్షణ చికిత్స అందించాయి. మొత్తం 10 మంది ప్రయాణికులు, నలుగురు క్యాబిన్ క్రూ సభ్యులు గాయపడినట్లు ఎయిరిండియా వెల్లడించింది. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం అందరూ సురక్షితంగా ఉన్నారని సంస్థ తెలిపింది.

ఈ ఘటనపై ఎయిరిండియా అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొంది. అలాగే ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చేపట్టిన దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నట్లు వెల్లడించింది.

విమానయాన నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఏర్పడే తీవ్రమైన గాలి అలజడి కారణంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. అందుకే ప్రయాణికులు విమానంలో ఉన్నంతసేపు సీట్ బెల్ట్ ధరించాలని అధికారులు మరోసారి సూచిస్తున్నారు. ఈ ఘటనలో పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు.




Tags:    

Similar News