పిల్లలను కనండి...బాబు పిలుపు మేలుకొలుపు
పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఏపీలో వృద్ధుల జనాభా ఎక్కువ అవుతోందని, యువతరం తగ్గుతోంది అని ఆందోళన వ్యక్తం చేశారు.;
ఏపీలో ఎక్కువ మంది పిల్లలను కనండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు ఇచ్చారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఏపీలో వృద్ధుల జనాభా ఎక్కువ అవుతోందని, యువతరం తగ్గుతోంది అని ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా దేశంలోనూ జనాభా వృద్ధి రేటు తగ్గుతోందని అన్నారు. ముఖ్యంగా సంతానోత్పత్తి సామర్ధ్యం కూడా తగ్గిపోతోంది అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
జనాభా పెరగాలి :
గతంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటి వరకూ ఫ్యామిలీ ప్లానింగ్ కి అధిక ప్రాధాన్యత ఇచ్చాం ఇక నుంచి పాపులేషన్ కేర్ వైపు దృష్టి పెట్టాల్సి ఉందని అన్నారు. జపాన్, దక్షిణ కొరియా ఇటలీ లాంటి దేశాల్లో ఫెర్టిలిటీ రేట్ తగ్గుతోందని బాబు విశ్లేషించారు. ప్రస్తుతం రాష్ట్రంలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ టీఎఫ్ఆర్ 1.5 గా ఉందని ఆయన చెబుతూ సరిగ్గా ముప్పయ్యేళ్ళ క్రితం 1993లో ఇది 3.0 గా నమోదైందని గుర్తు చేశారు. టీఎఫ్ఆర్ వేగంగా తగ్గిపోతే పని చేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోయి ఆర్థిక వృద్ధి మందగిస్తుందని బాబు ఆందోళన వ్యక్తం చేశారు.
వృద్ధ ఆంధ్రాగా :
ఇదిలా ఉంటే 2023 లెక్కల ప్రకారం ఏటా 6.70 లక్షల జననాలు రాష్ట్రంలో నమోదు అయ్యాయని బాబు చెప్పారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే 2047 నాటికి మన జనాభాలో 23 శాతం మంది వృద్ధులు ఉంటారని అన్నారు. పాపులేషన్ మేనేజ్మెంట్ కోసం ఐదు అంచెల లైఫ్ సైకిల్ విధానాన్ని చేపట్టాల్సి ఉందని అన్నారు. మాతృత్వం, శక్తి, క్షేమం, నైపుణ్యం, సంజీవని లాంటివి ఐదు కూడా ఐదు పిల్లర్స్ గా పనిచేస్తాయని అన్నారు. పిల్లలు లేక, ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
పీపీ మోడల్‌లో ఐవీఎఫ్ సేవలు :
మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేసి సబ్సిడీపై పీపీపీ మోడల్‌లో ఐవీఎఫ్ సేవలు అందించాలని యోచిస్తున్నామని బాబు చెప్పారు అదే విధంగా సిజేరియన్ ఆపరేషన్లు తగ్గాలనేది ప్రభుత్వ సంకల్పంగా చెప్పారు. మూడో సంతానంతో పాటు ఆపై జననాలకు 12 నెలల పేరెంటల్ లీవ్ తో పాటు తల్లిదండ్రులకు రెండు నెలలు పెటర్నల్ లీవ్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామని అన్నారు. త్వరలో తల్లి దండ్రుల సమాన బాధ్యత’ పేరుతో కుటుంబ బాధ్యతలు పంచుకోవడంపై అవగాహన క్యాంపెయిన్ నిర్వహిస్తామని కూడా బాబు సభలో ప్రకటించారు.
వారికి శిక్షణ :
ఇక పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీలో భాగంగా చైల్డ్ కేర్ టేకర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు. అలాగే వైద్య సేవలు అందించేందుకు డిజిటల్ మౌలిక వసతులు అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇక మూడో సంతానానికి పోషణ-శిక్షా-సురక్ష’ ప్యాకేజ్ పేరిట డెలివరీ సమయంలో పాతిక వేల రూపాయల ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రతిపాదన చేస్తున్నామని అన్నారు. అలాగే మూడో సంతానానికి అయిదు సంవత్సరాల పాటు నెలకు పోషణ కింద వెయ్యి రూపాయలు అలాగే 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తామని బాబు ప్రకటించారు. ఇక దీని మీద నెల రోజుల పాటు ప్రజల అందరి అభిప్రాయం తీసుకునేందుకు గానూ ఆన్‌లైన్‌లో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ డాక్యుమెంట్ ఉంచుతామని బాబు చెప్పారు. ఈ నెలాఖరు కల్లా పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీకి తుదిరూపం ఇచ్చి ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.
ఫస్ట్ టైం అలా :
ఇక ఈ తరహా విధానం దేశంలోనే ఇది తొలి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అవుతుందని చంద్రబాబు చెప్పారు. ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్నా స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించిందని ఆయన గుర్తు చేశారు. మారుతున్న పరిస్థితులు, కాలానికి తగ్గట్టు ప్రభుత్వ విధానాలు ఉండాలని అన్నారు.