భర్తలకే ముందుగా మరణం ఎందుకు ?

ప్రతీ కుటుంబంలో మగవారి పాత్ర చాలా ఎక్కువ. మగ పిల్లవాడు పుట్టాడు అంటే ఆ తండ్రి సంతోషిస్తాడు.;

Update: 2026-03-05 18:38 GMT

ప్రతీ కుటుంబంలో మగవారి పాత్ర చాలా ఎక్కువ. మగ పిల్లవాడు పుట్టాడు అంటే ఆ తండ్రి సంతోషిస్తాడు. ఎందుకంటే తాను వృద్ధాప్యం దశకు చేరేసరికి తనకు వెన్నుదన్నుగా కుటుంబాన్ని మోస్తాడు అని. ఇలా మొదలవుతుంది మగవాడి జీవితం. అంటే పుట్టిన దగ్గర నుంచే బాధ్యతలు ఎదురు చూస్తూ ఉంటాయన్నమాట. ఇక పెంపకం విషయంలోనూ బాధ్యత బరువు రెండూ ఎప్పటికప్పుడు తెలియచేస్తూ పెంచుతారు. దాంతో మగవాడు తాను మోయాల్సిన సంసార బాధ్యతలు టన్నుల కొద్దీ ఉన్నాయని తెలుసుకుంటూనే ఎదుగుతాడు.

వెన్నెముకగా మారి :

ఇక కుటుంబ బంధం లో మగవాడి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. శరీరానికి వెన్నెముక ఎలాగో అలా అన్న మాట. ఆ విధంగా కుటుంబాన్ని మోస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. పెళ్ళి అయితే భార్య వస్తే సంసారం బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ఒక పక్క తల్లితండ్రులను చూసుకోవడం మరో వైపు తన కుటుంబాన్ని చూసుకోవడం తన పిల్లల బాగోగులు భార్య సంతోషంగా ఉండాలని ఆలోచనలు ఆర్థిక సామాజిక పరమైన ఒత్తిళ్ళు ఇలా ఎన్నో భర్త అనే వాడు మోస్తూంటాడు. అంతే కాదు తనకు ఆఫీసులో బాస్ ఒకడు ఉంటాడు, ఆ బాస్ ని మెప్పించడం ఎలా ప్రమోషన్ సాధించడం ఎలా అన్నది కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తన ఆర్థిక పరిస్థితిని ఎప్పటికపుడు పెంచుకోవాల్సి రావడం కాలానికి తగినట్లుగా తన ఆదాయన్ని రెట్టింపు చేసుకోవడం మరో కీలక బాధ్యత.

నిరంతర శ్రమజీవిగా :

ఈ పరుగు పందెంలో భర్త అనే వాడు నిరంతర శ్రమ జీవిగా మారిపోతాడు. ముందే చెప్పినట్లుగా చిన్నప్పటి నుంచి మగవాడివి నీవు బాధ్యతగా ఉండాలి అన్న మాటలు నిలువెల్లా వంట బట్టి గంభీరంగా ఉండడం అలవాటు చేసుకుంటాడు, జీవితంలో తగిలే ఎదురు దెబ్బలను ఒంటరిగానే భరిస్తాడు, తమ కుటుంబానికి రక్షణ కవచంగా నిలుస్తాడు, అదే సమయంలో ఆ వైపుగా వచ్చే సమస్యలను సైతం పోరాడుతూనే సాధిస్తాడు, ఇక ఈ రకమైన తీరిక లేని జీవితంలో అలసటతో సాగే ప్రయాణంలో భర్త అనే వాడు భరిస్తూ బాధ్యతలను నెత్తిన మోపుగా పెట్టుకుని అందులోనే తరిస్తూ అలసటకు లోను అయినా ఆవేదనకు లోను అయినా పలకరించే వారు బహు తక్కువగా ఉంటారు.

జీతమే కొలమానం :

భర్త అంటే జీతమే కొలమానం. ఎంత సంపాదించాడో అదే ప్రమాణం. బంధువులు కానీ చుట్టాలు స్నేహితులు కానీ అడిగే ప్రశ్న ఇదే. ఎంత సంపాదిస్తున్నావు ఏ సంపదలను సృష్టించావు అని, ఇళ్లూ వాకిలీ కొనుక్కున్నావా అని కూడా అడుగుతారు సామాజిక స్టాటస్ సాధిస్తేనే మగవాడు అనబడే భర్తకు సమాజంలో విలువ. అవన్నీ భౌతికపరమైన రూపంలోనే ఉంటాయి. దాంతో వాటి కోసం శ్రమిస్తూ పరిశ్రమిస్తూ విశ్రాంతి లేని జీవితంతో పోటీ పడుతూ భర్త అనే క్యారక్టర్ ఒంటరిగానే ముందుకు సాగిపోతుంది.

పెదవి చాటున బాధ :

పెదవికి తగిలించుకున్న నవ్వు నిజమైనది కాదు, ఎంతో మంది భర్తలు అలాగే ఉంటారు, బాధలు అన్నీ మనసులోనే అదిమి పెడతారు, ఎందుకంటే మగవాడు ఏడవకూడదు, ఏడిచినా సమాజం నమ్మదు, కన్నీరు పెడితే పిరికివాడు అంటుంది, బలహీనుడు అంటుంది, ఇంకా పచ్చిగా చెప్పాలీ అంటే చేతకాని వాడు అంటుంది. దాంతో ఎవరితోనూ తన బాధలను పంచుకోలేడు, అప్పులు ఆస్తుల మధ్య అంతరం అతనికే తెలుసు. ఆనందం విషాదం మధ్య లంగరు వేసేది కూడా అతగాడే. అంతే కాదు, అందరికీ నవ్వులు పంచుతూ తాను మాత్రం కొవ్వొత్తిలా కరిగిపోయే వాడే భర్త అనబడే మగవాడు. అంతా బాగుండాలి అనుకునే భర్తను బాగున్నారా అని పలకరించే వారు బహు తక్కువ.

జీవితాన్ని చిన్నదిగా :

అందుకే గుండె లోతుల్ల్లోనే బాధలను బరువులను మోస్తూ తనకు భవంతుడు ఇచ్చిన జీవితాన్ని వీలైనంతగా చిన్నది చేసేసుకుంటాడు, ఒత్తిళ్ల జీవితంతో ఆరోగ్యానికి దెబ్బ పడుతున్నా లక్ష్యం చేరుకోవాలన్న తపనతో ఆయుస్షుని ఫణంగా పెడతాడు. తాను ఎక్కడ అడుగు వెనక్కి వేస్తే తన కుటుంబం ఏమైపోతుందో అన్న ఆందోళనతో గుండె మీద ఒత్తిడి పెంచేసుకుంటాడు. ఇలా ఒక రోజున అర్ధాంతరంగా తనువు చాలిస్తాడు. బహుశా అపుడేనేమో మగ గుండెకి పూర్తి విశ్రాంతి లభిస్తుంది. ఇది ఒక సగటు మగవాడి జీవితం. నూటికి తొంబై శాతం బతుకు ఇలాగే ఉంటుంది.

చావుని స్వాగతిస్తూ :

చావుకు ఎవరూ ఎదురు వెళ్లరు, పక్కకు తప్పుకోవాలనే చూస్తారు, కానీ అదే చావును కోరి స్వాగతించేవాడే మగవాడు. భర్త అనే బంధనాలతో బాధ్యతలతో తడిసి మోపెడు అవుతూ పిడికెడు గుండెకు కడలికి మించిన భారాన్ని మోపేసి ఒక రోజున తనువు చాలించేస్తాడు. అందుకే ఎక్కడ చూసినా భర్తలే ముందుగా పోతారు దానికి కారణం వారు శారీరకంగా బలంగా కనిపించినా మానసికంగా దుర్బలులుగా ఉంటారు, బతుకు నావను ఒడ్డుకు చేర్చే ప్రయత్నంలో వారు ఎదురీతనే నమ్ముకుంటారు. మరి భర్తల గురించి ప్రతి మహిళ తెలుసుకోవలసిన నిజాలు ఇవే. మగవారి ప్రేమను పొందడమే కాదు, వారి బాధలను కూడా పంచుకోవాలి. వారి బాగోగులను గమనించాలి, వీలైనంతవరకూ స్వాంతన కలిగించాలి. అపుడు నిండు నూరేళ్ళూ ఆ భర్త బాగుంటాడు, వారి కాపురమూ సుఖమయంగా ఉంటుంది అని ఆధ్యాత్మిక వేత్తలే కాదు సామాజిక వేత్తలూ సూచిస్తున్నారు.

Tags:    

Similar News