538 మంది మృతి 10వేల మంది అరెస్ట్... నెత్తురోడుతున్న ఇరాన్!

ఇరాన్ లో ప్రజా నిరసన రోజు రోజుకీ తీవ్రమవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో మొన్నటివరకూ రగిలిపోయిన ఇరాన్ లో ఇప్పుడు నెత్తురోడుతోంది.;

Update: 2026-01-12 04:55 GMT

ఇరాన్ లో ప్రజా నిరసన రోజు రోజుకీ తీవ్రమవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో మొన్నటివరకూ రగిలిపోయిన ఇరాన్ లో ఇప్పుడు నెత్తురోడుతోంది. అటు నిరసనకారులు, ఇటు వారిని అదుపుచేస్తున్న భద్రతా సిబ్బంది సైతం మృత్యువాత పడుతున్నారు. మరోవైపు ఇరాన్ పై సైనిక చర్య అవకాశాల్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోందని అంటున్నారు. దీంతో... పశ్చిమాసియావ్యాప్తంగా యుద్ధ ఆందోళనలు చెలరేగుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ అప్రమత్తమైంది.

అవును... ఇరాన్ లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న నిరసనకారులు ఓ వైపు.. వారిని తీవ్రస్థాయిలో అణిచేస్తున్న సైన్యం మరో వైపు.. ఎటు చూసినా నిప్పులు, నెత్తురు, నినాదాలు, హాహాకారాలే. ఈ ఘర్షణల్లో పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగా.. ఇప్పటివరకూ సుమారు 540 మంది వరకూ మరణించగా.. 1000 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.

మృతుల్లో సుమారు 50 మంది వరకూ భద్రతా సిబ్బంది ఉన్నారని చెబుతున్నారు. ఇక.. సుమారు 10,670 మందిని సైన్యం అరెస్టు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్, అమెరికా మధ్య పేలుతున్న మాటల తూటాలు కాస్తా.. క్షిపణుల వరకూ వెళ్లే అవకాశం లేకపోలేదని అంటున్నారు. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి! ప్రధానంగా.. ఆందోళనకారులకు ఏమైనా జరిగితే తాము రంగంలోకి దిగుతామని ట్రంప్‌ హెచ్చరిస్తున్న పరిస్థితి.

దీంతో.. ఇరాన్ పై అమెరికా సైనిక చర్య దిశగా సన్నాహాలు చేస్తుందని కథనాలు వెలువడుతున్నాయి. దీనికి కంటిన్యుటీగా అన్నట్లుగా.. అమెరికా సైనికాధికారులు ఇప్పటికే అధ్యక్షుడితో చర్చించారని.. ఇరాన్‌ పై చర్య విషయంలో వివిధ ప్రతిపాదనలు ట్రంప్‌ ముందున్నాయని అధికారులు చెబుతున్నారని.. ఇందులో అమెరికా నేరుగా జోక్యం చేసుకోకుండా పరోక్షంగా రంగంలోకి దిగేందుకు వీలైన సూచనలూ ఉన్నాయని చెబుతున్నారు.

అయితే మృతుల సంఖ్య ఇదే విధంగా రోజు రోజుకీ పెరుగుతూ పోతే మాత్రం ట్రంప్ రంగంలోకి దిగడం ఖాయమని.. ఇరాన్ పై అమెరికా సైనిక చర్య కన్ఫాం అని చెబుతున్నారు. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో.. ఆందోళనకారులను ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఉగ్రవాదులతో పోల్చడంపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

అమెరికా వర్సెస్ ఇరాన్!:

ఈ సందర్భంగా స్పందించిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్.. దేశాన్ని అస్థిరపరిచేందుకు అమెరికా, ఇజ్రాయెల్ కుట్ర పన్నుతున్నాయని.. ప్రజల సమస్యలను పరిష్కరించడం తమ కర్తవ్యంమని.. అంతకంటే ముందు అల్లరి మూకలు మొత్తం సమాజాన్ని నాశనం చేయకుండా చూడటమూ తమ బాధ్యత అని అన్నారు. మరోవైపు... ఇరాన్‌ ప్రజలు స్వేచ్ఛ కోసం పరితపిస్తున్నారని.. వారు కోరుకుంటే అండగా ఉంటామని ట్రంప్‌ పోస్టు పెట్టారు. ఇదే సమయంలో.. 'ట్రంప్‌ తో ఆటలాడకండి. ఆయన చెప్పారంటే ఏదో చేస్తారు' అని ఇరాన్‌ ను అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది.

అమెరికా కొడితే ఇజ్రాయెల్ కు దెబ్బలు!:

ఈ సమయంలో అమెరికాను ఇజ్రాయెల్ పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేసే పనికి పూనుకుంది ఇరాన్. ఇందులో భాగంగా... అమెరికా తమపై దాడి చేస్తే తాము ఇజ్రాయెల్‌ ను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాకర్ గాలిబాఫ్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో ఇజ్రాయెల్‌ అప్రమత్తమైంది. ఇప్పటికె ఇరాన్ మద్దతుదారులైన హమాస్, హెజ్ బొల్లా తో పోరాడిన ఇజ్రాయెల్.. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని.. అలర్ట్ అయినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News