మిషన్ 2026 : కమ్యూనిస్టు కోటకు కాషాయం గురి

బీజేపీలో ఆత్మ విశ్వాసం బాగా పెరిగింది. బీహార్ లో వరసగా రెండోసారి అధికారంలోకి రావడమే కాదు ఏకంగా బంపర్ విక్టరీని కొట్టడం ఉత్సాహాన్ని ఇచ్చింది.;

Update: 2026-01-12 01:30 GMT

బీజేపీలో ఆత్మ విశ్వాసం బాగా పెరిగింది. బీహార్ లో వరసగా రెండోసారి అధికారంలోకి రావడమే కాదు ఏకంగా బంపర్ విక్టరీని కొట్టడం ఉత్సాహాన్ని ఇచ్చింది. అంతే కాదు విపక్షానికి పెద్దగా బలం లేకుండా చేసిన తీరు మరింత జోష్ ని ఇచ్చింది. దానికి ముందు మహారాష్ట్రలో ఇదే విధంగా విపక్షాన్ని కకావికలు చేస్తూ ఎన్డీయే తన దూకుడు చూపించింది. ఇలా చూస్తే కనుక కేంద్రంలో వరసగా మూడవ సారి అధికారంలోకి రావడమే కాకుండా 2024 తరువాత దేశంలో జరిగిన హర్యానా మహారాష్ట్ర ఢిల్లీ బీహార్ వంటి చోట్ల బీజేపీ దాని మిత్ర పక్షాలు మంచి విజయాన్ని నమోదు చేయడంతో కమలనాధులు ఇపుడు కదనోత్సాహంతో ఉన్నారు.

కీలకమైన ఏడాదిగా :

ఇక 2026 అన్నది బీజేపీకి కీలకమైనదిగా మారుతోంది. ఈ ఏడాది ఏకంగా అయిదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు ఉన్నాయి. అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరీలలో ఈ ఎన్నికలు ఈ ఏడాది మధ్యలో జరగనున్నాయి. ఇందులో అసోంలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. దానిని నిలబెట్టుకుంటూ మిగిలిన వాటిలో కూడా తన సత్తా చాటాలని బీజేపీ ఉబలాట పడుతోంది. పశ్చిమ బెంగాల్ లో ఇప్పటికే ఆపరేషన్ కమలం స్టార్ట్ చేసి ఒక లెవెల్ లో పొలిటికల్ సౌండ్స్ ని క్రియేట్ చేసిన బీజేపీ తమిళనాడులో కూడా తనదైన వ్యూహ రచన చేస్తోంది. సూపర్ స్టార్ విజయ్ టీవీకే పార్టీని కలుపుకుంటే డీఎంకే ని ఓడించడం డెడ్ ఈజీ అవుతుందని లెక్క పక్కాగా వేసుకుంటోంది. ఈ ఫలితాలే పుదుచ్చేరీలో రిపీట్ అవుతాయని అంచనా ఉంది. ఇక మరో సౌత్ స్టేట్ అయిన కేరళలో బీజేపీ విజయబావుట ఎగరేయడానికి భారీ స్కెచ్ నే గీసి సిద్ధం అంటోంది.

మిషన్ తో పవర్ ఫుల్ గన్ :

ఇదిలా ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేరళలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం తిరువనంతపురంలో మిషన్ 2026 ను ఆదివారం ప్రారంభించారు. తిరువనంతపురంలోని కౌడియార్‌లోని ఉదయ్ ప్యాలెస్ కన్వెన్షన్ సెంటర్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికైన బీజేపీ సభ్యుల రాష్ట్ర సదస్సులో ఆయన ప్రసంగిస్తూ కేరళలో కాషాయదళం మార్చ్ కి రెడీగా ఉండాలని ఉత్తేజపూరితమైన సందేశం ఇచ్చారు. వికసిత కేరళను నిర్మించడానికి బీజేపీ కృషి చేస్తోందని ఆయన చెబుతూ ఆ లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ టార్గెట్ అని చెప్పాల్సింది చెప్పేసారు వికసిత భారతదేశానికి మార్గం వికసిత కేరళ నుండే అంటూ ఆయన రూట్ మ్యాప్ కూడా ఏంటో చూపించారు

గెలుపు బాటలోనే :

బీజేపీ కేరళలో అంతకంతకు వికసిస్తోందని అమిత్ షా గుర్తు చేస్తూ కొన్ని గణాంకాలను క్యాడర్ ముందుంచారు 2014లో పోటీ చేస్తే కేవలం 11 శాతం ఓటు షేర్ వచ్చిందని అది కాస్తా 2024 లోక్ సభ ఎన్నికల నాటికి 20 శాతానికి ఎగబాకింది అని ఆయన లెక్క చెప్పారు. ఇక 2026 ఎన్నికల నాటికి ఆ నంబర్ కాస్తా 40 శాతం ఓటు షేర్ వైపుగా ఎందుకు మారదని ఆయన ప్రశ్నించారు. అది కచ్చితంగా జరిగి తీరుతుందని ఆయన చెప్పడం విశేషం. కేరళ ప్రజలు బీజేపీ వెంట ఉన్నారని ఆయన అంటూ తొందరలో జరిగే ఎన్నికల్లో కేరళ పీఠం బీజేపీ పరం కావడం తథ్యమని జోస్యం చెప్పారు.

ఇద్దరు మంత్రులు దోషులు :

ఇక శబరిమల బంగారు వివాదం కేసు గురించి కేంద్ర మంత్రి అమిత్ షా ప్రస్తావిస్తూ ఇద్దరు మంత్రులు ప్రజల దృష్టిలో దోషులుగా ఉన్నారని సంచలన కామెంట్స్ చేశారు. అయినా ఇపుడున్న పరిస్థితుల్లో దీనిపై నిష్పక్షపాత విచారణ జరగడం సాధ్యం కాదని ఆయన అన్నారు. శబరిమల ఆస్తులను కాపాడలేని వారు మన నమ్మకాలను కూడా కాపాడలేరని ఆయన కేరళ ప్రభుత్వం తీరుని ఎండగట్టారు. శబరిమలలో జరిగిన పరిణామాల పట్ల యావత్ దేశం ఆందోళన చెందుతోందని అమిత్ షా చెప్పడం విశేషం. ఇక ప్రధానమంత్రి సమతుల్య అభివృద్ధి నమూనాను దేశంలో ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు.

కేరళలో బీజేపీ బిగ్ సౌండ్ :

అదే విధంగా భారతదేశంలో మౌలిక సదుపాయాలు ప్రపంచ స్థాయికి అభివృద్ధి చెందాయని అంటే అది ఎన్డీయే ప్రభుత్వం గొప్పదనం అన్నారుఇ. దేశంలో సాగుతున్న ప్రగతి కేరళకు కూడా విస్తరించాల్సి ఉందని అన్నారు. అందుకే కేరళ కూడా విదేశీ మారక ద్రవ్యంపై ఆధారపడకుండా సమగ్ర అభివృద్ధిని తొందరగా ప్రారంభించాలని ఆయన సూచించారు. అది జరగాలీ అంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం కచ్చితంగా ఉందని ఆయన స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి మిషన్ -2026 అంటూ కేరళలో బీజేపీ బిగ్ సౌండ్ చేస్తోంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

Tags:    

Similar News