సంచలనం: బీజేపీలోకి వైసీపీ ఎంపీలు.. తెరవెనుక చర్చలు ..!
ఇక, జగన్ సొంత బాబాయి, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి సైతం బీజేపీ బాటలో నడిచేందుకు రెడీ అయినట్టు సమాచారం.;
ఇది నిజమేనా? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాల్లో ఎవరు ఎవరికీ శత్రువులు కారు. సో.. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి ముగ్గురు కీలక నాయకులు.. బీజేపీలోకి చేరేందుకు చర్చలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అత్యం త విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ప్రస్తుతం కేసులు ఎదుర్కొంటున్న ముగ్గురు కీలక ఎంపీలు.. త్వరలోనే బీజేపీలోకి చేరే అవకాశం ఉందని సమాచారం.
వీరిలో రాజంపేట ఎంపీ అవినాష్ రెడ్డి పేరు గత కొన్నాళ్లుగావినిపిస్తోంది. ఈయనపై అక్రమ మద్యం కేసు ఉంది. ఇప్పటికే కొన్ని రోజుల పాటు ఆయన జైల్లో కూడా ఉండివచ్చారు. ఈ క్రమంలో ఈ కేసు మరింత పెరిగి.. పెద్దదయ్యేలోగానే తర రాజకీయ భవిష్యత్తును బీజేపీతో కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. త్వరలోనే బీజేపీ లో చేరేందుకు మార్గం సుగమం అవుతున్నట్టు తెలిసింది. బీజేపీ పెద్దలతోనూ చర్చించారని సమాచారం.
ఇక, జగన్ సొంత బాబాయి, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి సైతం బీజేపీ బాటలో నడిచేందుకు రెడీ అయినట్టు సమాచారం. ఈయన కూడా తిరుమల నకిలీ నెయ్యి కేసును ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అన్ని వేళ్లూ.. ఆయన చుట్టూ కనిపిస్తున్న నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితిలో రాజకీయంగా వ్యూహం మార్చాలని నిర్ణయించుకున్నట్టు తాజాగా వెలుగు చూసింది. ఈ క్రమంలోనే వైవీ సుబ్బారెడ్డి బీజేపీతో టచ్‌లోకి వెళ్లిపోయారని తెలిసింది.
అదేసమయంలో వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి సైతం.. బీజేపీ గూటికి చేరేందుకు దాదాపు రంగం రెడీ చేసుకున్నట్టు సమాచారం. పార్లమెంటులోనూ.. బయటా.. బీజేపీ నేతలతో ఆయనకు ఉన్న సంబంధాలతో పాటు.. కీలక నాయకుల ప్రోత్సాహం కూడా ఉండడంతో బీజేపీ బాట పట్టేందుకు అవినాష్ రెడీ అయ్యారు. ఇక, బీజేపీ కూడా.. దక్షిణాదిలో బలం పెంచుకునేందుకు రెడీ అవుతున్న దరిమిలా.. వీరి రాకపై సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం.. ఇటీవల.. కేంద్ర మంత్రి ఒకరు.. రాష్ట్రానికి సమాచారం కూడా ఇచ్చారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.