రీల్ కాదు రియల్ శ్రీమంతుడు.. చదువుకున్న స్కూల్ కు రూ.3.5కోట్లు
1918లో గడీచౌక ప్రభుత్వపాఠశాలను మైసూర్ మహారాజు క్రిష్ణరాజు వడయార్ IV హయాంలో ఏర్పాటైంది. ఈ స్కూల్ లో బీఆర్ సచ్చిదానంద మూర్తి 1950లలో చదువుకున్నారు.;
సినిమాల్లో చూపించినట్లే జరుగుతాయా? అని కొందరు దీర్ఘాలు తీస్తారు. నిజమే.. సినిమాల్లో కాస్తంత నాటకీయత ఉంటుంది. కానీ.. తరచి చూస్తే.. జీవితంలో కొన్ని సందర్భాల్లో ఎదురయ్యే నాటకీయ సంఘటనల ముందు సినిమాలు ఏం పనికి వస్తాయి. అప్పుడెప్పుడో చదువుకున్న ఇస్కూల్ దుస్థితి చూసి.. చలించిపోయిన ఒక రియల్ శ్రీమంతుడు స్పందించిన తీరు.. మొత్తం స్కూల్ ను గుర్తు పట్టలేనంతగా మార్చేసిన వైనం చూస్తే.. వావ్ అనకుండా ఉండలేం. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న స్కూల్ శిథిలావస్థకు చేరిన వేళ.. రియల్ హీరోలా ఎంట్రీ ఇవ్వటమే కాదు.. మొత్తంగా మార్చేసిన వైనం ఆసక్తికరంగానే కాదు.. స్ఫూర్తివంతంగా నిలుస్తుందని చెప్పక తప్పదు.
1918లో గడీచౌక ప్రభుత్వపాఠశాలను మైసూర్ మహారాజు క్రిష్ణరాజు వడయార్ IV హయాంలో ఏర్పాటైంది. ఈ స్కూల్ లో బీఆర్ సచ్చిదానంద మూర్తి 1950లలో చదువుకున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. కొన్నేళ్ల క్రితం సొంతూరుకు వచ్చిన ఆయన.. స్కూల్ చూసేందుకు వెళ్లటం.. బడి దుస్థితిని చూసిన ఆయన చలించిపోయారు. స్కూల్ రూపురేఖల్ని మార్చాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా 2024లో రూ.1.64 కోట్ల విరాళంతో పునరుద్ధరణకు పూనుకున్నారు. అనంతరం మరో రూ.1.90 కోట్లు సమకూర్చారు.
ఆయన చొరవను చూసిన స్థానిక ప్రజా ప్రతినిధులు.. దాతలు.. విద్యాశాఖ అధికారులు ఎవరికి తోచిన సాయం వారు చేయటం మొదలుపెట్టారు. ఇలా క్లాస్ రూంలు.. ఆడిటోరియం.. కిచెన్ లాంటి నిర్మాణాల్ని చేపట్టారు. కంప్యూటర్లు.. ఇంటర్నెట్ కనెక్టివిటీ.. స్మార్ట్ క్లాస్ మౌలిక సదుపాయాల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాదు.. హైటెక్ హంగుల్ని స్కూల్ కు సమకూర్చారు. ఆయన పడిన శ్రమకు ఫలితం దక్కుతోంది. ఇప్పుడీ స్కూల్ చుట్టుపక్కల వారందరిని ఆకర్షించటమే కాదు.. ఈ ఇస్కూల్ లో చదువుకోవటానికి ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు కూడా రావటం చూసినప్పుడు.. ఇది కదా అసలుసిసలు విజయం అనుకోకుండా ఉండేలం. ఏమైనా.. రియల్ శ్రీమంతుడిగా సచ్చిదానంద మూర్తిని అభినందించాల్సిందే.