టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌ను వదిలేసిన పోలీసులు
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌ను శంషాబాద్ రూరల్ పోలీసులు స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.;
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌ను శంషాబాద్ రూరల్ పోలీసులు స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. సోమవారం జరగనున్న పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉండటంతో ఆయనకు నోటీసులు ఇచ్చి వదిలిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.
మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడి చేయగా టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌తో పాటు పలువురు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో ఎంపీతో పాటు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా మొత్తం ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది.
ఈ కేసులో ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌తో పాటు ప్రియాంక రెడ్డికి కూడా స్టేషన్ బెయిల్ మంజూరు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో సహకరించాలని ఇద్దరికీ నోటీసులు ఇచ్చి పంపించినట్లు తెలిపారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్ రెడ్డి, నమిత్ తదితరులను ఉప్పరపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ దర్యాప్తును వేగవంతం చేసింది. మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని ఒక్కొక్కరిని విచారిస్తూ కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ పార్టీకి కొకైన్ ఎక్కడి నుంచి వచ్చింది, సరఫరా చేసిన నెట్‌వర్క్ ఎవరిది అనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఫామ్‌హౌస్‌లో లభించిన ఆధారాలు, ఫోన్ కాల్ డేటా, పార్టీకి హాజరైన వ్యక్తుల వివరాలను విశ్లేషిస్తూ డ్రగ్స్ సరఫరా వ్యవస్థను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే మరికొంతమందిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇక ఈ కేసు రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారి తీసింది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ వచ్చిన ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌ను వెంటనే పదవి నుంచి సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎంపీ డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం సిగ్గుచేటని ఆమె విమర్శించారు.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం బాధ్యతారాహిత్యమని షర్మిల అన్నారు. డ్రగ్స్ వాడుతూ పట్టుబడిన ప్రజాప్రతినిధి సమాజానికి ఏ సందేశం ఇస్తారని ప్రశ్నించారు. యువత డ్రగ్స్ వైపు వెళ్లేలా ఇది ప్రోత్సాహం ఇచ్చే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ఎంపీ ఏమి సమాధానం చెబుతారని కూడా ఆమె నిలదీశారు.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు రోజురోజుకీ కొత్త కోణాలు బయటకు తీసుకువస్తోంది. డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌ను పూర్తిగా బట్టబయలు చేసేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించగా, ఈ కేసు రాజకీయంగానూ మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.