అమెరికా ప్రజాస్వామ్యం ఎంత ‘సురక్షితమో’ అర్థమైపోతోంది..

అబ్బో.. ప్రపంచానికి పాఠాలు చెప్పే ‘గ్లోబల్ దొర’ అమెరికా కే డోకా పడిందన్నమాట.. మన వైట్ హౌస్ వారు తీరిగ్గా నిద్రలేచి ఒక సంచలన నిజం కనిపెట్టారు.

Update: 2026-07-31 11:30 GMT

అబ్బో.. ప్రపంచానికి పాఠాలు చెప్పే ‘గ్లోబల్ దొర’ అమెరికా కే డోకా పడిందన్నమాట.. మన వైట్ హౌస్ వారు తీరిగ్గా నిద్రలేచి ఒక సంచలన నిజం కనిపెట్టారు. చైనా దొంగలు వచ్చి ఏకంగా 22 కోట్ల మంది అమెరికన్ ఓటర్ల డేటాను జేబులో వేసుకుని పోయారట.. హ్యాకింగో, కొనుగోలో, లేక దొంగతనమో గానీ.. మొత్తానికి 'పిన్ను నుంచి ప్లేను' దాకా ప్రతీదీ తయారు చేసే చైనా ఈసారి అమెరికన్ల ఓటరు వివరాలను కూడా తమ "మేడ్ ఇన్ చైనా" లిస్టులో చేర్చేసుకుంది.

'డిజిటల్ దొంగతనం' వెనుక పెద్దల ఆశీస్సులు

పాపం అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అన్నీ కలిసి కూర్చుని తలలు పట్టుకుని "అయ్యో.. మన పౌరుల రహస్యాలన్నీ డ్రాగన్ నోట్లోకి వెళ్ళిపోయాయే" అని సర్టిఫై చేశాయి. అధ్యక్షుల వారు "ప్రజల పారదర్శకత" కోసం డీక్లాసిఫై చేశామని గొప్పగా చెప్పుకుంటున్నారు గానీ.. అసలు గుట్టు బయటపడ్డాక ఇంక దాచడానికి ఏముందని నిట్టూరుస్తున్నాయి.

డ్రాగన్ 'షాపింగ్' మోజు.. 2022 లోనే కథ ముగిసింది

అసలు కథేంటంటే.. ఈ చైనా నెట్‌వర్క్ గ్రూపులు 2022లోనే సైలెంట్‌గా షాపింగ్ పూర్తి చేశాయట. అప్పటినుంచి ఇప్పటివరకు "చైనా మా డేటా దొంగిలించిందోచ్" అని భుజాలు తడుముకోవడానికే అమెరికా ఏజెన్సీలకు నాలుగేళ్లు పట్టింది. వైట్ హౌస్ వారు మళ్ళీ దీనికి రెండు క్లాసులు కూడా పీకారు. అంటే మాటలతో బ్రెయిన్‌వాష్ చేయడం... అంటే డైరెక్ట్‌గా సిస్టమ్‌లోకి దూరి ఓటర్ల పేర్లు మార్చేయడం. అసలు భయం ఏంటంటే రేపు పొద్దున్న ఎన్నికల రోజున అమెరికన్ ఓటరు పోలింగ్ బూత్‌కు వెళ్తే.. "బాబాయ్ నీ ఓటు ఎప్పుడో చైనాలోని బీజింగ్ బూత్‌కి షిఫ్ట్ అయిపోయింది. నీకు కేవలం ‘ప్రొవిజనల్’ బ్యాలెట్ మాత్రమే దిక్కు" అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు..

డేటాతో చైనా ఏం చేస్తుంది?

22 కోట్ల మంది డేటా చేతిలో ఉంటే చైనా ఊరికే ఉంటుందా? ఓటరు అభిరుచులను బట్టి "ఏ ట్రంప్ బొమ్మ ఉన్న టి-షర్టులు అమ్మాలి? ఎవరికి ఎలాంటి ఫేక్ న్యూస్ నోటిఫికేషన్ పంపాలి?" అని పక్కా ప్లాన్ వేసుకుంటుంది. ఎన్నికల రోజున సిస్టమ్స్‌ను కాసేపు 'హ్యాంగ్' చేసి కామెడీ చూడొచ్చు.

మొత్తానికి ప్రపంచమంతటా సూపర్ పవర్ అని ముసుగు కప్పుకునే పెద్దన్న, తన సొంత ఇంటెలిజెన్స్ కళ్లముందే డేటాను చైనాకు ప్లేటులో పెట్టి ఇచ్చేసి, ఇప్పుడు "అయ్యో జోక్యం చేసుకున్నారు" అని రోదించడం చూస్తుంటే.. అమెరికా ప్రజాస్వామ్యం ఎంత ‘సురక్షితమో’ అర్థమైపోతోంది.

Tags:    

Similar News