మూసీని మురికి కూపంగా మార్చారా? పదేళ్లు మనమేం చేశాం కేటీఆర్?

అధికారంలో ఉన్న వారిపై విపక్షంలో ఉన్నోళ్లు విరుచుకుపడటం కామన్. అందులో తప్పేం లేదు.;

Update: 2026-03-15 14:30 GMT

అధికారంలో ఉన్న వారిపై విపక్షంలో ఉన్నోళ్లు విరుచుకుపడటం కామన్. అందులో తప్పేం లేదు. కాకుంటే.. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామన్న విషయాన్ని చెబుతూ.. ప్రస్తుతం అధికారంలో ఉన్నోళ్లు ఏం చేయలేదో చెబితే బాగుంటుంది. కానీ.. గులాబీ యువరాజు కేటీఆర్ మాత్రం అందుకు భిన్నం. తాము అధికారంలో ఉన్న పదేళ్లలో ఏం చేయని అంశాలను సైతం.. చాలా చేసినట్లుగా చెబుతూ.. ప్రస్తుత ప్రభుత్వం చేస్తామని చెప్పే ప్రాజెక్టులను ప్రశ్నించే తీరు చూస్తే.. ఇంతకు మించిన సెల్ఫ్ గోల్ ఇంకేమైనా ఉంటుందా? అన్నది ప్రశ్న.

రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి మూసీ సంగతి తేల్చేయాలని.. ఇప్పటివరకు మరే పాలకుడు చేయలేని.. చేయటం సాధ్యం కాని మూసీ ప్రాజెక్టును చేపట్టటమే కాదు.. దాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తానని చెప్పే ఆయన తీరు కొత్త ఆశల్ని రేకెత్తేలా చేస్తుందని చెప్పాలి. ఇప్పటికే మూసీ ప్రాజెక్టు మీద పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం జరుగుతున్న వేళ.. శుక్రవారం సాయంత్రం మూసీ అంశంపై తాజ్ క్రిష్ణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన దాదాపు 500 మందితో కూడిన పెద్ద మనుషులతో కార్యక్రమాన్ని నిర్వహించటం.. మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగంగా తామేం చేయనున్న విషయాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన ద్వారా వివరించిన సీఎం రేవంత్.. ఆ తర్వాత ప్రాజెక్టు అంశం తనకెంత కీలకమన్నఅంశాన్ని తన ప్రసంగంతో చెప్పేశారు.

తమ ప్రభుత్వం మూసీ ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వటంతో పాటు.. ప్రాజెక్టులోని మొదటి దఫాకు సంబంధించిన వివరాల్ని సవివరంగా వెల్లడించారు. రెండేళ్ల కాల పరిమితితో పూర్తి చేయాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి.. సరిగ్గా ఎన్నికలకు ముందు తన కలల ప్రాజెక్టును మాటల్లో కాకుండా చేతల్లో చూపించటం ద్వారా.. రెండో దఫా అధికారానికి పర్ ఫెక్టు అజెండాను ఎంచుకున్నట్లుగా చెప్పాలి. అయితే.. ఇదంతా ఆయన చెబుతున్నట్లుగా చేతల్లో చేసి చూపిస్తేనే. నిజాం తర్వాత మళ్లీ మూసీని పట్టించుకున్న నాథుడు లేడని చెప్పిన వైనాన్ని చూసినప్పుడు గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాన్ని ఒప్పుకున్నట్లు అవుతుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా మూసీ మీద పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన కేటీఆర్.. మూసీని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్ పార్టీనేనని.. గత పాపాలకు ముక్కు నేలకు రాసి సీఎం.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న మాటల్ని చూస్తే.. కేటీఆర్ రాజకీయ అపరిపక్వత.. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సరిగా ప్రిపేర్ కాని నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తన నోటి నుంచి ఈ తరహా మాటలు వచ్చింతనే.. కాంగ్రెస్ పాపం చేసింది సరే.. పదేళ్లు నాన్ స్టాప్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పాపాన్ని పూర్తిగా కడిగేసి.. ప్రక్షాళన ఎందుకు చేయలేదు? అన్నది ప్రశ్న. అంతేనా.. కేసీఆర్ హయాంలో మూసీలో స్పీడ్ బోటింగ్ చేపడతామన్న మాటల్ని చెప్పి.. అదేమీ చేయని వైఫల్యాలు ఎవరివి కేటీఆర్? అని గట్టిగా అడిగే పరిస్థితి తన మాటలతో కేటీఆర్ మరోసారి తీసుకొచ్చారని చెప్పాలి. ఇలా.. సెల్ఫ్ గోల్ తరహాలో వ్యాఖ్యలు చేయటం కేటీఆర్ కే చెల్లుతుందని చెప్పక తప్పదు. రాజకీయ చతురతతో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్న రేవంత్ సర్కారును అంతే తెలివితోనే ఢీ కొట్టేలా చేయాలే తప్పించి.. ఇలా తన మాటలతో తానే ఆత్మరక్షణలో పడే తీరును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి.. ఈ విషయాన్ని కేటీఆర్ ఎప్పుడు గుర్తిస్తారో చూడాలి.

Tags:    

Similar News