బెజవాడలో రౌడీల బీభత్సం.. మత్తులో తూగుతూ ఢీ కొట్టేసి వెళ్లిపోయారు
ఈ ఉదంతంలో బెజవాడకు చెందిన రౌడీ షీటర్లు పెద్ద చిచ్చా.. చిన్న చిచ్చాలతో పాటు దినేష్.. అతని స్నేహితుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.;
సినిమాల్లో మాత్రమే చూసే దుర్మార్గపు సీన్లను రియల్ లైఫ్ లో చూపించారు బెజవాడకు చెందిన రౌడీషీటర్లు. తమకు ఎదురే లేదన్నట్లుగా వ్యవహరించటమే కాదు.. తమను ఎవరూ ఏమీ చేయరన్న బలుపును ప్రదర్శిస్తూ.. మద్యం మత్తులో కారును నిర్లక్ష్యంగా నడుపుతూ తీవ్రంగా గాయపడేలా చేశారు. చెలరేగిపోయిన బెజవాడ రౌడీషీటర్ల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. పిల్లలు.. పెద్దలు ఉన్న బబ్బూరి గ్రౌండ్స్ లో డేంజర్ అన్న మాటలకు మరింత రెచ్చిపోయారు. కారును ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ.. నలుగురి మీదకు కారును ఎక్కించటమే కాదు.. వారు తీవ్రంగా గాయపడినా పట్టించుకోకుండా పోయిన ఈ దుర్మార్గం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఈ ఉదంతంలో బెజవాడకు చెందిన రౌడీ షీటర్లు పెద్ద చిచ్చా.. చిన్న చిచ్చాలతో పాటు దినేష్.. అతని స్నేహితుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పున్నమిఘాట్ సమీపంలో రహదారి మీకు వచ్చిన ఈ ఐదుగురు.. మద్యం మత్తులో కారును అతి వేగంగా తిప్పుతూ ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడ్డారు. అతి వేగంగా రౌండ్లు వేస్తున్న వారిపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు తిరుగుతున్న చోట.. ఇలా చేయటమేమిటి? అన్న ప్రశ్నకు వారు మరింత రెచ్చిపోయారు,
కారులో నుంచి దిగిన చిన్న చిచ్చా చెలరేగిపోతూ.. ‘‘నేనెవరో తెలుసా’’ అంటూ బెదిరింపులకు దిగటమే కాదు.. కారులో ఉన్న పెద్ద చిచ్చా ప్రమాదకర వేగంతో కారును ముందుకు పోనిచ్చాడు. తమ కారుతో పదేళ్ల బాలుడ్ని ఢీ కొట్టటంతో పాటు.. మరో ముగ్గురిని ఢీ కొట్టుకుంటూ వెళ్లిపోయారు. ఐస్ క్రీం తినేందుకు తండ్రితో వచ్చిన పదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన అందరిని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సీసీ కెమేరా ఫుటేజ్ తో ఈ కారును రామవరప్పాడుకు చెందిన రాజేష్ దిగా గుర్తించారు. ఇప్పటికే పెద్ద చిచ్చా.. చిన్న చిచ్చాలపై టూటౌన్ స్టేషన్ లో రౌడీషీట్ ఉన్న విషయాన్ని గుర్తించారు. ఇక్కడే పెద్ద చిచ్చా గురించి చెప్పాలి. ఒళ్లంతా బ్లేడ్ గాట్లు.. టాటూలతో ఇన్ స్టాలో రీల్స్ చేస్తుంటాడు. భయపెట్టే డైలాగులతో పోలీసులను ఉద్దేశిస్తూ రీల్స్ చేయటం అతడికి అలవాటుగా చెబుతున్నారు. తాజా ఘటన నేపథ్యంలో ఆదివారం రాత్రి పదకొండు గంటల సమయంలో కారును.. చిన్న చిచ్చా.. భార్గవ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బలుపు ప్రదర్శించే ఇలాంటి వారికి పోలీసులు తమదైన శైలిలో ట్రీట్ మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.