జగన్‌ను మోసేస్తున్నారా.. భ్రమలో బతికేస్తున్నారా ..!
ఈ క్రమంలో పంచ్ ప్రభాకర్ వంటి సీమ కు చెందినవారు.. తీవ్ర దూషణలు.. బూతులతో చానెళ్లను హోరెత్తించారు.;

వైసీపీ అధినేత జగన్‌ను మోసేస్తున్నామని.. ఆయనను వెనుకేసుకు వస్తున్నామని భావిస్తున్న నాయకులు, ఇతర మేధావి వర్గాలు కూడా.. ఆత్మ విమర్శ చేసుకునే టైం వచ్చేసింది. ఇప్పటి వరకు జరిగినవి.. ఇప్పుడు జరుగుతున్నవి కూడా.. జగన్‌కు పేరు తేవడం మాట ఎలా ఉన్నా.. ఆయనను బద్నాం చేస్తున్నారనే చెప్పాలి. గత ఎన్నికలకు ముందు కూడా.. అమెరికా నుంచి అండమాన్ వరకు.. జగన్‌ను మోసేస్తూ.. చాలా మంది యూట్యూబ్ చానెళ్లను నడిపారు.
ఈ క్రమంలో పంచ్ ప్రభాకర్ వంటి సీమ కు చెందినవారు.. తీవ్ర దూషణలు.. బూతులతో చానెళ్లను హోరెత్తించారు. ఇక, స్థానికంగానే చాలా మంది అప్పట్లో చంద్రబాబును.. పవన్ కల్యాణ్‌ను కూడా టార్గెట్ చేసుకున్నారు. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఇవి జగన్‌కు మేలు చేస్తాయని.. ఆయనను ఎన్నికల్లో గెలిపిస్తాయని వారు భావించి ఉంటారు. కానీ.. అలా జరగలేదు. పైగా.. అవి మరింతగా పార్టీని.. జగన్‌ను ప్రజల్లో డైల్యూట్ చేశాయి.
అయితే.. ఇక్కడ తప్పువారిది మాత్రమేనా? అంటే.. కాదు. పార్టీ అధినేతగా.. జగన్ ఓ కంట కనిపెట్టి ఉంటే.. పరుషంగా మాట్లాడేవారిని.. తీవ్రస్థాయిలో దూషించేవారిని అడ్డుకుని ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ, ఆయన అలా చేయలేదు. పైగా.. వారికి మద్దతుగా నిలిచారన్న అపప్రదను కూడా మూటగట్టుకున్నారు. ఫలితంగా.. వారంతా రెచ్చిపోయారు. ఈ పరంపరే ఎన్నికల్లో ఫలితం దారుణంగా వచ్చేలా చేసిందన్నది వాస్తవం.
ఇక ఇప్పటికీ కూడా నాయకులు , మేధావి వర్గాలుగా ఉన్నవారు కూడా.. మారడం లేదు. పైగా.. ఎలా బడితే అలా వ్యాఖ్యానించడం ద్వారా జగన్ దగ్గర మెప్పు పొందాలన్న భ్రమలో బతికేస్తున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదన్న సామెతను వారు మరిచిపోతున్నారు. ప్రజలకు చేరువ కావడంలో నోరును అదుపులో పెట్టుకుని వ్యవహరించకపోవడం.. మంత్రులుగా ఉన్నవారు కూడా.. నోటికి హద్దు అదుపు లేకుండా వ్యవహరించడం.. వైసీపీని, జగన్‌ను కూడా నాశనం చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది.