శుక్రవారం రాత్రి మళ్లీ చేతులు కాల్చుకున్న పాక్... ఏమి జరిగిందంటే?

ఎప్పటిలాగానే పాక్ దుస్సాహసాన్ని భారత్ తిప్పికొట్టింది. ఆ డ్రోన్ లను విజయవంతంగా నిర్వీరం చేసింది భారత సైన్యం.;

Update: 2025-05-10 04:52 GMT

గురు-శుక్రవారం మధ్య రాత్రి 36 ప్రాంతాల్లో సుమారు 300 నుంచి 400 ప్రాంతాల్లో డ్రోన్లను ప్రయోగించిన పాకిస్థాన్ కు భారత్ గట్టిగానే బుద్ది చెప్పిన సంగతి తెలిసిందే. వందల సంఖ్యలో టర్కిష్ డ్రోనలు ప్రయోగించగా.. భారత్ వాటిని గాల్లోనే నాశనం చేసింది. ఈ క్రమంలో శుక్ర-శనివారం మాధ్య రాత్రి చీకటి చిక్కబడిన తర్వాత పాక్ మరోసారి పెట్రేగిపోయింది.

అవును... శుక్రవారం పగలు కాస్త సైలంట్ గా ఉన్నట్లు కనిపించిన పాకిస్థాన్.. రాత్రి చీకటి చిక్కబడిన తర్వాత చెలరేగే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా... భారత్ లోని 26 ప్రాంతాలపైకి వరుసగా డ్రోన్లను ప్రయోగించింది. ముఖ్యంగా శ్రీనగర్ ఎయిర్ పోర్ట్, అవంతీపొరా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ లు ప్రయోగించింది.

అయితే.. ఎప్పటిలాగానే పాక్ దుస్సాహసాన్ని భారత్ తిప్పికొట్టింది. ఆ డ్రోన్ లను విజయవంతంగా నిర్వీరం చేసింది భారత సైన్యం. మరోవైపు అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి జమ్మూ, సాంబ జిల్లాల్లో ఫిరంగులతో విరుచుకుపడింది.. వాటితో పాటు పఠాంకోట్, జైసల్మేర్, ఉధంపుర్, అఖ్నూర్, నగ్రోటా ప్రాంతాలపైకి 50 డ్రోన్లను పంపింది. అయితే సైన్యం వాటిని నిర్వీర్యం చేసింది.

శుక్రవారం జమ్మూకశ్మీర్ సరిహద్దుల ద్వారా భారత్ లోకి ప్రవేశించాలనుకున్న ఏడుగురు ఉగ్రమూకలను బీ.ఎస్.ఎఫ్. మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో శుక్రవారం రాత్రి దొంగదెబ్బ కొట్టడానికి పాక్ చేసిన ప్రయత్నాలకు భారత సైన్యం ధీటుగా సమాధానం ఇచ్చింది. దీంతో... గురువారం రాత్రి లాగానే శుక్రవారం కూడా పాక్ కు అదే గతి పట్టింది.

పాక్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులు!:

భారత్ పై దాడులకు ప్రయత్నించడం, భంగపడటం.. ఆనాక పాక్ పై భారత్ ప్రతీకారం తీర్చుకోవడం.. దీంతో దాయాదీ లబోదిబో మనడం రెండు రోజులుగా ఇదే జరుగుతుంది! ఈ క్రమంలో సరిహద్దుల వెంట 26 ప్రదేశాల్లో డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిన పాక్ ప్రయత్నానికి ప్రతీకారంగా భారత్ తనదైన శైలిలో స్పందించింది. పాక్ ను గట్టిగా వణికించింది.

ఇందులో భాగంగా... తమ దేశంలోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేసిందని పాక్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదురి తెలిపారు. పాక్ సైన్యం హెడ్ క్వార్టర్స్ ఉన్న రావల్పిండి చక్లాలలోని నూర్ ఖాన్.. చక్వాల్ లోని మురీద్, జాంగ్ జిల్లా షోర్కోట్ లో ఉన్న రఫీ వైమానిక స్థావరాల్లో పేలుళ్లు జరిగాయి!

రాజౌరీలో ఐదుగురు మృతి!:

ఉద్రిక్తల నడుమ సరిహద్దుల్లో కాల్పులతో పాటు డ్రోన్లతోనూ పాకిస్థాన్ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో జమ్మూకశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్ కుమార్ థప్పా ప్రాణాలు కోల్పోయారు. రాజౌరీలోని ఆయన ఇంటిపై పాకిస్థాన్ ఫిరంగులు పడటంతో ఆయన మృతి చెందారు. ఇదే సమయంలో అదే పట్టణంలో మరో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

పంజాబ్ లో ఒకే ఫ్యామిలీలో ముగ్గురికి గాయాలు!:

పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో రాత్రి పాకిస్థాన్ డ్రోన్ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గాయపడ్డారు. వారికి కాలిన గాయాలవ్వగా... వారిలో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఆమె శరీరంపై ఎక్కువచోట్ల కాలిందని తెలిపారు. దీంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

పాక్ డ్రోన్ లాంచ్ ప్యాడ్ ధ్వంసం!:

జమ్మూలోని నియంత్రణ రేఖకు అవతలివైపు ఉన్న పాకిస్థాన్ సైనిక పోస్టును భారత దళాలు ధ్వంసం చేశాయి. ఉగ్రవాదులు సరిహద్దు దాటి భారత్ లోకి ప్రవేశించేందుకు దీన్ని లాంచ్ ప్యాండ్ గా వాడుకుంటున్నారని అంటున్నారు. దీంతోపాటు ట్యూబ్ డ్రోన్లను భారత్ పైకి ప్రయోగించడానికి ఏర్పాటు చేసుకున్న లాంచ్ ప్యాడ్ ను భద్రతా దళాలు ధ్వంసం చేశాయి.

త్రివిధ దళాల అధిపతులతో మోడీ సమావేశం:

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. పాక్ దుస్సాహసాలకు ఒడిగడుతూనే ఉంది. ఈ సమయంలో శుక్రవారం రాత్రి ప్రధాని మోడీ త్రివిధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. సరిహద్దుల్లోని తాజా పరిస్థితిని సమీక్షించారు. ప్రధానంగా సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ సీఎంలతో మోడీ ఫోన్ లో మాట్లాడారు.

ఈ సమావేశంలో ప్రధాని మోడీ, త్రివిధ దళాల అధిపతులతో పాటు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, భద్రతా సలహాదారు అజీత్ దోవల్ పాల్గొన్నారు.

Tags:    

Similar News