ఇజ్రాయెల్ దాడులపై భారత్ రియాక్షన్ ఇదే... చైనా బ్యాచ్ కు షాక్!?
పశ్చిమాసియా అట్టుడికిపోతోంది. ఆ ప్రాంతం మరింత సంక్షోభంలోకి నెట్టివేసేలా ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రతరమైంది.;
పశ్చిమాసియా అట్టుడికిపోతోంది. ఆ ప్రాంతం మరింత సంక్షోభంలోకి నెట్టివేసేలా ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రతరమైంది. ఇరు దేశాలు గురువారం రాత్రి నుంచి అవిరామంగా విధ్వంసక దాడులకు పాల్పడ్డాయి. ఘర్షణలకు ఆజ్యంపోసేలా భీకర హెచ్చరికలూ చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో షాంఘై సహకార సంస్థ (ఎస్.సీ.వో) ప్రకటించిన విధానానికి భిన్నమైన ప్రకటన భారత్ చేసింది.
అవును... ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధం గురువారం రాత్రి మొదలై గంట గంటకూ తీవ్రమవుతోంది. ఇరాన్ అణుస్ధావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ తీవ్రమవూతూ కొనసాగుతోంది. దీంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. దీంతో ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు తీవ్రతరమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ యుద్ధంపై షాంఘై సహకార సంస్థ (ఎస్.సీ.వో) ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. ఎస్.సీల్.ఓలో మరో సభ్యదేశమైన భారత్ ఈ ప్రకటనకు పూర్తి భిన్నమైన వాణిని వినిపించింది. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడిని ఎస్.సీ.వో ఖండించగా.. భారత్ మాత్రం తాను గతంలో చెప్పిన విధానాన్నే అనుసరిస్తున్నట్టు ప్రకటించింది.
ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉన్న సమస్యను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించేందుకు అంతర్జాతీయ సమాజం కృషి చేయాలని భారత్ కోరింది. దీనిపై మరింత స్పందిస్తూ.. ఎస్.సీ.వో.కు తమ వైఖరిని ముందుగానే తెలియజేశామని, సంస్థ విడుదల చేసిన ప్రకటనకు సంబంధించిన చర్చల్లో తాము పాల్గొనలేదని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
మరోవైపు... పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని, ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తున్నామని ఎస్.సీ.వో ఒక ప్రకటనలో పేర్కొంది.
కాగా... ఎస్.సీ.వో.లో భారత్ తో పాటు చైనా, రష్యా, పాకిస్థాన్, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, బెలారస్ వంటి దేశాలు సభ్యత్వం కలిగివున్నాయి. ఆర్థిక, భద్రతాపరమైన అంశాలపై సహకారం అందించుకోడానికి ఏర్పడిన ఈ సంస్థకు ప్రస్తుతం చైనా అధ్యక్షత వహిస్తోంది.