తల్లిని గెంటేశారు.. ఇంటిని సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు!
ఇంతకూ ఏం జరిగిందంటే.. మూసారంబాగ్ కు చెందిన శకుంతలా బాయి (90)కు ఇద్దరు కొడుకులు.. నలుగురు కుమార్తెలు.;
అమానవీయ సంఘటన చోటు చేసుకుంది హైదరాబాద్ లో. కని పెంచిన కన్నతల్లిని చూసుకోవటం తర్వాత.. ఆమెను ఇంటి నుంచి గెంటివేసిన ఉదంతంపై హైదరాబాద్ రెవెన్యూ అధికారులు అనూహ్యంగా స్పందించారు. తల్లిని ఇంటి నుంచి గెంటివేసిన వైనంపై సీరియస్ అయిన ప్రభుత్వం.. ఆ కొడుకులకు దిమ్మ తిరిగేలా షాకిచ్చారు. హైదరాబాద్ లోని మలక్ పేట పరిధిలోని మూసారంబాగ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్ద వయసులో తల్లిదండ్రుల బాగోగులు చూసుకోని పిల్లలకు సరైన గుణపాఠం అన్నట్లుగా వ్యవహరించిన అధికారుల తీరును పలువురు అభినందిస్తున్నారు.
ఇంతకూ ఏం జరిగిందంటే.. మూసారంబాగ్ కు చెందిన శకుంతలా బాయి (90)కు ఇద్దరు కొడుకులు.. నలుగురు కుమార్తెలు. ఆమె భర్త చాలా కాలం క్రితమే మరణించారు. అప్పటి నుంచి తన ఇంట్లో కొడుకుల వద్ద ఉండేది. పెద్ద వయసులో ఉన్న తల్లి ఆలనా పాలనా చూడాల్సిన కొడుకులు ఆమెను పట్టించుకోవటం మానేయటమే కాదు.. నిర్లక్ష్యంతో ఆమెను ఇంట్లో నుంచి బలవంతంగా బయటకు పంపేశారు.
దీంతో.. ఎటు పోవాలో దిక్కుతోచని స్థితిలో చిన్న కుమార్తె వద్ద ఉంటోంది. ఇలాంటి వేళ..తన కొడుకులు చేసిన పనిని అధికారుల ద్రష్టికి తీసుకొచ్చారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి హైదరాబాద్ జిల్లా ఆర్డీవోను 2024 ఫిబ్రవరిలో ఆశ్రయించారు. దీంతో స్పందించిన అధికారులు ఇద్దరు కొడుకుల్ని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇందులో భాగంగా ఇంటిని తల్లికి ఇస్తామని మాట ఇచ్చారు.కానీ.. నెలలు గడుస్తున్నా.. ఇంటిని ఖాళీ చేయలేదు సరికదా.. అధికారుల ఆదేశాల్ని పక్కన పెట్టేశారు.
ఈ క్రమంలో సైదరాబాద్ తహశీల్దారు జయశ్రీ మూడు రోజుల క్రితం శకుంతలా బాయి కొడుకులు ఇద్దరికి ఫైనల్ నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల్లో ఇంటిని ఖాళీ చేయకుంటే ఇంటిని సీజ్ చేస్తామని చెప్పారు. అధికారులు నిర్దేశించిన గడువు పూర్తి కావటంతో సిబ్బందితో సహా వచ్చిన తహసీల్దార్ కు ఇంటికి తాళం వేసి ఉన్న అంశాన్ని గుర్తించారు. కొడుకులకు కబురు పంపినా అందుబాటులోకి రాలేదు. దీంతో.. రెవెన్యూ సిబ్బంది ఇంటిని సీజ్ చేశారు. కొడుకులపై తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా నిర్ణయం తీసుకోనున్నారు. తల్లిదండ్రుల్ని చూసుకోకుండా వారిని గెంటేసే పిల్లలకు సరైన గుణపాఠాన్ని హైదరాబాద్ రెవెన్యూ అధికారులు తాజాగా చేపట్టారని చెప్పక తప్పదు.