ఏడాదిలో రూ.70 లక్షల కొకైన్ ఆర్డర్.. హైదరాబాదీ యువ వైద్యురాలి ఘనకార్యం

హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ వినియోగం ఎంతలా పెరిగిందన్న దానికి నిదర్శనంగా ఒక ఉదంతం వెలుగు చూసింది.;

Update: 2025-05-10 04:21 GMT

హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ వినియోగం ఎంతలా పెరిగిందన్న దానికి నిదర్శనంగా ఒక ఉదంతం వెలుగు చూసింది. ఒక యువ వైద్యురాలు.. అది కూడా ఒక ప్రముఖ కుటుంబానికి చెందిన యువ వైద్యురాలు ఆన్ లైన్ లో డ్రగ్స్ కొనుగోలు చేసి.. డెలివరీ తీసుకుంటున్న వేళలో పోలీసులు పట్టుకున్న ఉదంతం తాజాగా బయటకు వచ్చింది. ముంబయిలోని డ్రగ్స్ డీలర్లతో నేరుగా లావాదేవీలు చేసిన వైనం షాకింగ్ గా మారింది. వాట్సప్ లో ఆర్డర్ పెట్టి.. ఆన్ లైన్ లో పేమెంట్ చెల్లించిన ఆమె డ్రగ్స్ ను తెప్పించుకుంటోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏడాదిలో రూ.70 లక్షల మేర డ్రగ్స్ తెప్పించుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మత్తు పదార్థాలకు బానిసగా మారిన ఈ మహిళా వైద్యురాలి ఉదంతం పోలీసులను సైతం విస్మయానికి గురి చేసింది. తాజాగా రూ.5 లక్షల విలువైన 53 గ్రాముల కొకైన్ ను ఆర్డర్ పెట్టగా.. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో.. రాయదుర్గం పోలీసులకు ఆమె దొరికిపోయారు. నగరంలోని ఒక ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలో ఆమె నివాసం ఉంటున్నారు.

ఆమె తరచూ థానే వెళ్లేవారని.. అక్కడి ఒక పబ్బులో డీజేపీ పరిచయమయ్యాడు. అతడి ద్వారా సదరు మహిళా డాక్టర్ క్రమంగా డ్రగ్స్ కు బానిసయ్యారు. సదరు డీజేపీ ద్వారా ముంబయికి చెందిన డ్రగ్స్ దందా చేసే వంశ్ ఠక్కర్ తో పరిచయం పెంచుకుంది. ఇటీవల రూ.5 లక్షలు విలువ చేసే కొకైన్ ను ఆర్డర్ చేసింది. వంశ్ అనుచరుడు డెలివరీ బాయ్ గా పని చేసే బాలక్రిష్ణ అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్ కు పంపారు. సమాచారం అందుకున్న టీజీ న్యాబ్ పోలీసులు నిఘా పెట్టి.. గురువారం ఆమెకు సరుకు అందజేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఒక మహిళా వైద్యురాలు అయి ఉండి ఇంత భారీగా డ్రగ్స్ ను వినియోగిస్తున్న వైనం షాకింగ్ గా మారింది,

Tags:    

Similar News